వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా బాస్మతి పండించే ఏడు రాష్ట్రాల్లోని రైతులకు 75 అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలను ఏపిఈడీఏ నిర్వహించింది.

Posted On: 10 NOV 2021 2:30PM by PIB Hyderabad

సుగంధ భరితమైన మరియు పొడవైన బాస్మతి బియ్యం నాణ్యమైన ఉత్పత్తిని పెంచడం కోసం వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపిఈడీఏ) విభాగం..బాస్మతి ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (బిఈడిఎఫ్‌) బాస్మతి వరి సాగులో నిమగ్నమైన రైతులకు అవగాహన కల్పించడానికి వినూత్న చర్యలు చేపట్టింది.

ఈ కార్యక్రమాలలో భాగంగా బిఈడిఎఫ్‌..పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్ మరియు ఢిల్లీలోని బియ్యం ఎగుమతిదారుల సంఘాల సహకారంతో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖలు రైతులను ప్రోత్సహించడానికి 75 అవగాహన మరియు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాయి. బాస్మతి వరిని పండించే రాష్ట్రాల్లో వివిధ ఎఫ్‌పిఓ, ఎగుమతిదారుల సంఘాలు మొదలైన వాటికి బిఈడిఎఫ్‌ సాంకేతిక భాగస్వామిగా కూడా పాల్గొంటుంది.

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా బిఈడిఎఫ్‌ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ నగర్ జిల్లా జహంగీర్‌పూర్ గ్రామం నుండి జూలై 16, 2021న అవగాహన మరియు శిక్షణ వర్క్‌షాప్‌ను ప్రారంభించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ ఘటనను స్మరించుకోవడానికి  భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది.'పురుగుమందుల యొక్క న్యాయబద్ధమైన ఉపయోగం మరియు మంచి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం' అనే ఇతివృత్తాలపై దృష్టి సారించి రైతులకు అవగాహన ప్రచారాలు నిర్వహించబడ్డాయి.

నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేని సమస్యలను పరిష్కరించడానికి రైతులకు విత్తనోత్పత్తికి శిక్షణ ఇవ్వడం ఈ అవగాహన డ్రైవ్‌ల యొక్క మరొక లక్ష్యం.

ఈ వర్క్‌షాప్‌లో బాస్మతి సాగులో పురుగులు-తెగుళ్లు మరియు వ్యాధులను గుర్తించడం మరియు వాటి నివారణ గురించి రైతులకు వివిధ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. బాస్మతి ఎగుమతిలో సమస్యలు మరియు బియ్యం పరిశ్రమ అంచనాలు వంటి సమస్యలు కూడా  బాస్మతి సీజన్‌2021 సందర్భంగా అవగాహన డ్రైవ్‌లో సాగుదారులు మరియు ఎగుమతిదారుల దృష్టికి తీసుకురాబడ్డాయి.

ఇండో-గంగా మైదానాలలో పండించే బాస్మతి బియ్యం యొక్క ఏకైక సంరక్షకుడిగా ఏపిఈడీఏకి భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ ఇవ్వబడింది. ఫిబ్రవరి, 2016లో జారీ చేసిన GI సర్టిఫికేషన్ ప్రకారం పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ మరియు జమ్మూ మరియు కాశ్మీర్ ఏడు రాష్ట్రాలలోని 77 జిల్లాలను బాస్మతి వరి సాగు ప్రాంతంగా పేర్కొన్నారు.

బిఈడీఎఫ్‌ అవగాహన డ్రైవ్ సందర్భంగా శాస్త్రవేత్తలు బాస్మతి బియ్యం ఎగుమతిలో పురుగుమందుల అవశేషాల సమస్య మరియు స్థానిక భాషలలో నర్సరీ పెంపకం, సమీకృత పోషకాలు మరియు నీటి నిర్వహణతో సహా ఉత్పత్తి సాంకేతికత బదిలీ గురించి రైతులకు మరియు ఎగుమతిదారులకు వివరించారు.

ఏడు రాష్ట్రాల్లోని 75 వేర్వేరు ప్రదేశాలలో నిర్వహించిన వర్క్‌షాప్‌లలో పెద్ద సంఖ్యలో రైతులు, ఎగుమతిదారులు, ఎఫ్‌పిఓలు మొదలైనవారు పురుగుమందులను తెలివిగా ఉపయోగించడం మరియు మంచి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం గురించి తెలుసుకోవడానికి వచ్చారు.

పంజాబ్‌లో 25 అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి, ఉత్తరప్రదేశ్‌లో 21, హర్యానాలో 17, ఉత్తరాఖండ్‌లో 05, జమ్మూ & కాశ్మీర్‌లో 03 మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు ఢిల్లీలో రెండేసి చోట్ల నిర్వహించబడ్డాయి.

బాస్మతి వరి సాగు భారతీయ సంప్రదాయమని, ప్రపంచ మార్కెట్‌లో బాస్మతి బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉన్నందున ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం సమిష్టి బాధ్యత అని రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం ద్వారా తెలియజేశారు. రైతులు తమను తాము రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా basmati.net లో నమోదు చేసుకోవాలని అభ్యర్థించారు.

బీఈడిఎఫ్‌  ద్వారా ఏపీఈడీఏ  బాస్మతి వరి సాగును ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తోంది.

ఏపీఈడీఏ కూడా దేశం నుండి బాస్మతి బియ్యం ఎగుమతులకు మరింత ఊపునిచ్చే బాస్మతి బియ్యం నాణ్యమైన ఉత్పత్తిని నిర్ధారించడానికి రసాయన ఎరువుల శాస్త్రీయ వినియోగంతో పాటు రైతులు ఉత్పత్తుల నాణ్యతను నిర్వహించడానికి ధృవీకరించబడిన విత్తనాలను ఉపయోగించాలని సూచించింది.

భారతదేశం 2020-21లో రూ. 29,849 కోట్లు ($ US 4019 మిలియన్లు) విలువైన 4.63 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యెమెన్ రిపబ్లిక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు భారతదేశం యొక్క బాస్మతి బియ్యానికి ప్రధాన దిగుమతుదారులు.

విలువ గొలుసులోని వివిధ వాటాదారుల సహకారంతో ఏపీఈడీఏ బియ్యం ఎగుమతులను ప్రోత్సహిస్తోంది. ఏపీఈడీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం రైస్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ ఫోరమ్ (ఆర్‌ఈపిఎఫ్‌)ని ఏర్పాటు చేసింది. ఆర్‌ఈపిఎఫ్‌లో బియ్యం పరిశ్రమ ప్రతినిధులు, ఎగుమతిదారులు, ఏపీఈడీఏ, వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు మరియు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిశాతో సహా ప్రధాన బియ్యం ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుండి వ్యవసాయ డైరెక్టర్లు ఉన్నారు.


 

***



(Release ID: 1770684) Visitor Counter : 264