వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 సవాళ్లు ఎదురైనా, వ్యవసాయ ఎగుమతుల్లో జోరు!


2021-22 ఏప్రిల్, ఆగస్టు నెలల మధ్య
ఎగుమతిలో 22% వరకూ వృద్ధి..

-అపెడా- ఆధ్వర్యంలో ఎగుమతుల వృద్ధి
648.5కోట్ల డాలర్లనుంచి 790.2కోట్ల డాలర్లకు పెంపు..

Posted On: 21 SEP 2021 6:26PM by PIB Hyderabad

కోవిడ్-19 వైరస్ మహమ్మారి ఎన్ని సవాళ్లు విసిరినా, లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ వ్యవసాయ, ఆహార ఉత్పాదనల విషయంలో భారతదేశం గణనీయమైన పెరుగుదలను సాధించింది. 2021-22వ సంవత్సరంలో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ) వ్యవసాయ ఉత్పత్తుల, ఆహార ఉత్పాదనల ఎగుమతిలో 21.8శాతంపైగా వృద్ధిని నమోదు చేసింది. 2020-21వ సంవత్సరంలో ఇదే కాలంతో పోల్చినపుడు ఎగుమతుల్లో ఈ వృద్ధి నమోదైంది. వాణిజ్య నిఘా, గణాంకాల డైరెక్టరేట్ (డి.జి.సి.ఐ. అండ్ ఎస్.) ఈ మేరకు సత్వర అంచనాలను విడుదల చేసింది.

  వ్యవసాయ ఉత్పత్తులు, శుద్ధిచేసిన ఆహార ఉత్పాదల ఎగుమతి అభివృద్ధి సంస్థ (అపెడా-ఎ.పి.ఇ.డి.ఎ.) చేసిన మొత్తం ఎగుమతుల్లో 21.8శాతం వరకూ పెరుగుదల కనిపించింది. 2021 ఏప్రిల్, ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఎగుమతులను అమెరికన్ డాలర్ల విలవ ప్రకారం లెక్కించినపుడు ఈ వృద్ధి కనిపించింది. అంతకు ముందు సంవత్సరం అదే కాలంలో జరిగిన ఎగుమతుల విలువతో పోల్చినపుడు ఈ వృద్ధి కనిపించింది. 2020వ సంవత్సరం ఏప్రిల్ ఆగస్టు నెలల మధ్య కాలంలో అపెడా ఆధ్వర్యంలో జరిగిన ఎగుమతుల విలువ 648.5కోట్ల డాలర్ల మేర ఉండగా, 2021 ఏప్రిల్, ఆగస్టు మధ్య కాలంలో ఎగుమతులు 790.2కోట్ల అమెరికన్ డాలర్లకు పెరిగాయి.  కోవిడ్-19 వైరస్ వ్యాప్తితో పలురకాల ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ ఎగుమతుల్లో ఈ వృద్ధి సాధ్యమైంది. దేశంలోని రైతుల ఆదాయం పెంచాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి సాక్ష్యంగా నిలుస్తోంది.  వ్యవసాయ ఉత్పత్తుల, శుద్ధిచేసిన ఆహార ఉత్పాదనల ఎగుమతులకు ప్రోత్సాహం తగిన అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. 

  2021వ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వృద్ధి కొనసాగింపులో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో కూడా వ్యవసాయ, ఆహార సంబంధమైన ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ పెరుగుదల కనిపించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ.) ప్రణాళిక ప్రకారం, 2019వ సంవత్సరంలో భారత్ మొత్తం 37 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యవసాయ సంబంధమైన ఎగుమతులు సాధించింది. తద్వారా ప్రపంచ స్థాయి వ్యవసాయ ఎగుమతుల్లో 9వ స్థానాన్ని భారత్ కైవసం సొంతం చేసుకుంది.

  ఇదే కాలంలో బియ్యం ఎగుమతి 13.7శాతంగా ఉంది. అంటే, 2020 ఏప్రిల్ ఆగస్టు నెలల మధ్యకాలంలో 3,359 అమెరికన్ డాలర్లమేర బియ్యం ఎగుమతి కాగా, 2021 ఏప్రిల్, ఆగస్టు మధ్య కాలంలో ఈ ఎగుమతి 3,820 అమెరికన్ డాలర్లకు పెరిగింది.

  అపెడా సంస్థ వెలువరించిన సత్వర అంచనాల ప్రకారం, తాజా పండ్లు, కూరగాయల ఎగుమతులు (అమెరికన్ డాలర్ల ప్రకారం లెక్కించినపుడు) 6.1శాతం వృద్ధి నమోదైంది. మరో వైపు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పాదనల (తృణ ధాన్యాలతో తయారైన ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తులు) ఎగుమతుల విషయంలో ఏకంగా 41.9 శాతం వృద్ధి నమోదైంది. ఇక, 2020-21వ సంవత్సరం ఏప్రిల్ ఆగస్టు మధ్య కాలంలో 101.3 కోట్ల అమెరికన్ డాలర్లమేర విలువైన తాజా పండ్లు, కూరగాయల ఎగుమతి జరిగింది.  2021-22 సంవత్సరం ఏప్రిల్ ఆగస్టు నెలల్లో తాజా పండ్లు, కూరగాయల ఎగుమతులు 107.5కోట్ల అమెరికన్ డాలర్ల స్థాయికి పెరిగాయి.

  ఇక, ఇతర తృణధాన్యాల ఎగుమతి విషయంలో భారత్ ఏకంగా 142.1 శాతం మేర గణనీయ వృద్ధిని సాధించింది. మాంసం, పాడి, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి ఐదు నెలల్లో 31.1శాతం పెరుగుదల నమోదైంది.

   2020వ సంవత్సరం ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ఇతర తృణ ధాన్యాల ఎగుమతి 15.7కోట్ల అమెరికన్ డాలర్ల మేర ఉండగా, 2021వ సంవత్సరం ఏప్రిల్, ఆగస్టు మధ్యలో ఇది 37.9కోట్ల అమెరికన్ డాలర్లకు పెరిగింది. ఇక మాసం, పాడి, పౌల్ట్రీ ఉత్పాదనల ఎగుమతి 2020 ఏప్రిల్ ఆగస్టు మధ్య కాలంలో 118.5కోట్ల అమెరికన్ డాలర్ల మేర ఉండగా, 2021 ఏప్రిల్, ఆగస్టు మధ్య ఇది 155.4కోట్ల అమెరికన్ డాలర్లకు పెరిగింది.

  2021 ఏప్రిల్ ఆగస్టు మధ్యకాలంలో జీడిపప్పు ఎగుమతి 28.5శాతం నమోదైంది. 2020 ఏప్రిల్, ఆగస్టు మధ్యకాలంలో 14.4కోట్ల అమెరికన్ డాలర్లుగా ఉన్న జీడిపప్పు ఎగుమతి,..2021 ఏప్రిల్ ఆగస్టు మధ్య కాలానికల్లా 18.5కోట్ల అమెరికన్ డాలర్లకు పెరిగింది.

  కోవిడ్-19 వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో అమల్లోకి వచ్చిన అనేక ఆంక్షల కారణంగా చాలా వరకు వాణిజ్య కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అజమాయిషీలోని అపెడా సంస్థ తీసుకున్న చొరవ కారణంగా వివిద ఉత్పత్తుల  ఎగుమతుల విషయంలో దేశం ఈ రికార్డులన్నింటినీ సాధించగలిగింది.

  అపెడా సంస్థ తీసుకున్న చొరవతోనే దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల, ప్రాసెస్డ్ ఆహార ఉత్పాదనల ఎగుమతుల్లో పెరుగుదల సాధ్యమైంది. భారతదేశం తరఫున వివిధ దేశాల్లో బిజినెస్ టు బిజినెస్ (బి. టు బి) ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు నిర్వహించడం, వివిధ ఉత్పాదనలకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక మార్కెట్లను అన్వేషణ,  ఆయా దేశాల్లో భారతీయ రాయబార కార్యాలయాల ప్రమేయంతో మార్కెటింగ్ అవగాహనా కార్యకలాపాలు నిర్వహణ తదితర పనులను అపెడా చేపట్టడంతో ఎగుమతుల్లో వృద్ధి సాధ్యమైంది.

   భారతదేశంలో భౌగోళికపరమైన గుర్తింపును (జి.ఐ.ని) నమోదు చేసుకున్న ఉత్పత్తుల మార్కెటింగ్.ను ప్రోత్సహించేందుకు అపెడా అనేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం వ్యవసాయ, ఆహార ఉత్పాదనలపై విక్రయదార్లు, కొనుగోలు దార్ల మధ్య వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా సమావేశాలను అపెడా నిర్వహించింది. ఈ సమావేశాలను యునైడెట్ అరబ్ ఎమిరేట్స్.తో కలసి నిర్వహించారు. అలాగే, హస్త కళాఖండాల వంటి భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పాదనలపై అమెరికాతో కలసి వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశాలను అపెడా నిర్వహించింది. మనదేశంనుంచి దిగుమతికి ఎక్కువ అవకాశాలున్న దేశాలతో ఈ తరహా కార్యకలాపాలను అపెడా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. వ్యవసాయ దిగుబడులకు సంబంధించి భౌగోళిక గుర్తింపు ఉన్న ఉన్న ఉత్పాదనలకు ప్రజాదరణ కల్పించేందుకు అపెడా చర్యలు తీసుకుంటోంది.

  ఇక, ఎగుమతికి ఉద్దేశించిన ఉత్పాదనలకు నాణ్యతా ధ్రువీకరణ పత్రాల జారీ నిరాటంకంగా జరిగేలా చూసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 220 పరిశోధనాగారాలను అపెడా గుర్తించింది. విస్తృత శ్రేణిలో ఉత్పాదనలకు, ఎగుమతిదార్లకు ఉత్పత్తులకు సంబంధించి నాణ్యతా పరీక్షల నిర్వహణా సేవలను అందించేందుకు ఈ లేబరేటరీలను అపెడా గుర్తించింది. ఎగుమతి యోగ్యతపై పరీక్షలు, ఇతర పర్యవేక్షణా ప్రణాళికల నిర్వహణకోసం గుర్తింపు పొందిన పరిశోధనాగారాల బలోపేతం, నవీకరణ విషయంలో కూడా అపెడా తగిన సహాయ, సహకారాలు అందిస్తుంది.  వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యతా ప్రమాణాల మెరుగుదల, మార్కెట్ సదుపాయాల అభివృద్ధి తదితర పథకాలకు ఆర్థిక సహాయం అందించడంలో కూడా అపెడా కృషి చేస్తుంది.

  వీటికి తోడు,. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో ఎగుమతిదార్లు పాలుపంచుకునేందుకు దోహదపడే కార్యకలాపాలను అపెడా నిర్వహిస్తుంది. ప్రపంచ స్థాయి మార్కెట్.లో ఎగుమతిదార్లు తమ ఆహార ఉత్పాదనలకు మార్కెట్ సదుపాయాలు కల్పించుకునేందుకు అవసరమైన వేదికను అపెడా ఏర్పాటు చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఆహార్ (ఎ.ఎ.హెచ్.ఎ.ఆర్.), ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్, బయోఫ్యాచ్ ఇండియా తదితర కార్యక్రమాలను కూడా అపెడా నిర్వహిస్తుంది.

  ఉద్యానవన పంటల ఉత్పత్తుల అంతర్జాతీయ మార్కెట్.కు సంబంధించిన నాణ్యతా నిర్ధారణపరమైన అవసరాలకోసం ప్యాక్ హౌస్.ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అపెడా నిర్వహిస్తుంది. వివిధ పంటలు నాణ్యతా ప్రమాణాలు యూరోపయన్ యూనియన్ (ఇ.యు.), ఇ.యు. సభ్యదేశాలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు సదరు ఉత్పత్తుల గ్రేడింగ్, ప్రాసెసింగ్ కార్యకలాపాల కోసం ఎగుమతి విభాగాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అపెడా నిర్వహిస్తుంది.

 అలాగే, మాసం ప్రాసెసింగ్ ప్లాంట్లు, కబేళాలు ప్రపంచ స్థాయి ఆహార భద్రతా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పర్యవేక్షిస్తూ వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా అపెడా నిర్వహిస్తుంది. దిగుమతి చేసుకునే దేశాల్లో అమలుల్లో ఉండే ఆహార భద్రతా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పాదనలు ఉండేలా చూసేందుకు అవసరమైన వ్యవస్థల విషయంలో కూడా అపెడా కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణా సమాచారాన్ని, మార్కెట్ అనుబంధం సమాచారాన్ని సంబంధిత ఎగుమతుదార్లకు ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ ఉంటుంది. దేశంలో  ఎగుమతుల ప్రోత్సాహానికి అపెడా ఇలా అనేక కార్యకలాపాలను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తోంది.

 

****



(Release ID: 1756877) Visitor Counter : 184


Read this release in: English , Urdu , Hindi , Tamil