ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికోసం వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వాలి: ఉపరాష్ట్రపతి

- రైతులకు సహాయం చేసే విషయంలో వ్యవసాయ విశ్యవిద్యాలయాలు ముందుకు రావాలి

- సాంకేతికతను సద్వినియోగపరుచుకుంటూ అన్నదాతల ఆదాయాన్ని పెంచేదిశగా ప్రయత్నం జరగాలి

- చంపారన్ లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన

- కరోనానంతర పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని 6వ ధర్మ-ధమ్మ అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి

Posted On: 07 NOV 2021 2:01PM by PIB Hyderabad

గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరోనానంతర పరిస్థితుల్లో పట్టణాలు, నగరాలనుంచి గ్రామాలకు యువత మళ్లీ వలసబాట పడుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. 

బిహార్ లోని చంపారన్ లో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్.పీ.వో) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయన్నారు. అందుకే ఎఫ్‌పీవోలను సామర్థ్య నిర్మాణం అవసరమని.. ఈ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 

చిన్న, మధ్యతరగతి రైతులు తమకున్న పరిమిత వనరులతో అద్భుతాలు సాధించడమే భారతదేశ వ్యవసాయ రంగం గొప్పదనం దాగుందని, అందుకే వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా రైతాంగానికి మద్దతుగా నిలవాలన్నారు. వ్యవసాయంతోపాటు ఆహారోత్పత్తుల నిర్వహణ తదితర అంశాల్లో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహారభద్రతను సుస్థిరం చేసే దిశగా మరో అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలోనూ రైతులు రికార్డు స్థాయి ఉత్పత్తుల ద్వారా తమ సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పారని ఉపరాష్ట్రపతి అన్నారు. అందుకు యావత్భారత రైతాంగాన్ని ఆయన హృదయపూర్వకంగా అభినందించారు.

స్వాతంత్రోద్యమ సమయంలో రైతులకు అండగా ఉండేందుకు మహాత్మాగాంధీ చంపారన్ సత్యాగ్రహ ఉద్యమాన్ని ఇక్కడినుంచే ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ ప్రాంతం నుంచే మహాత్ముడికి అత్యంత ఇష్టమైన ‘బాపు’బిరుదును పొందారన్నారు. 

స్నాతకోత్సవంలో పాల్గొన్న విద్యార్థులందరూ తమ భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు చేరుకోవాలని ఉపరాష్ట్రపతి శుభాశీస్సులు అందజేశారు. చంపారన్ లో రైతు కేంద్రిత సంస్థల ఏర్పాటులో చొరవతీసుకున్న పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాధామోహన్ సింగ్ ను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ సంస్థలన్నీ అన్నదాతలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆయన ఆకాంక్షించారు. 

 

ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ శ్రీ ఫగు చౌహాన్, ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, బిహార్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అమరేంద్ర సింగ్ తోపాటు, విశ్వవిద్యాలయ కులపతి డాక్టర్ ప్రఫుల్ల్ కుమార్, ఇతర అధికారులు, బోధనాసిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

అంతకుముందు నలంద విశ్వవిద్యాలయంలో జరిగిన 6వ అంతర్జాతీయ ధర్మ-ధమ్మ సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనానంతర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. శారీరక వ్యాయామంతోపాటు యోగ, ధ్యానం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

హిందూ, బౌద్ధ ధర్మాలు కలిసిన ధర్మ-ధమ్మ అనే ఆధ్యాత్మిక సంప్రదాయం కరోనానంతర పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు ఇవ్వగలవని ఆయన ఆకాంక్షించారు. పరస్పర సమన్వయం, అస్తిత్వం, అహింస, స్నేహభావం, శాంతి, దయ, జాలి, కరుణ, సత్యం, స్వార్థరహిత, త్యాగవంతమైన జీవనం నేటి ప్రపంచానికి అవసరమన్నారు.

నలంద విశ్వవిద్యాలయానికి భారతదేశ చరిత్రలో ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేస్తూ మరోసారి భారతదేశ జ్ఞానాన్ని ప్రపంచంతో అనుసంధానం చేయాల్సిన బాధ్యత కూడా నలంద విశ్వవిద్యాలయాలనికి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో బిహార్ గవర్ర్ ఫగున్ చౌహాన్, ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, శ్రీలంక ప్రభుత్వ రవాణా మంత్రి శ్రీమతి పవిత్ర వన్నియరచ్చి, నలంద విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సునయన సింగ్, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్లు, శ్రీమతి లలిత కుమారమంగళం, శ్రీ ధృవ్ కటోచ్ తోపాటు హిందు, బౌద్ధ ధర్మాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

***(Release ID: 1769910) Visitor Counter : 72