గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రీన్ హౌస్ వాయువుల నియంత్రణలో పట్టణపథకాల పాత్ర కీలకం!


ప్రపంచ ఆవాస దినోత్సవ కార్యక్రమంలో
కేంద్రమంత్రి హరదీప్ సింగ్ ఉద్ఘాటన..

ఆర్థిక ఆశయాలతోపాటు, పర్యావరణరక్షణ కూడా
మనకు ముఖ్యమేనని సూచన

प्रविष्टि तिथि: 11 OCT 2021 4:39PM by PIB Hyderabad

   సుస్థిరమైన పట్టణాభివృద్ధి విషయంలో ప్రజలను అగ్రభాగాన నిలిపేందుకు గృహనిర్మాణంతోపాటుగా, పలు రకాల కార్యకలాపాల్లో కర్భన కాలుష్యాన్ని నివారించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, ఖనిజవాయువు శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి పిలుపునిచ్చారు. అందరికీ గృహవసతి, సేవల బట్వాడా, మెరుగైన రవాణా సదుపాయాలు అందాలంటే కర్బన వాయువుల కాలుష్యాన్ని నియంత్రించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆవాస దినోత్సవం సదర్భంగా “కర్బన కాలుష్యానికి తావియ్యని ప్రపంచం కోసం పట్టణ కార్యకలాపాలను సత్వర పరచడం” అనే ఇతివృత్తంపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అక్టోబరు 11న జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, అదనపు కార్యదర్శి సురేంద్ర కుమార్ బాగ్డే, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల అధికారులు, కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

https://ci4.googleusercontent.com/proxy/iV-TYjP4vPuXKTdh-198be94vx_6AGmdPGKyjaXZEIPno7xMk3ZC25Rk_r23_uA78d3FnJkS1PHeY3ZjMX7u_aQgVIAtUIbVfmzN4gXwKAqRT3gF9pxybsdBew=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001PGYA.jpg

   వాతావరణంలో ఎదురయ్యే పెనుమార్పులను ఎదుర్కొనడంలో మోదీ ప్రభుత్వం చూపిన చొరవన, సామర్థ్యం అభినందనీయమని కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పూరి అన్నారు. దేశంలో దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి మోదీ ప్రభుత్వం పునాదులు వేసిందని అన్నారు. ఈ రోజున భారీ ఎత్తున సాగుతున్న పట్టణీకరణను, వాతావరణ మార్పులను తట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించినపుడు తమ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని ఆయన అన్నారు.

   “కర్బన కాలుష్యానికి తావియ్యని ప్రపంచం కోసం పట్టణ కార్యకలాపాల వేగిరపరచడం” అనే ఇతివృత్తం భారతదేశానికి ఎంతో అనుసరణీయమైనదని కేంద్రమంత్రి పూరి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పట్టణ వాతావరణం పెరగడంతో నగరాల్లో ఇంధనానికి డిమాండ్ కూడా పెరిగిపోతోందని, ప్రపంచ వ్యాప్తంగా 78శాతం ఇంధన వినియోగానికి,  70శాతం మేర కర్బన ఉద్గాగారాల కాలుష్యం వ్యాప్తికి (జి.హెచ్.జి.కి) ఈ నగరాలే కారణమవుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణంలో సంభవించే పెనుమార్పులతో మానవ ఆవాసాలు ప్రమాదాలకు ఆలవాలంగా మారాయని, ప్రత్యేకించి మరీ నిరపేదలు, పేదరికంలో మగ్గిపోయే పట్టణవాసులు ఈ విషమ పరిస్థితిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారని, వాతావరణ ప్రతికూలతకు వీరే ఎక్కువ దెబ్బతింటున్నారని మంత్రి అన్నారు. 2019వ సవత్సరంలో వాతావరణ మార్పులతో ఎక్కువ ప్రభావితమైన దేశాల్లో భారతదేశం 7వ స్థానంలో ఉందని, దేశంలోని నగరాలపైనే ఈ ప్రభావం ఎక్కువగా పడిందని చెప్పారు. 

   భారతీయ నగరాల ఆర్థిక, పర్యావరణ అనివార్యతల గురించి మంత్రి మాట్లాడుతూ,..అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోల్చినపుడు, భారతదేశంలో తలసరి కర్బన కాలుష్య వాయువుల, గ్రీన్ హౌస్ వాయువుల విడుదల చాలా తక్కువ పరిమాణంలో ఉందన్నారు. 1870నుంచి 2017వరకూ భారతదేశంలో వెలువడిన కార్బన్ డయాక్సైడ్ అతి తక్కువగా అంటే,.. 3శాతంగా నమోదైందని అమెరికాతో తదితర దేశాలతో పోల్చితే ఇది చాలా తక్కువని మంత్రి అన్నారు. అమెరికాలో 25శాతం, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ దేశాల్లో 22శాతం, చైనాలో 13శాతంగా ఇది నమోదైందని చెప్పారు.

   ఆర్థికాభివృద్ధికోసం గతంలో సంపన్నదేశాలు అనుసరించిన పారిశ్రామికీకరణ విధానాన్నే చేపట్టాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్నదని, అయితే పర్యావరణపరంగా ఎదురయ్యే నష్టం గురించి తెలుసు కాబట్టి ఆయా దేశాల పంథానే భారతదేశం అనుసరించాల్సిన అవసరం ఏ మాత్రం లేదని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. నగరాలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో భారతదేశం ఎప్పుడో గుర్తించిందని, ఎందుకంటే, 2030నాటికి జాతీయస్థాయి స్థూల దేశీయ ఉత్పాదన (జి.డి.పి.)లో 70శాతం వాటా నగరాలదే కావచ్చని భావిస్తున్నారని మంత్రి అన్నారు. ఆర్థికపరమైన ఆశలను నెరవేర్చడంతోపాటుగా, పర్యావరణపరంగా కూడా మనం బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని అన్నారు. దేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ప్రత్యేకించి 11వ, 13వ లక్ష్యాలను) చేరాలంటే, తక్కువ స్థాయి కర్భన కాలుష్యాలను విడుదలచేసే నగరాలే అవసరమనే విషయంలో ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేదన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (ఎస్.డి.జి.లకు) సంబంధించి ప్రపంచ స్థాయి ఫలితాలకు భారతదేశం సేవలు ఎంతో ఆవశ్యకమని అన్నారు.

  వాతావరణ మార్పుల ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు భారతీయ పట్టణ పథకాలు ఎంతో దోహదపడ్డాయని అన్నారు. స్వచ్ఛ భారత్ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పి.ఎం.ఎ.వై.), స్మార్ట్ నగరాల పథకం, పట్టణ రవాణా, మోదీ ప్రభుత్వం ప్రారంభించిన అమృత్ (AMRUT) పథకం వంటివి, భూతాపోన్నతికి కారణమయ్యే కర్బన కాలుష్య వాయువులను తగ్గించడంలో ఎంతో కీలకపాత్ర పోషించాయన్నారు. పట్టణాల్లో అమలయ్యే ఈ పథకాలన్నీ సమగ్రమైన పట్టణీకరణ కార్యక్రమంలో భాగం కావడమే కాకుండా, వాతావరణ మార్పుల ప్రతికూలతను నియంత్రించే సాధనాలుగా మారాయని కేంద్రమంత్రి అన్నారు.

   పి.ఎం.ఎ.వై. పథకం కింద ఇళ్ల నిర్మాణంలో సుస్థిరమైన, ఇంధన సామర్థ్యంతో కూడిన పద్ధతులను పాటిస్తున్నట్టు హరదీప్ సింగ్ పూరి చెప్పారు. పర్యావరణహితంగా నిర్మించే హరిత భవవాల ద్వారా 20నుంచి 30శాతం వరకూ ఇంధన పొదుపును, 30నుంచి 50శాతం నీటి పొదుపును సాధించవచ్చని అన్నారు. ఈ పథకం కింద ప్రస్తుతం నిర్మిస్తున్న156లక్షలకు పైగా ఇళ్ళ విషయంలో హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్టు చెప్పారు. పి.ఎం.ఎ.వై. కింద ఇళ్ల నిర్మాణం ద్వారా,  2022నాటికి దాదాపు కోటీ 20లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్.కు సమానమైన  గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించేందుకు అవకాశం ఉందని అన్నారు. తక్కువ స్థాయి కర్బన కాలుష్యాల విడుదలకు కారణమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకే పి.ఎం.ఎ.వై. పథకం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అన్నారు. ఈ పథకం కింద వెయ్యేసి ఇళ్లతో కూడిన ఆరు లైట్ హౌస్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టు చెప్పారు.

  ఎక్కువమంది జనాభాకు  వ్యాక్సినేషన్ అందించిన దేశాల జాబితాలోకి భారతదేశం కూడా చేరబోతోందని, కోవిడ్ నివారణ లక్ష్యంగా త్వరలోనే వందకోట్లమందికి భారతదేశం వ్యాక్సీన్లను అందించబోతోందని కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పూరి చెప్పారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తితో దెబ్బతిన్న లక్షలాది మంది వీధి వ్యాపారులను స్వానిధి పథకం ద్వారా ఆదుకున్నామన్నారు. దేశంలో పారిశుద్ధ్యంకోసం మహాత్మాగాంధీ కన్న కలలు ఇపుడు పూర్తిగా సాకారమయ్యాయని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్) పథకం ద్వారా నగరాలన్నింటినీ బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దామన్నారు. స్వచ్ఛభారత్ పథకం రెండవ దశలో నగరాలన్నీ చెత్త రహితంగా తయారవుతాయన్నారు. ఘనవ్యర్థాల నిర్మూలనా ప్రక్రియ ఇప్పటికే దాదాపు 70శాతం పూర్తయిందని, స్వచ్ఛ భారత్ మిషన్ రెండవ దశలో ఇది వందశాతం ఫలితాలను సాధిస్తుందని కేంద్రమంత్రి అన్నారు.

  పట్టణ రవాణా వ్యవస్థపై మంత్రి మాట్లాడుతూ, ప్రజా రవాణా వ్యవస్థను విస్తరింపజేసేందుకు ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటోందని అన్నారు.  మెట్రో రైళ్లు వంటి పటిష్టమైన ప్రజారవాణా వ్యవస్థను తాము విస్తరింపజేస్తామని, ఇప్పటికే దేశంలోని 18 నగరాల్లో 721 కిలోమీటర్ల మార్గంలో మెట్రోరైళ్లు అందుబాటులోకి వచ్చాయని, ప్రస్తుతం 27 నగరాల్లో 1,058 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థ నిర్మాణంలో ఉందని అన్నారు. రహదారులపై సొంత వాహనాల పరుగులతో వెలువడే కర్భనవాయువుల కాలుష్యాన్ని ఈ మెట్రో రైలు వ్యవస్థ ద్వారా అరికట్టవచ్చని మంత్రి అన్నారు.

  ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా స్వాగతోపన్యాసం ఇస్తూ,.. వాతావరణ మార్పుల ప్రతికూల పరిణామాలనుంచి విముక్తి కలిగించే ప్రపంచాన్ని సృష్టించడంలో పట్టణ కేంద్రాలకు ఎంతో కీలకపాత్ర ఉంటుందన్నారు. పల్లెలతో పోల్చుకుంటే నగరాలే ఎక్కువగా ఇంధనంపై ఆధారపడతాయని, పర్యావరణాన్ని ప్రభావితం చేసేది కూడా నగరాలేనని ఆయన అన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా ప్రజారవాణాకు, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు గిరాకీ కూడా పెరిగిందని, పట్టణాల్లో ఖాళీ జాగాపై ఒత్తిడి కూడా విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు.

  వాతావరణ పెనుమార్పులు, భూతాపోన్నతి కారణంగా ఎదురయ్యే సవాళ్లను గుర్తించిన భారతీయ నగరాలు ఇటీవలి కాలంలో పర్యావరణహితమైన రవాణా ప్రత్యామ్నాయాలవైపు ముందుకు సాగుతుతున్నాయని, నడక, సైక్లింగ్, ప్రజారవాణా వంటి ప్రత్యామ్నాయాలకోసం మన నగరాలు కృషి చేస్తున్నాయని మిశ్రా చెప్పారు. 2021లో జరిగిన వాతావరణ సదస్సు తీర్మానాలకు దేశం కట్టుబడి ఉందని, పునరుత్పాదన ఇంధనం వాటాను పెంచేందుకు, ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, నిర్మాణంకోసం స్థానిక సామగ్రిని వినియోగించుకునేందుకు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసేందుకు, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు, వాతావరణ ప్రతికూలతను తట్టుకునే పద్ధతులను పాటించేందుకు దేశం ఎంతో కృషి చేస్తోందని మిశ్రా అన్నారు.

  ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని పురస్కరించుకుని,.. కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ (హడ్కో), భవననిర్మాణ సామగ్రి, సాంకేతిక పరిజ్ఞాన మండలి (బి.ఎం.టి.పి.సి.),  జాతీయ భవన నిర్మాణ సంస్థ (ఎన్.బి.సి.సి.)  వెలువరించిన  ఎలక్ట్రానిక్ ప్రచురణలను (ఇ-పబ్లికేషన్స్.ను) కూడా ఈ కార్యక్రమంలో  ఆవిష్కరించారు.

 

*****


(रिलीज़ आईडी: 1763228) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam