బొగ్గు మంత్రిత్వ శాఖ
సామాజిక-ఆర్థిక అంశాల ప్రాతిపదికపై మూతపడిన బొగ్గు కేంద్రాల పునర్వినియోగానికి బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రణాళిక
రెండు దశల్లో అమలు కానున్న గనుల మూసివేత ప్రణాళిక
సహకారం, మార్గదర్శకత్వం కోసం ప్రపంచ బ్యాంకు తో ప్రాధమిక చర్చలు ప్రారంభం
Posted On:
06 OCT 2021 3:43PM by PIB Hyderabad
నిర్వహణ, ప్రజలు సామాజిక వర్గాలు, పర్యావరణం, భూ వినియగ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ గనులను మూసివేసే సమయంలో అనుసరించవలసైనా ప్రణాళికకు రూపకల్పన చేసే అంశంపై బొగ్గు మంత్రిత్వ దృష్టి సారించింది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రపంచ బ్యాంకు సహాయ సహకారాలను పొందడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో బొగ్గు గనులను మూసి వేసే అంశంలో ప్రపంచ బ్యాంకు అపారమైన అనుభవాన్ని కలిగి ఉంది. ఈ అనుభవం దేశానికి ఉపయోగపడుతుందని, బొగ్గు గనులను మూసి వేసే అంశంలో ఉత్తమ ప్రమాణాలను అనుసరించడానికి అవకాశం కల్పిస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకోవడానికి రూపొందించిన ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదికను అవసరమైన అనుమతుల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు బొగ్గు మంత్రిత్వ శాఖ సమర్పించింది.
బొగ్గు గనుల మూసివేతకు సంబంధించి ఇప్పటికే బొగ్గు మంత్రిత్వ శాఖ చర్యలను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ కు చెందిన సుస్థిర అభివృద్ధి కేంద్రం ఈ అంశంపై బొగ్గు కంపెనీలు, కోల్ కంట్రోలర్ ఆఫీస్ తో పలు దఫాలుగా సమావేశాలను నిర్వహించింది. మూసివేత సమయంలో అమలు చేయవలసి ఉన్న ప్రణాళికలను ఈ సమావేశాల్లో చర్చించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్ అభిప్రాయాలు, సూచనలను స్వీకరించడం జరిగింది.
బొగ్గు ఉత్పత్తిని పెంచడం ద్వారా దేశంలోని ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి భారతీయ బొగ్గు రంగం తన వంతు కృషి చేస్తోంది. అదే సమయంలో పర్యావరణం, సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టింది.
అయితే,ప్రణాళికాబద్ధంగా గనుల మూసివేత అంశం భారత బొగ్గు రంగంలో తాజాగా చేసుకొంటున్న పరిమాణం. గనుల మూసివేతకు సంబంధించి 2009లో తొలిసారిగా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వీటికి 2013 మార్పులు చేయడం జరిగింది. దేశంలో బొగ్గు తవ్వకాలు అనేక సంవత్సరాల కిందట ప్రారంభం అయ్యాయి. వీటిలో పురాతనమైన కొన్ని గనులు ఉపయోగంలో లేకుండా ఉన్నాయి. నిల్వలు లేకపోవడం, ప్రతికూల భౌగోళిక పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల మరికొన్ని గనులు మూతపడే అవకాశం కూడా ఉంది. ఈ గనులను పర్యావరణహితంగా సురక్షితంగా మూసి వేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో వీటిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వారికి జీవనోపాధి కల్పించవలసి ఉంటుంది. మూసివేసిన గనులను తిరిగి వినియోగం లోకి తెచ్చి పర్యాటకం, క్రీడలు, అటవీ, వ్యవసాయం, ఉద్యానవన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి రాష్ట్రాలు, ప్రజలకు అవకాశం కల్పించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో అన్ని ప్రాంతాలలో అమలు జరిగేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. పురాతన బొగ్గు గనులు, ఇటీవల మూసివేసిన గనులు, సమీప కాలంలో మూతపడే అవకాశం ఉన్న అన్ని గనులకు వర్తించే ఈ ప్రణాళిక రెండు దశల్లో అమలు జరుగుతుంది.
మొదటి దశ:
: ప్రస్తుత మరియు పెండింగ్‌లో ఉన్న బొగ్గు గని మూసివేతలకు సంబంధించి మొదటి దశలో కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. మూసివేత ఆవశ్యకత, సంస్థల సంసిద్ధత, ప్రతుతం అమలు జరుగుతున్న కార్యక్రమాలు, బొగ్గు గనుల చుట్టూ సామాజిక-ఆర్థిక స్థితి, పర్యావరణ అంశాల ప్రాతిపదికపై అధ్యయనాలను నిర్వహిస్తారు. దీని ఆధారంగా చట్టబద్ధమైన ,సంస్థాగత వ్యవస్థలో అమలు చేయవలసిన సంస్కరణలనురూపొందించడం జరుగుతుంది. ఆర్థిక అంశాలతో పాటు పైన పేర్కొన్న మూడు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది.
రెండవ దశ:
ఖరారు చేసినప్రణాళిక ప్రకారం గని మూసివేత కార్యక్రమం అమలులోకి వస్తుంది. ఇందులో i) ప్రీ-క్లోజర్ ప్లానింగ్, ii) ఎర్లీ క్లోజర్ మరియు iii) ప్రాంతీయ పరివర్తన కోసం కార్యక్రమాలు అమలు జరుగుతాయి. మొదటి దశ పూర్తయిన తర్వాత ఈ దశ ప్రారంభమవుతుంది. ఎక్కువ కాలం అమలు జరిగే ఈ దశలో కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటాయి.
10-12 నెలల పాటు కొనసాగే అవకాశం ఉన్న మొదటి దశ త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం రెండు దశల అమలును పర్యవేక్షించడానికి బొగ్గు కంట్రోలర్ కార్యాలయ పరిపాలనా నియంత్రణలో ఒక ప్రత్యేక ప్రయోజన సంస్థ ఏర్పాటు చేయబడుతుంది. బొగ్గు కంపెనీలు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి ఈ సంస్థతో సమన్వయం సాధించడానికి బహుళ-క్రమశిక్షణ బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
రానున్న 3-4 సంవత్సరాల కాలంలో ఎదురయ్యే సమస్యలు, అనుభవం ఆధారంగా గనుల మూసివేతకు సమగ్ర విధానం రూపొందుతుంది. దీర్ఘ కాలం అమలు జరిగే గని మూసివేత ప్రక్రియలో అనుసరించవలసి ఉన్న మెరుగైన విధాన రూపకల్పనకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రణాళిక ఎంతోకాలం నుంచి నిరుపయోగంగా పడి ఉన్న పురాతన బొగ్గు గనుల ప్రాంతాలను తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశంలో సహకరిస్తుంది. గత కొద్ది కాలంగా ఈ అంశానికి సరైన ప్రాధాన్యత లభించలేదు. ప్రభుత్వ్మ్ తీసుకున్న నిర్ణయంతో గని ప్రాంతాలు స్థిరంగా పునరుద్ధరించబడడమే వాటిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల జీవనోపాధి,కల్పించే అంశానికి కూడా ప్రాధాన్యత లభిస్తుంది.
***
(Release ID: 1761562)
Visitor Counter : 260