ప్రధాన మంత్రి కార్యాలయం

అమెరికా అధ్య‌క్షునితో ప్ర‌ధాన‌మంత్రి స‌మావేశం

Posted On: 24 SEP 2021 11:45PM by PIB Hyderabad

అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ ఆర్‌. బైడెన్, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ స‌మావేశం 2021 సెప్టెంబ‌ర్ 24న అత్యంత సుహృద్భావ‌పూర్వ‌కం, ఉత్పాద‌కంగా జ‌రిగింది. 

2021లో బైడెన్ అధ్య‌క్షుడుగా అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన అనంత‌రం ఉభ‌యుల మ‌ధ్య జ‌రిగిన తొలి ముఖాముఖి స‌మావేశం ఇదే. భార‌త‌-అమెరికా స‌మ‌గ్ర ప్రపంచ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం తీరును ఉభ‌యులు స‌మీక్షించేందుకు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకున్నారు.  ద్వైపాక్షిక స‌హ‌కారం మ‌రింత బ‌లోపేతం చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఆ భాగ‌స్వామ్యానికున్న‌ద‌ని  వారు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జాస్వామిక విలువ‌లు, టెక్నాల‌జీ, వాణిజ్యం, ప్ర‌జ‌ల‌ ప్ర‌తిభ‌, ట్ర‌స్టీ స్వ‌భావం, అన్నింటినీ మించి న‌మ్మ‌కం ఆధారంగా భార‌త‌, అమెరికా ప‌రివ‌ర్తిత ద‌శాబ్దిలోకి ప్ర‌వేశిస్తున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. త్వ‌ర‌లో విభిన్న రంగాల మ‌ధ్య జ‌రుగ‌నున్న ద్వైపాక్షిక చ‌ర్చ‌లు;  విదేశీ, ర‌క్ష‌ణ మంత్రుల వార్షిక 2+2 చ‌ర్చ‌లను ఆహ్వానిస్తూ అవి భ‌విష్య‌త్తుకు ప్రాధాన్య‌త‌ల‌ను గుర్తిస్తాయ‌ని ఉభ‌యులు భావించారు.

కోవిడ్‌-19 తాజా స్థితిని, మ‌హ‌మ్మారిని అదుపులోకి తేవ‌డానికి భార‌త‌-అమెరికా మ‌ధ్య స‌హ‌కారం గురించి ఉభ‌య నాయ‌కులు చ‌ర్చించారు. వ్యాక్సినేష‌న్ విష‌యంలో భార‌త‌దేశం కృషిని, కోవిడ్ స‌హాయం అందించేందుకు ప్ర‌పంచ స్థాయిలో ఉభ‌యులు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అధ్య‌క్షుడు బైడెన్ ప్ర‌శంసించారు.

ద్వైపాక్షిక వాణిజ్యం మ‌రింత విస్త‌రించేందుకు విస్తృత అవ‌కాశాలున్నాయ‌ని అంగీక‌రిస్తూ ఈ ఏడాది చివ‌రిలో జ‌రుగ‌నున్న త‌దుప‌రి వాణిజ్య విధాన ఫోర‌మ్ లో వాణిజ్య అనుసంధాన‌త పెంచేందుకు చ‌ర్య‌ల‌ను గుర్తిస్తార‌ని వారు అంగీకారానికి వ‌చ్చారు. భార‌త‌-అమెరికా వాతావ‌ర‌ణ‌, స్వ‌చ్ఛ ఇంధ‌న అజెండా 2030 కింద స్వ‌చ్ఛ ఇంధ‌న అభివృద్ధి, అమ‌లుకు సంబంధించిన కీల‌క టెక్నాల‌జీల‌ను ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని వారు అంగీక‌రించారు. అమెరికాలో భార‌త సంత‌తి ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో ఉన్నార‌న్న విష‌యం ప్ర‌ధాన‌మంత్రి గుర్తు చేస్తూ ఉభ‌య దేశాలు ప్ర‌జ‌ల మ‌ధ్య ప్ర‌త్య‌క్ష సంబంధాలు, ఉన్న‌త విద్యారంగంలో బంధాన్ని, రాక‌పోక‌ల‌ను మ‌రింత‌గా పెంచుకోవాల్సిన అవ‌స‌రం గురించి ప్ర‌త్యేకంగా  ప్ర‌స్తావించారు.

ఆఫ్గ‌నిస్తాన్ లో ప్ర‌స్తుత ప‌రిస్థితితో స‌హా ద‌క్షిణాసియా ప్రాంతీయ ప‌రిణామాల‌పై ఉభ‌యులు ప‌ర‌స్ప‌రం అభిప్రాయాలు తెలియ‌చేసుకోవ‌డంతో పాటు ప్ర‌పంచంలో ఉగ్ర‌వాదాన్ని నిర్మూలించేందుకు క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌న్న క‌ట్టుబాటును పున‌రుద్ఘాటించారు. సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఖండించారు. తాలిబ‌న్లు త‌మ క‌ట్టుబాట్ల‌కు క‌ట్టుబ‌డాల‌ని పిలుపు ఇస్తూ ఆఫ్గ‌న్ల మాన‌వ హ‌క్కుల‌ను గౌర‌వించాల‌ని, ఆఫ్గ‌నిస్తాన్ కు మాన‌వ‌తాపూర్వ‌క స‌హాయాన్ని అనుమ‌తించాల‌ని సూచించారు. అలాగే ఆఫ్గ‌న్ ప్ర‌జ‌ల ప‌ట్ల దీర్ఘ‌కాలిక క‌ట్టుబాటును దృష్టిలో ఉంచుకుని ఆఫ్గ‌న్లంద‌రికీ స‌మ్మిళిత‌, శాంతియుత భ‌విష్య‌త్తును అందించేందుకు ప‌ర‌స్ప‌రం, ఇత‌ర భాగ‌స్వాముల‌తో స‌న్నిహితంగా కృషి చేయాల‌ని వారు అంగీక‌రించారు.

ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంపై కూడా అభిప్రాయాలు ప‌ర‌స్ప‌రం తెలియ‌చేసుకుంటూ ఆ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా, దాప‌రికం లేనిదిగా, స‌మ్మిళితంగా ఉండాల‌న్న విష‌యంలో ఉభ‌యుల ఉమ్మ‌డి విజ‌న్ ను పున‌రుద్ఘాటించారు.

వాతావ‌ర‌ణ మార్పులు, ఉగ్ర‌వాదం వంటి ప్ర‌పంచ స‌మ‌స్య‌ల‌పై వ్యూహాత్మ‌క దృక్కోణం, ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని వారు అంగీక‌రించారు.

భార‌త‌దేశాన్ని సంద‌ర్శించాల‌ని అధ్య‌క్షుడు బైడెన్ ను, ప్ర‌థ‌మ మ‌హిళ డాక్ట‌ర్ జిల్ బైడెన్ ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ మోదీ అహ్వానించారు. ఉన్న‌త స్థాయి సంప్ర‌దింపులు కొన‌సాగించాల‌ని, ద్వైపాక్షిక బంధాన్ని మ‌రింత విస్త‌రించాల‌ని, ప్ర‌పంచ భాగ‌స్వామ్యాల‌ను మ‌రింత సంప‌న్నం చేసుకోవాల‌ని ఉభ‌యులు అంగీక‌రించారు.

 

***



(Release ID: 1758431) Visitor Counter : 110