ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

దేశ పురోగతి కోసం ప్రజాఉద్యమాల నిర్మాణంలో పత్రికల పాత్ర కీలకం: ఉపరాష్ట్రపతి


- స్వచ్ఛభారత్ కార్యక్రమం ఓ ఉద్యమరూపు సంతరించుకోవడంలో మాధ్యమాలు పోషించిన పాత్ర అభినందనీయం

- ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రజా పక్షం వహించడం ప్రచార, ప్రసార మాధ్యమాల బాధ్యత

- రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తొలినాళ్ల నుంచి పత్రికలంటే తనకెంతో అభిమాన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

- వ్యవసాయం, మాతృభాష, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలని పత్రికలకు పిలుపు

Posted On: 12 NOV 2021 7:02PM by PIB Hyderabad

ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమైనా, చక్కటి పథకాలైనా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కూడిన ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ప్రచార, ప్రసార మాధ్యమాలు పోషించే పాత్ర అత్యంత కీలకమన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారి సానుకూల ఫలితాలు సాధించడంలో మీడియా పోషించిన పాత్ర అభినందనీయమన్నారు. ఈ స్ఫూర్తిని ఇకపైనా కొనసాగించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

శుక్రవారం నెల్లూరులో లాయర్ వార పత్రిక 40వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ‘తుంగా పండుగ’లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. నెల్లూరుకు చెందిన ప్రముఖులు జీవిత విశేషాలతో రూపొందించిన సచిత్ర పుస్తకాన్ని (కాఫీ టేబుల్ బుక్) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఎందరో మహనీయులు పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారని, మహాత్మాగాంధీ మొదలుకుని ఎందరో మహానుభావులు పత్రికల ద్వారా ప్రజాకోటిని జాగృతం చేశారని గుర్తుచేశారు. 

రాను రానూ పత్రికల విలువల్లో మార్పు వస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఇది కొందరికే వర్తించే అంశమే అయినా,  ఈ దిశగా ప్రతి పాత్రికేయుడు ఆలోచించాలని ఆయన సూచించారు. మన ఇంట్లో చెద మొదలైనప్పుడు.. ఆ ప్రభావం మన మీద కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

వ్యవసాయం, మాతృభాష, మహిళల సాధికారత, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, యువత, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల మీద ప్రధానంగా పత్రికలు దృష్టి కేంద్రీకరించాలని ఉపరాష్ట్రపతి అన్నారు. భారతదేశ సంస్కృతిలో మూలభాగమైన వ్యవసాయానికి పత్రికలు, టీవీలు ప్రాధాన్యతను మరింత పెంచాలని, కనీసం ఒక పేజీ, ఓ అరగంట కార్యక్రమం వ్యవసాయం కోసమే కేటాయించాలన్నారు. కొన్ని పత్రికలు, చానళ్లు ఈ దిశగా కృషిచేస్తున్నాయని మిగిలిన వారు కూడా ఈ దిశగా ముందడుగేయాలని ఆయన సూచించారు.

భాష విషయంలో పత్రికలు చేసిన, చేస్తున్న కృషి అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి, అయితే ప్రజల భాషను పత్రికలు స్వీకరిస్తే, పత్రికా భాషను ప్రజలు అర్ధం చేసుకుంటారన్నారు. భాషే లేనప్పుడు పత్రికల మనుగడ కూడా ప్రశ్నార్థకమౌతుందన్నారాయన.

‘మాతృభాషల పరిరక్షణ కోసం పత్రికలు నడుం బిగించాలి. భాషా పరిరక్షణ కోసం ప్రతి పత్రిక కృషి చేయాలి. భాష విషయంలో ఎంత నిక్కచ్చిగా ఉంటే మన పత్రిక విలువ అంత పెరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు. 

మహిళల సాధికారత, గ్రామాభివృద్ధి దేశాభివృద్ధికి కీలకమన్న ఉపరాష్ట్రపతి.. మహిళలు, అన్నదాతల కోసం పత్రికలు కూడా పని చేయాలన్నారు. వారిలో స్ఫూర్తిని పెంచే విధంగా కథనాలు, వార్తలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈరోజు భారతదేశంలో ప్రతి గ్రామానికి పత్రిక చేరుతోందని, అయితే గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని పత్రికలు నిబద్ధతతో కృషి చేస్తున్నాయనే విషయాన్ని మాత్రం ప్రశ్నించుకోవాలన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, పత్రికలు ప్రజాపక్షం వహించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, రాజకీయ రంగంలో ప్రవేశించిన తొలినాళ్ళ నుంచి.. ప్రతికలన్నా, పాత్రికేయులన్నా తనకెంతో అభిమానం. పత్రికలను చదవడం ద్వారా తాను ఎన్నో విషయాలను తెలుసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలోనూ ఎంతో మంది పాత్రికేయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజలకు వార్తలను అందించేందుకు తపించారన్న ఉపరాష్ట్రపతి, కర్తవ్య నిర్వహణలో కరోనా మహమ్మారి కారణంగా అసువులు బాసిన జర్నలిస్టులందరి స్మృతికి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు పాత్రికేయులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఎంతో బాధపడ్డానన్నారు. ఆ సమయంలో వారి కుటుంబాలకు తనకు చేతనైన సాయం కూడా చేశానని తెలిపారు.

పత్రికలు ఏర్పాటుచేయడం ఒక ఎత్తయితే.. దాన్ని నడిపించడం అంతకన్నా కష్టమైన విషయమన్న ఉపరాష్ట్రపతి.. నెల్లూరుకు చెందిన లాయర్ వార పత్రిక 40 ఏళ్లుగా నిరాటంకంగా సేవలందించడం అభినందించాల్సిన విషయమన్నారు. ఈ సందర్భంగా పత్రిక వ్యవస్థాపకులు శ్రీ తుంగా రాజగోపాలరెడ్డి గారి స్మృతికి నివాళులు అర్పించారు. ముక్కుసూటి మనస్తత్వంతో, నమ్మిన సిద్ధాంత కోసం, ఎంతవారినైనా ఎదిరించి పోరాడగలిగే రాజగోపాల రెడ్డి గారి వ్యక్తిత్వం ప్రతి జర్నలిస్టుకు ఆదర్శం కావాలన్నారు.

2002లో లాయర్ పత్రిక ‘అంతర్జాల పత్రిక’ను ప్రారంభించినప్పుడు, 2008లో 27వ వార్షికోత్సవానికి, 2011లో శ్రీ రాజగోపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణకు, లాయర్ పత్రిక 30వ వార్షికోత్సవాలకు కూడా తాను హాజరైన విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రతి గుర్తుచేసుకున్నారు. పత్రిక ద్వారా సంస్కృతి సంప్రదాయాలు, భాషకు పెద్ద పీట వేస్తున్న లాయర్ పత్రిక ఎంతో మంది మహనీయుల జీవితాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తదితర అంశాలకు సంబంధించి పుస్తకాలు ప్రచురిస్తున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.

శ్రీ తుంగా రాజగోపాల్ రెడ్డి గారు ప్రారంభించిన ఈ లాయర్ వార పత్రికను శ్రీ శివప్రభాత్ రెడ్డి నేతృత్వంలో వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకుపోతుండడం అభినందనీయమన్నారు. ఇదే నిజమైన వారసత్వమని, తాను కోరుకుంటున్నది కూడా ఇలాంటి వారసత్వాన్నే అని ఉపరాష్ట్రపతి అన్నారు. 

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి,లోక్ సభ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డి.ఆర్.డి.ఓ. ఛైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శ్రీనాథ్ రెడ్డి, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు శ్రీ వరప్రసాద్ రెడ్డి, లాయర్ పత్రిక సంపాదకులు శ్రీ శివప్రభాత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

****


(Release ID: 1771346) Visitor Counter : 296