ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

యువతకు ఆకర్షణీయమైన, ఉపాధికల్పన అవకాశంగా క్రీడలను ప్రోత్సహించాలి: ఉపరాష్ట్రపతి


• దేశంలో క్రీడామౌలికవసతుల కల్పనతోపాటు నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించే వాతావరణాన్ని నిర్మించాలని సూచన

• దివ్యాంగులకు సైతం క్షేత్రస్థాయిలో క్రీడా వసతులను మెరుగురచాలి*

• గురుగ్రామ్‌లో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ అవార్డు గ్రహీతలు, ఈ క్రీడల్లో పాల్గొన్నవారిని సన్మానించిన ఉపరాష్ట్రపతి

• క్రీడాకారులను చూసి దేశం గర్విస్తోంది

• యువత శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం కోసం క్రీడలవైపు దృష్టి సారించాలన్న ఉపరాష్ట్రపతి

Posted On: 19 SEP 2021 6:20PM by PIB Hyderabad

దేశంలో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు అనువైన వాతావరణాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ లో భారతీయ క్రీడాకారులు చూపిన సత్తా కారణంగా దేశంలో యువతకు క్రీడలపై ఆసక్తి మరింత పెరిగిందన్నారు. 

హరియాణాలోని గురుగ్రామ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల్లో హర్యానా నుంచి పాల్గొన్న క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి, క్రీడాకారులందరినీ పేరుపేరునా అభినందించారు. కరోనా మహమ్మారితో ఒలింపిక్స్ కు ముందు శిక్షణ విషయంలోనూ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ క్రీడాకారులు సత్తాచాటడం, గతంలో కంటే ఎక్కువ పతకాలను సాధించడం సాధారణ విషయం కాదన్నారు. భారత క్రీడాకారులు టోక్యో వేదికగా చూపించిన క్రీడా ప్రతిభ యావద్భారతానికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు.

దేశంలో క్రీడలను మరింతగా ప్రోత్సహించటంతో పాటు, మౌలికవసతుల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముందన్న ఉపరాష్ట్రపతి, క్షేత్రస్థాయిలోనూ కనీస వసతులతో మొదలు పెట్టి పట్టణాలు, నగరాల వరకు వసతులను మరింతగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. దీంతోపాటుగా క్రీడల్లో రాణిస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయనే విషయంలో యువతకు భరోసా కల్పించగలిగితే.. రానున్న రోజుల్లో అంతర్జాతీయ క్రీడా యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు మార్గం సుగమం అవుతుందని ఉపరాష్ట్రపతి సూచించారు. 

పారాలింపియన్లు చూపించిన ప్రతిభ అద్భుతమని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, దివ్యాంగులకు కూడా సరైన అవకాశాలు కల్పిస్తే చక్కటి ఫలితాలు సాధిస్తారని నిరూపించారన్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రైవేటు, కార్పొరేట్ రంగం కూడా తోడ్పాటునందించి, భారతీయ యువతలోని నైపుణ్యాన్ని గుర్తించి దానికి సానబెట్టగలిగితే మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన పేర్కొన్నారు. 

క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కలుగుతుందని.. ఆరోగ్యకర పోటీతత్వం అలవడుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. అసంక్రమిత వ్యాధులు పెరిగేందుకు కారణం కూడా సరైన వ్యాయామం లేకపోవడమేనంటూ వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమంలో హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీ సందీప్ సింగ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, క్రీడాశాఖ కార్యదర్శి శ్రీ ఏకే సింగ్, టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ లో పతకాలు సాధించిన, పాల్గొన్న క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

 

*గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో రైతులకు ఆర్థిక భరోసా*

 

అంతకుముందు, గురుగ్రామ్‌లో జరిగిన మరో కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడు, రైతునాయకుడు, సామాజికవేత్త దివంగత శ్రీ ఛోటు రామ్ గారి వ్యవసాయ ఆర్థిక విధానాలు, రాజకీయ నిర్ణయాలు, స్వాతంత్రోద్యమంలో వారి పాత్ర తదితర అంశాలతో రూపొందించిన సంకలనాలను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వగలమన్నారు. 

కరోనా సమయంలో రైతులు రికార్డు స్థాయిలో ఉత్పాదకత పెంచడం అభినందించదగిన పరిణామం అన్న ఉపరాష్ట్రపతి, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ఆధునికతను జోడించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. 

స్వాతంత్రోద్యమంలో తదనంతరం, దేశంలో వ్యవసాయ రంగంలో మరీ ముఖ్యంగా హరియాణా, పంజాబ్ ప్రాంతాల్లో తీసుకొచ్చిన మార్పులు, సామాజిక సేవ తదితర అంశాలను నేటి సమాజానికి తెలియజేసేందుకు హరియాణా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను అభినందించారు.

***



(Release ID: 1756297) Visitor Counter : 162