ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
బధిరుల అంతర్జాతీయ వారోత్సవం -2021 , బధిరుల అభివృద్ధి ఉత్సవాల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్.
వివిధ అనారోగ్యాలు, వైకల్యాలను గుర్తించేందుకు చిన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి : డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
Posted On:
24 SEP 2021 2:32PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్, 2021 బధిరుల అంతర్జాతీయ వారోత్సవానికి న్యూఢిల్లీలోని సెంట్రల్ హెల్త్ ఎడ్యుకేషన్ బ్యూరోలో అధ్యక్షత వహించి, ప్రసంగించారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కింద డైరక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఈ అంతర్జాతీయ బధిరుల వారోత్సవం -2021ని నిర్వహిస్తోంది. బధిరులకు సంబంధించి పలు అవగాహనా కార్యక్రమాలు, ఈ రంగంతో సంబంధం గల పలు స్టేక్ హోల్డర్లతో కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఈ ఏడాది థీమ్, అభివృద్ధి చెందుతున్న బధిరుల కమ్యూనిటీల ఉత్సవం గా నిర్ణయించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ భారతి పవార్, దేశంలో వివిధ వినికిడి సమస్యలతో బాధపడే వారు 9 కోట్ల మంది వరకు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం మనం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న నేపథ్యంలో మనం మన గ్రామాలకు వెళ్లి, చిన్న పిల్లలకు గల వివిధ అనారోగ్యాలపై పరీక్షలు నిర్వహింపచేయాలన్నారు. ప్రాథమిక దశలో వీటిని గుర్తించడం వల్ల వైకల్యం ఏర్పడకుండా నివారించవచ్చని ఆమె అన్నారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.వివిధ అనారోగ్యాలు, వివిధ వైకలయాలకు సంబంధించి చిన్నపిల్లలకు పరీక్షలు నిర్వహింప చేయడం తప్పనిసరి అని, చికిత్స కంటే రోగం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ భారతి పవార్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ నాయకత్వంలో , భారతదేశం తనంత తానుగా ఔషధాన్ని తయారు చేయగలదని, రోజుకు 1 నుంచి 2 కోట్ల వరకు వాక్సిన్‌లు వేయగల సమర్ధత కలిగి ఉందని ప్రపంచానికి చాటి చెప్పగలిగిందని అన్నారు. పుట్టిన రోజు వేడుకల సమయంలో వినికిడి లోపం ఉన్న వారికి తమ పుట్టిన రోజు కానుకగా వినికిడి సమస్యను తీర్చే ఉపకరణాలను అవసరమైన వారికి బహుకరించాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు.
తన చిన్ననాటి ఉదాహరణను ఒక దానిని ప్రస్తావిస్తూ ఆమె, పసిపిల్లల సంరక్షణకు సంబంధించి పాతకాలపు సంప్రదాయాలను పునరుద్ధరించాలన్నారు. గర్భిణుల సంరక్షణపట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు. చిన్న పిల్లల ఆరోగ్య పరీక్షలు, చికిత్సకు సంబంధించి వివిధ హెల్ప్‌లైన్ల విషయమై క్యుఆర్ కోడ్‌తో చిన్న పాకెట్ బుక్‌లెట్ రూపొందించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ పాకెట్ బుక్‌ను ఆషా, అంగన్‌వాడి వర్కర్లు, ఇతర ఆస్పత్రి సిబ్బంది వినియోగించుకోవచ్చన్నారు. ఆయుష్మాన్ భారత్ వంటి వివిధ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని , దీనివల్ల ప్రజలు మరింత ప్రయోజనం పొందడానికి అవకాశం కలుగుతుందని అన్నారు.
బధిరుల అంతర్జాతీయ వారోత్సవాన్ని తొలుత 1958లో ఇటలీలోని రోమ్‌లో ప్రారంభించారు. గ్లోబల్ డెఫ్ కమ్యూనిటీ దీనిని ప్రతి ఏటా సెప్టెంబర్‌లో నిర్వహిస్తోంది. ప్రపంచ బధిరుల ఫెడరేషన్ తొలి ప్రపంచ కాంగ్రెస్ జరిగిన నెలలోనే దీనిని జరుపుతూ వస్తున్నారు. అంతర్జాతీయ బధిరుల వారోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా బధిరులకు సంబంధించిన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
డిజిహెచ్ ఎస్ డాక్టర్ సునీల్ కుమార్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డిజిహెచ్ ఎస్ డాక్టర్ కన్వర్ సేన్, డిడిజి , డిజిహెచ్ఎస్ డాక్టర్ అనిల్ కుమార్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1757718)
Visitor Counter : 196