ఉప రాష్ట్రపతి సచివాలయం
అభివృద్ధిలో అనుసంధానత పాత్ర మరింత కీలకం – ఉపరాష్ట్రపతి
• మారుమూల ప్రాంతాలను సైతం అనుసంధానం చేసే కార్యక్రమం వేగవంతం కావాలి
• యువతను వ్యవసాయ రంగం దిశగా ప్రోత్సహించాలని పిలుపు
• మేఘాలయ ప్రభుత్వం చొరవ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలని ఆకాంక్ష
• షిల్లాంగ్-డౌకి జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఉపరాష్ట్రపతి
Posted On:
04 OCT 2021 2:21PM by PIB Hyderabad
దేశాభివృద్ధిలో అనుసంధానత పాత్ర అత్యంత కీలకమని ఈశాన్యభారతదేశ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు నొక్కి చెప్పారు. ముఖ్యంగా ఈశాన్యభారతం లాంటి ప్రాంతాల అభివృద్ధిలో మెరుగైన రహదారి వ్యవస్థ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందన్నారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసే పని మరింత వేగవంతం కావలసి ఉందని ఆకాంక్షించారు.
షిల్లాంగ్ లోని 40వ జాతీయ రహదారిలో షిల్లాంగ్ – డౌకి మార్గం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉపరాష్ట్రపతి, అక్కడి రహదారి అనుసంధాన సంక్లిష్టతలగురించి వివరించారు. ఈశాన్య భారతం లాంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు, వర్షపు నేలలు రహదారి కార్యకలాపాలకు తరచూ ఆటంకం కలిస్తూ ఉంటాయని, ఈ నేపథ్యంలో రోడ్ల నిర్మాణం విషయం నూతన ఆవిష్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇలాంటి ఇతర ప్రాంతాలను అనుసంధానం చేసే దిశగా చొరవ పెరగాలని సూచించారు. ఈ నేపథ్యంలో దీన్ని ఒక అవకాశంగా తీసుకుని సాంకేతిక సంస్థలు మెరుగైన రహదారి రూపకల్పన దిశగా ముందుకు రావాలని, తక్కువ కాలంలో రహదారి నిర్మాణం చేయగలిగే నూతన వ్యవస్థల మీద దృష్టి పెట్టాలని సూచించారు.
మేఘాలయ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో యువత ముందుకు రావలసిన అవసరాన్ని గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంలోనూ అన్నే అవకాశాలు ఉన్నాయని, యువత దీన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. మేఘాలయలో ఉద్యానవన సాగు పెద్ద వీస్తీర్ణంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా లాభసాటి వ్యవసాయం దిశగా యువతను ప్రోత్సహించాలని సూచించారు. ఈ విషయంలో ప్రైమ్ హబ్ ద్వారా మేఘాలయ ప్రభుత్వం చొరవ తీసుకున్న విధానాన్ని ప్రస్తావించిన ఆయన, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇది ఆదర్శం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మేఘాలయ గవర్నర్ శ్రీ సత్యపాల్ మాలిక్, ముఖ్యమంత్రి శ్రీ కాన్రాడ్ కె. సంగ్మా, ఉపముఖ్యమంత్రి శ్రీ పి. టిన్సాంగ్ సహా మేఘాలయకు చెందిన పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 1760805)
Visitor Counter : 186