శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఈశాన్య గిరిజనులకోసం బయోటెక్నాలజీ కేంద్రం!
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేతులమీదుగా
అరుణాచల్ ప్రదేశ్.లో ప్రారంభం..
అరుణాచల్ గిరిజనుల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి
ఈ కేంద్రం దోహదపడుతుందన్న డాక్టర్ జితేంద్ర..
నాలుగు జిల్లాల్లోని 50 గ్రామాలకు ఉపయోగం
రెండేళ్లలో 10,000మంది రైతులకు ప్రయోజనం
బయోటెక్నాలజీ నైపుణ్య విజ్ఞాన పథకం
అరుణాచల్ ప్రదేశ్.కు అంకితం...
Posted On:
09 NOV 2021 2:26PM by PIB Hyderabad
దేశంలోని ఈశాన్య ప్రాంతపు గిరిజనులకోసం ఒక నూతన బయోటెక్నాలజీ కేంద్రాన్ని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్.లోని మారుమూల ప్రాంతంలో, కిమిన్ అనే చోట,.. సెంటర్ ఫర్ బయో రిసోర్సెస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ పేరిట ఈ బయోటెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వంతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రి హోదాలో,.. సైన్స్, టెక్నాలజీ, భూగోళ విజ్ఞానశాస్త్రం, ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష పరిశోధనా రంగం శాఖలను డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభోత్సవంలో సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్ గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో ఈ నూతన బయోటెక్నాలజీ కేంద్రం ఎంతో గొప్ప పాత్ర నిర్వహిస్తుందన్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే జీవవిజ్ఞాన వనరులను,.. జీవ సాంకేతిక పరిజ్ఞాన పరికరాల సహాయంతో సుస్థిరంగా వినియోగించుకోవడమే ఈ కేంద్రం లక్ష్యమని ఆయన అన్నారు. కేంద్ర సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బయోటెక్నాలజీ శాఖనుంచి ఈ కేంద్రానికి గట్టి మద్దతు ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధికి, గిరిజనుల అభ్యున్నతికి నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి మోదీ ఈ మేరకు చర్యలు తీసుకుంటూ వచ్చారని ఆయన అన్నారు. గత ఏడేళ్ళ కాలంలో వ్యవసాయం, జలవిద్యుత్, మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పర్యాటకం వంటి రంగాల్లో మోదీ గనణీయమైన చర్యలు తీసుకున్నారని జితేంద్రసింగ్ అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధికోసం కొత్త అవకాశాలను సృష్టించారని, మార్కెటింగ్, నైపుణ్యాభివృద్ధి, సరిహద్దు ద్వారా వాణిజ్యం వంటి అంశాల్లో ఎన్నో చర్యలు తీసుకున్నారని కేంద్రమంత్రి అన్నారు.
ఈశాన్య ప్రాంతంలో బయోటెక్నాలజీ పరిశోధనల నిర్వహణా సామర్థ్యాలను పెంపొందించడంలో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కూడా ఎంతో కీలకపాత్ర పోషించిందని అన్నారు. ఈశాన్య ప్రాంతానికే ప్రత్యేకమైన విభిన్నమైన సమస్యల పరిష్కారం కోసం ఈ చర్యలు తీసుకున్నారని, స్థానిక గిరిజన సమూహాల అభ్యున్నతికి సంబంధించిన కార్యక్రమాల అమలుకోసం కూడా ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు.
వివిధ కార్యక్రమాల అమలుకోసం భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఎ.ఆర్.)తోను, విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి సంస్థలతోను ఈ బయోటెక్నాలజీ కేంద్రం అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్.లోని ఔత్సాహిక యువతకు ఉపాధిని కల్పించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. వివిధ పరిశోధనా కార్యక్రమాల అమలుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఏర్పాటు చేస్తారని అన్నారు. ఈ మౌలిక సదుపాయాలు దాదాపు 50 గ్రామాలకు ఉపయోగపడతాయని, రెండేళ్లలో 10,000మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు.
ఈశాన్య ప్రాంతం ప్రయోజనాలకోసం ఈ కింది నాలుగు కార్యక్రమాల అమలుపై కేంద్ర ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరిస్తోందని ఆయన అన్నారు. (1) పూల జాతుల రక్షణ, పెంపుదల కోసం కిమిన్ లోని బయోటెక్నాలజీ కేంద్రంలోనే ప్రత్యేక విభాగాన్ని (ఆర్కిడేరియంను) ఏర్పాటు చేయడం. ఈ విభాగానికి అనుబంధంగా శాటిలైట్ యూనిట్లను అరుణాచల్ ప్రదేశ్.లోని ఎంపిక చేసిన జిల్లాల్లో ఏర్పాటు చేయడం. (2) అరటిలోని పీచు పదార్థాన్ని సంగ్రహించి, దాన్ని శుద్ధీకరణ యూనిట్లను అరుణాచల్ ప్రదేశ్.లోని ఎంపిక చేసిన జిల్లాల్లో స్థాపించడం, (3) పరిమళ, సుగంధభరితమైన మొక్కల సాగును ప్రోత్సహించేందుకు సుగంధ మొక్కల సాగు యూనిట్.ను ఏర్పాటు చేయడం. ఇందులో ఔత్సాహిక వాణిజ్య కార్యకలాపాలను అభివృద్ధి చేయడం. మొత్తం ఈ 3 కార్యక్రమాల అమలుకోసం కేంద్రప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరిస్తోందని ఆయన అన్నారు.
ఈశాన్య ప్రాంతపు వైజ్ఞానిక అభ్యున్నతి కోసం అరుణాచల్ ప్రదేశ్.లోని పాపుమ్ పరే జిల్లాలోని కిమిన్ ప్రాంతంలో ఈ బయోటెక్నాలజీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక మండలి, సైన్స్, టెక్నాలజీ శాఖ కలసి కేంద్ర బయోటెక్నాలజీ శాఖ మద్దతుతో ఈ కేంద్రానికి రూపకల్పన చేశారని చెప్పారు. 2018 మార్చి నెల 27న ఈ బయోటెక్నాలజీ కేంద్రం మంజూరైంది. ఈ ప్రాజెక్టుకోసం మొదట్లో మూడేళ్ల కాలానికి రూ. 54.23కోట్ల మొత్తం మంజూరైందని, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు వ్యవధిని 2023 సెప్టెంబరు 26వరకూ పొడిగించారని మంత్రి చెప్పారు.
కేంద్ర బయోటెక్నాలజీ శాఖ నిధులతో నడిచే నైపుణ్య విజ్ఞాన కార్యక్రమాన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి డాక్టర్ జితేంద్రసింగ్ ఈ సందర్భంగా అంకితం చేశారు. భారత ప్రభుత్వం చేపట్టిన స్కిల్ ఇండియా పథకం కింద నైపుణ్య విజ్ఞాన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇందుకోసం కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని నైపుణ్యాభివృద్ధి మండలులతో, వివిధ భాగస్వామ్య సంస్థలతో అనుసంధానాన్ని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ వంటి పాఠ్యాంశాల్లో యువగ్రాడ్యుయేట్లుగా ఉత్తీర్ణులైన విద్యార్థులకోసం వైజ్ఞానిక కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు, వారి ఉద్యోగ జీవితాల అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు కేంద్రమంత్రి చెప్పారు. వారికి సరైన ఉద్యోగ అవకాశాలు, ఔత్సాహిక వాణిజ్య, పారిశ్రామికాభివృద్ధి అవకాశాలు కల్పించడానికే ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. కీలకమైన వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సృజనాత్మక అంశాల్లో యువత సామర్థ్యాలను పెంపొందింపజేసే ప్రక్రియను కూడా ఈ కార్యక్రమాల పరిధిలోనే చేపడతారన్నారు.
ఈ పథకం కింద విద్యార్థులకు నాలుగు విభిన్నమైన శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. (1) విద్యార్థుల శిక్షణా కార్యక్రమం (ఎస్.టి.పి.), (2) టెక్నీషియన్ శిక్షణా కార్యక్రమం (టి.టి.పి.), (3) ఫ్యాకల్టీ శిక్షణ కార్యక్రమం (ఎఫ్.టి.పి.), (4) ఔత్సాహిక సామర్థ్యాల అభివృద్ధి కార్యక్రమం (ఇ.డి.పి.) వంటివి ఈ పథకం కింద అమలు చేస్తున్నారు.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ అజమాయిషీలోని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి.)కు చెందిన మూడు విభిన్నమైన నైపుణ్యాభివృద్ధి మండళ్లు (ఎస్.డి.సి.లు) కూడా ఈ శిక్షణ కిందికే వస్తాయి. ఇందుకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సైన్స్, టెక్నాలజీ మండలి (ఎ.పి.ఎస్.సి.ఎస్. అండ్ టి.)తో ఈ మండళ్లు ఒక అవగాహనను కుదుర్చుకున్నాయి. వివిధ రకాల భాగస్వామ్య సంస్థలతో కలసి అరుణాచల్ ప్రదేశ్.లో నైపుణ్య విజ్ఞాన కార్యక్రమానికి తాము ఎలాంటి మద్దతు అందించాలన్న విషయమై ఈ అవగాహనా ఒప్పందం కుదిరింది.
<><><>
(Release ID: 1770392)
Visitor Counter : 210