రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఔషధ కంపెనీల అక్రమాలకు తమ రహస్య ఆమోదం ఉందన్న తప్పుడు ప్రకటనలను ఖండించిన ఎన్‌పీపీఏ
Posted On:
29 SEP 2021 1:42PM by PIB Hyderabad
జాతీయ ఔషధ ధరల నిర్ణయ ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) భారత ప్రభుత్వ రసాయనాలు-ఎరువుల మంత్రిత్వశాఖలోని ఔషధ విభాగం పరిధిలోగల ఒక నియంత్రణ సంస్థ. దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరలో మందులు లభ్యమయ్యే విధంగా నిర్దేశిత, అనిర్దేశిత ఔషధ సమ్మేళనాల గరిష్ఠ ధరలను నిర్ణయించి, వాటి అమలును పర్యవేక్షించడం ఈ సంస్థ బాధ్యత. కాగా, అక్రమ పద్ధతులకు పాల్పడుతున్న ఔషధ కంపెనీలు ఒకే గరిష్ఠ ధరగల అనేక మందులను వివిధ రంగాలకు విభిన్న ధరలతో విక్రయిస్తున్నాయని, ఇందుకు ‘ఎన్‌పీపీఏ’ రహస్య ఆమోదం కూడా ఉన్నదని “జమ్ము ఫార్మస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్” (జేడీపీఏ) ఆరోపించినట్లు 2021 సెప్టెంబరు 22వ తేదీన ‘ది డైలీ ఎక్సెల్సియర్’ ఒక కథనం వెలువరించింది.
అయితే, ఔషధ కంపెనీల అక్రమాలకు తమ రహస్య ఆమోదం ఉందన్న తప్పుడు ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎన్‌పీపీఏ స్పష్టం చేసింది. నిర్దేశిత ఔషధ సమ్మేళనాలు, కొత్త మందులకు తాము నిర్దేశించిన చిల్లర ధరలను ఉల్లంఘిస్తే ‘ఎన్‌పీపీఏ’ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అదేవిధంగా ఔషధ ధరల నియంత్రణ ఆదేశాలు (డీపీసీఓ)-2013లోని 20వ పేరాలో పేర్కొన్న మేరకు గడచిన 12 నెలల్లో అనిర్దేశిత మందుల గరిష్ఠ చిల్లర ధరలను 10 శాతానికిపైగా పెంచినా చర్చలు తప్పవని పేర్కొంది.
కాగా... వివిధ రంగాలకు వర్తించే గరిష్ఠ ధర/గరిష్ఠ చిల్లర ధరకన్నా తక్కువకు ఔషధ కంపెనీలు మందులు విక్రయించే అంశం ‘ఎన్‌పీపీఏ’ పరిధిలోకి రాదని కూడా స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఆయా కంపెనీల వాణిజ్య సంబంధిత నిబంధనల ప్రకారం సాగుతుందని, ఇది ‘ఎన్‌పీపీఏ’ నియంత్రణ చట్రానికి లోబడి ఉండదని విశదీకరించింది.
*****
(Release ID: 1759504)
Visitor Counter : 167