ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచంలోనే అతిపెద్ద అనుసంధాన దేశాలలో ఒకటిగా భారతదేశాన్ని మార్చడానికి ప్రణాళికను రూపొందించడానికి వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ


ఇంటర్నెట్ సేవలు తక్కువగా లేదా అందుబాటులో లేని ప్రాంతాలలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని త్వరితగతిన అందించడానికి రూపొందించిన ప్రణాళికపై చర్చలు

గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడానికి ప్రారంభించిన భారత్ నెట్ పనితీరును సమీక్షించిన వర్క్‌షాప్‌

Posted On: 23 SEP 2021 11:42AM by PIB Hyderabad

  భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద అనుసంధాన దేశాలలో ఒకటిగా మార్చడానికి అమలు చేయాల్సిన కార్యాచరణ పథకాన్ని రూపొందించడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ' కనెక్టింగ్ ఆల్ ఇండియన్స్' పేరిట ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించింది.  వర్క్‌షాప్‌ లో దేశంలో ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న జియోఎయిర్‌టెల్  సహా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ సేవలు తక్కువగా లేదా అందుబాటులో లేని ప్రాంతాల వివరాలను సమావేశంలో చర్చించారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద ఫైబర్ ఆధారిత గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన  భారత్ నెట్ పని తీరును కూడా వర్క్‌షాప్‌లో సమీక్షించారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలని ప్రధానమంత్రి ఆలోచనను కార్యరూపంలోకి తీసుకుని రావడానికి భారత్ నెట్ అమలు జరుగుతున్నది. ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలు/గ్రామాల్లో సేవలను అందించడానికి అమలు చేయాల్సిన చర్యలను సమావేశంలో చర్చించారు. 

కేంద్ర సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అధ్యక్షతన  వర్క్‌షాప్‌ జరిగింది. ప్రతి ఒక్కరికి సురక్షితమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి తెలిపారు. డిజిటల్ ఇండియా ద్వారా ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చి డిజిటల్ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసి ఈ రంగంలో ఉపాధి అవకాశాలను ఎక్కువ చేయాలన్నది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయమని మంత్రి వివరించారు. 

ఇంటర్నెట్ సేవలను మరింత ఎక్కువగా అందుబాటులోకి తీసుకుని రావడానికి అమలు చేయాల్సిన చర్యలపై ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ప్రతినిధులు సలహాలు సూచనలను అందించారు.  

 

 ***


(Release ID: 1757269) Visitor Counter : 172