జౌళి మంత్రిత్వ శాఖ
సాంకేతిక దుస్తుల ఎగుమతులను మూడు సంవత్సరాలలో అయిదు రెట్లు పెంచి 2 బిలియన్ డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఇదే సరైన సమయం .. శ్రీ పియుష్ గోయల్
తక్కువ ధరకు భూమి, విద్యుత్ అందించి మౌలిక సౌకర్యాలను కల్పించి వస్త్ర రంగ అభివృద్ధికి సహకరించే రాష్ట్రాల్లో పిఎల్ఐ లకు కేంద్రం తోడ్పాటు అందిస్తుంది
జౌళి రంగంలో మనం అత్యున్నత ప్రమాణాలు సాధించాలి... శ్రీ పీయూష్ గోయల్
సాంకేతిక దుస్తుల ఉత్పత్తి రంగంలో పరిశోధన, అభివృద్ధి రంగాలకు ప్రభుత్వం సమకూరుస్తున్న నిధుల వినియోగానికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అవసరమన్న మంత్రి
సాంకేతిక పరిజ్ఞానం మరియు దేశీయంగా వినూత్నమైన ఉత్పత్తుల దిశగా అభివృద్ధి సాగాలి ; శ్రీ గోయల్
Posted On:
05 NOV 2021 2:11PM by PIB Hyderabad
సాంకేతిక దుస్తుల ఎగుమతులను రానున్న మూడు సంవత్సరాల్లో అయిదు రెట్లు అధికం చేయడానికి కృషి జరగాలని కేంద్ర జౌళి, వాణిజ్యం పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు మంత్రి ఇండియన్ టెక్నికల్ టెక్స్ టైల్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడారు. జౌళి ఉత్పత్తి రంగ అభివృద్ధికి తోడ్పడే విధంగా తక్కువ ధరకు భూమి సమకూర్చి,విద్యుత్ సరఫరా చేసి ఇతర మౌలిక సదుపాయాలను అందించే రాష్ట్రాల్లో పిఎల్ఐలకు కేంద్రం సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
జౌళి రంగంలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలను సాధించడానికి చర్యలు అమలు కావాలని శ్రీ గోయల్ సూచించారు. జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు సరఫరా చేసే దుస్తుల నాణ్యత ఒకే మాదిరిగా ఉండాలని అన్నారు. జౌళి రంగంలో పరిశోధన అభివృద్ధి రంగాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధుల వినియోగానికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అవసరమన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు.
గత అయిదు సంవత్సరాలుగా దేశంలో జౌళి రంగం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఈ రంగ వార్షిక అభివృద్ధి రేటు 8%గా నమోదవుతోంది. రానున్న అయిదు సంవత్సరాలలో ఈ రంగం 15 నుంచి 20 శాతం అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని శ్రీ గోయల్ పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రపంచ మార్కెట్ 250 బిలియన్ డాలర్లు (18 లక్షల కోట్లు ) మేరకు ఉందని పేర్కొన్న శ్రీ గోయల్ దీనిలో భారతదేశం వాటా 19 బిలియన్ డాలర్లుగా ఉందని వివరించారు. ప్రపంచ మార్కెట్ లో దేశ వాటాను 40 బిలియన్ డాలర్లకు (8%) పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రపంచ మార్కెట్లో అమెరికా, పశ్చిమ యూరోప్, చైనా, జపాన్ దేశాలు ( 20 నుంచి 40% వాటాతో) కీలక పాత్ర పోషిస్తున్నాయని శ్రీ గోయల్ తెలిపారు. వ్యాపార వాటాను పెంచుకోవడం తో పాటు సాంకేతిక పరిజ్ఞానం, స్వదేశీ ఉత్పత్తుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని శ్రీ గోయల్ స్పష్టం చేశారు.
జౌళి రంగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించేలా చూసి, లక్ష్యాల మేరకు అభివృద్ధి సాధించి ప్రపంచ మార్కెట్లో ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా రూపొందించడానికి 2020 ఫిబ్రవరిలో కేంద్రం జాతీయ సాంకేతిక వస్త్ర మిషన్ ను ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయం, రహదారులు, రైల్వేలు, జల వనరులు, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత రక్షణ లాంటి ప్రధాన రంగాలలో భారతదేశంఅగ్రస్థానంలోఉండేలా చూడడానికి ఆవిష్కరణలు,సాంకేతిక అభివృద్ధికి దోహదపడే విధంగా ఉన్నత విద్య, నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వివరించారు.
2019లో జనవరిలో భారతదేశంలో మొదటిసారిగా సాంకేతిక దుస్తులకు 207 హెచ్ఎస్ఎన్ కోడ్లను జారీ చేయడం ప్రారంభం అయ్యిందని పేర్కొన్న శ్రీ గోయల్ రెండు సంవత్సరాల కన్నా తక్కువ వ్యవధిలో భారతదేశం సాంకేతిక దుస్తుల రంగంలో నికర ఎగుమతిదారుగా మారిందని తెలియజేశారు.
2018-19లో (-రూ 2788 కోట్లు ) 2019-20లో (- రూ 1366 కోట్లు) ప్రతికూలంగా ఉన్న వాణిజ్య లోటు 2020-21లో 1767 కోట్లతో సానుకూలంగా మారిందని ఆయన అన్నారు. 2020-21 సంవత్సరంలో పిపిఇలు, ఎన్ -95 మరియు సర్జికల్ మాస్కులు , పిపిఇ మరియు మాస్క్ ల కోసం ఉపయోగించే వస్త్రాల రూపంలో దేశ ఎగుమతులు ఎక్కువగా జరిగాయని మంత్రి వివరించారు.
సాంకేతిక దుస్తుల తయారీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను శ్రీ గోయల్ వివరించారు. రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో వ్యవసాయం, ఉద్యానవనం, జాతీయ రహదారులు, జల వనరులు, వైద్య సంబంధిత ప్రభుత్వ సంస్థలలో 92 రకాల వస్తువుల వినియోగాన్ని తప్పనిసరి చేశామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి తొమ్మిది మంత్రిత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయని అన్నారు. 377 బిఐఎస్ భారతీయ ప్రమాణాలను జారీ చేసిందని మరో 100 వస్తువులు పరిశీలనా దశలో ఉన్నాయని అన్నారు. సాంకేతిక దుస్తుల తయారీలో నైపుణ్య అభివృద్ధికి తోడ్పడే విధంగా ఇప్పటికే ఆరు కోర్సులను ప్రారంభించామని, మరో 20 కోర్సులు పరిశీలనా దశలో ఉన్నాయని అన్నారు.
ప్రత్యేక పరిస్థితుల్లో రక్షణ కల్పించే విధంగా సాంకేతిక దుస్తులను ఉత్పత్తి చేస్తున్నారు. జనపనార, పట్టు మరియు పత్తి వంటి సహజ పదార్ధాలతో పాటు పాలిమర్లు (అరమిడ్, నైలాన్), కార్బన్, గ్లాస్ మరియు లోహాలను ఉపయోగించి తయారు చేసే సాంకేతిక దుస్తులు భవిష్యత్ సాంకేతికతకు ప్రతిరూపంగా ఉంటాయి. ఇది ఇవి జీవన,ఆలోచనా విధానాలను పూర్తిగా మార్చే తదుపరి సాంకేతిక విప్లవం కానుంది.
దేశంలో వినియోగం ఆధారంగా సాంకేతిక దుస్తుల రంగాన్ని 12 ఉప విభాగాలుగా విభజించారు. వీటిలో భారతదేశం ప్యాకేజింగ్ టెక్స్ టైల్స్ (ప్యాక్ టెక్) రంగంలో 38% వాటాని కలిగి ఉంది. , జియో టెక్నికల్ టెక్స్ టైల్స్ (జియో-టెక్)లో 10%, అగ్రికల్చర్ టెక్స్ టైల్స్ (అగ్రిటెక్)లో 12%.వాటా కలిగి ఉంది. నూతన పదార్థాల ఆగమనంతో సాంకేతిక దుస్తుల తయారీ రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది . స్మార్ట్ వస్త్రాలలో నూతన ఆవిష్కరణలతో పాటు 3-డి నేత, ఆరోగ్య పర్యవేక్షణ కోసం స్మార్ట్ దుస్తుల తయారీ మరియు అల్ట్రా-హై స్పోర్ట్స్ వేర్ రంగాలు నూతన అవకాశాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.
సాంకేతిక దుస్తుల తయారీ రంగంలో పరిశోధనలు చేపట్టి ఆవిష్కరణలు, అభివృద్ధిని ప్రోత్సహించడానికి నీతీ ఆయోగ్ సభ్యుడు, ప్రధాన సాంకేతిక సలహాదారు సహ చైర్మన్ గా వ్యవహరించే ఒక కమిటీని ప్రభుత్వం నెలకొల్పింది. 36 ప్రతిపాదనలను పరిశీలించిన కమిటీ 20 ప్రతిపాదనలను ఆమోదించింది. పరిశోధనల కోసం అందిన దాదాపు 40 ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది.
సాంకేతిక దుస్తుల తయారీ రంగంలో ఉన్న చిన్న మధ్య తరహా సంస్థల ప్రతినిధులతో ఇండియన్ టెక్నికల్ టెక్స్ టైల్ అసోసియేషన్ ఏర్పాటు అయింది. వీటి వ్యాపారం 100 కోట్ల రూపాయల వరకు ఉంది. ఐటిటిఎ సభ్యులు ఎక్కువగా నాన్-వూవెన్ బట్టలు, రక్షణ వస్త్రాలు, ప్యాకేజింగ్ సాంకేతిక వస్త్రాలు, అగ్రో-టెక్స్ టైల్స్, ఇండస్ట్రియల్ ఫిల్టర్లు, కన్వేయర్ బెల్ట్ రంగాలలో ఉత్పత్తులు సాగిస్తున్నారు.
గార్వేర్, వెల్స్పన్, ఎస్ ఆర్ ఎఫ్, సెంచరీ యార్న్ , జాన్సన్అండ్ జాన్సన్ లాంటి పెద్ద సంస్థలు ( 500 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం) సాంకేతిక దుస్తుల తయారీ రంగంలో ఉన్నాయి.,వీటికి ఇండియన్ టెక్నికల్ టెక్స్ టైల్ అసోసియేషన్ తో సంబంధం లేదు. విధాన నిర్ణయాలు, కార్యక్రమాల రూపకల్పన తదితర అంశాలలో ఇండియన్ టెక్నికల్ టెక్స్ టైల్ అసోసియేషన్ ని సంప్రదించి జౌళి మంత్రిత్వ శాఖ ముందుగా సంప్రదింపులు జరుపుతోంది.
***
(Release ID: 1769675)
Visitor Counter : 234