ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

వేగవంతమైన పట్టణీకరణలో అవకాశాలు వెతుక్కోవాలి: ఉపరాష్ట్రపతి


- ప్రజాకేంద్రిత పట్టణీకరణ ప్రణాళిక, అభివృద్ధిపై మరింత దృష్టిసారించాలి
- త్రిపుర రాజధాని అగర్తలాలో స్మార్ట్ రోడ్ ప్రాజెక్టులను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

- స్వయం సహాయక బృందాల మహిళలతో ఉపరాష్ట్రపతి చర్చాగోష్టి

- ఈశాన్య భారతంలోని చేతివృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని సూచన

- త్రిపుర రాష్ట్రంలో 95శాతం కరోనా టీకాకరణ పూర్తవడంపై అభినందన

Posted On: 06 OCT 2021 2:36PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పట్టణీకరణ వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో.. ఈ మార్గంలో సరికొత్త అవకాశాలను వెతుక్కోవాల్సిన అవకాశం ఉందని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గృహనిర్మాణం, మురుగునీటి శుద్ధి, ఇతర అత్యవసరసేవల కల్పన తదితర అంశాలకు సంబంధించి.. పట్టణీకరణ ప్రణాళిక, అభివృద్ధిపై మరింత దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. 

త్రిపుర రాజధాని అగర్తలాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనుసంధానతే అభివృద్ధికి మొదటి మార్గమని పేర్కొన్నారు. ఈ దిశగా త్రిపుర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు. తద్వారా ఈ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. రైలు, జల రవాణాతోపాటుగా వాయుమార్గ అనుసంధానత కోసం కూడా కార్యాచరణ వేగంగా అమలవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.  కిసాన్ రైల్ నెట్‌వర్క్‌ బలోపేతం కారణంగా ఈశాన్యభారతం రైతులు తమ ఉత్పత్తులను ఢిల్లీ, కోల్‌కతాతోపాటు దేశంలోని అన్ని మూలలకు పంపించేందుకు వీలుపడిందన్నారు. తద్వారా ఇక్కడి రైతు సాధికారతకు బాటలు, పరిశ్రమల అభివృద్ధికి పడుతున్నాయన్నారు.

అనంతరం, స్వయం సహాయక బృందాల ప్రతినిధులతో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. మహిళాసాధికారత, దేశాభివృద్ధిలో స్వయం సహాయక బృందాలు చేస్తున్న కృషిని మరువలేమన్నారు. త్రిపురలోని ఈ బృందాల సభ్యులు ఈ దిశగా మరో అడుగు ముందే ఉన్నారని ఆయన ప్రశంసించారు. బృంద సభ్యుల నైపుణ్యాన్ని పెంచేందుకు చొరవతీసుకోవడం అభినందనీయమన్నారు. దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని.. గ్రామస్వరాజ్యం ద్వారానే అన్ని వర్గాల సాధికారత సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. 

త్రిపుర రాష్ట్రంలో కరోనా టీకాకరణ 95 శాతం పూర్తవడాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.  మన చేతివృత్తులు, కళలు భారతదేశ సంస్కృతి ప్రత్యేకతన్న ఉపరాష్ట్రపతి, వీటిని కాపాడుకోవడం మన బాధ్యతన్నారు. ఈ అంశాల్లో అంతర్జాతీయ స్థాయి పద్ధతులను కూడా అలవర్చుకోవడం ద్వారా మరింత నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు వీలవుతుందన్నారు.

త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ విప్లవ్ కుమార్ దేవ్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి శ్రీ మేవర్ కుమార్ జమాతియాతోపాటు పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

***



(Release ID: 1761446) Visitor Counter : 139