వ్యవసాయ మంత్రిత్వ శాఖ
చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశానిదే కీలకపాత్ర
ప్రతిరోజూ ఆహారంలో చిరుధాన్యాలు తీసుకోవడం ద్వరా పోషకాహార లోపాన్నిఅధిగమించవచ్చు
పోషక ధాన్యాలపై మహాసమ్మేళనం 3.0 ప్రారంభించిన కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్
అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం-2023” ఏర్పాట్లలో భాగంగా మహాసమ్మేళనం
Posted On:
17 SEP 2021 5:48PM by PIB Hyderabad
ఆహార భద్రతతోపాటు పోషణ భద్రత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజుల పోషక ధాన్యాలపై మహాసమ్మేళనం 3.0ను ఆయన ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోషణ ధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో “ఐక్యరాజ్య సమితి 2023” సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని వెల్లడించారు. భారతదేశం 2018లో జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం-2018 నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. మన పూర్వీకులు ఏళ్లుగా చిరు ధాన్యాలతో వండిన పదార్థాలను ఆహారంగా తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించారని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తీ పోషక విలువలు ఉన్న ఆహార ధాన్యాల ప్రాధాన్యత తెలుసుకొని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయరంగంలో ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం వివిధ ఉద్దీపనల కింద రూ.1.5 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నూనె గింజలు, ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం(స్పెషన్ మిషన్) ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ మిషన్ ద్వారా నూనె గింజలు, ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమైన భూములు ఉన్న తెలంగాణ ప్రాంత రైతులకు మేలు చేకూరనుందని పేర్కొన్నారు. రాబోయే తరాలలో రైతు కుటుంబాలు సాగుకు దూరం కాకుండా చూడటంతోపాటు, ఇప్పటి రైతులకు వారి పంట ఉత్పత్తులపై లాభాలు తెచ్చిపెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చిందని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 10 వేల రైతు ఉత్పత్తి సంస్థ (ఎఫ్‌పిఒ)లు ఏర్పాటుచేసి, వాటికోసం రూ.6850 కోట్లు నిధులు కేటాయించి ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎఫ్‌పీఒల ద్వారా దేశంలో 86 శాతం మంది రైతుల జీవితాలలో సానుకూల మార్పులు రానున్నాయని మంత్రి పేర్కొన్నారు.
మహాసమ్మేళనం 3.0 ప్రారంభించడానికి ముందు ఈ సందర్భంగా వివిధ స్టార్టప్ సంస్థలు, చిరు ధాన్యాల ప్రాసెసింగ్ సంస్థలు ఏర్పాటుచేసిన ఫుడ్ స్టాళ్లను మంత్రి సందర్శించారు. అలానే భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) - భారత చిరుధాన్యాల పరిశోధన మండలి(ఐఐఎంఆర్) ప్రచురించిన వివిధ ప్రచురణలను ఇతర ప్రతినిధులతో కలిసి మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, సహకార మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, కేంద్ర శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన శాఖ కార్యదర్శి డాక్టర్ శేఖర్ సి.మండే, వ్యవసాయ పరిశోధన, విద్య కార్యదర్శి డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, కేంద్ర, ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టీ.ఆర్.శర్మ తదితరులు పాల్గొన్నారు.
సమ్మేళనం ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి తోమర్ మొక్కలు నాటి, విత్తనాలు పంపిణీ చేయడంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు రైతులు, జీవ వైవిధ్య బృందాల ప్రతినిధులతో సంభాషించారు. అలానే ‘గ్లాస్ హౌస్ రీసెర్చ్ ఫెసిలిటీ’, ‘పోషక ధాన్య విత్తన పరిశోధన కేంద్రం’, ‘చిరుధాన్యాల ఆహారం, శుద్ధి కేంద్రాల స్టార్టప్ ఫెసిలిటీ’, ‘ఫ్లేకింగ్ లైన్స్’ ప్రారంభించారు. ఐసీఏఆర్-ఐఐఎంఆర్ లో ఉన్న బిజినెస్ ఇంక్యుబేటర్, న్యూట్రిహబ్ తోపాటు ఆహార శుద్ధి సదుపాయాలను మంత్రి సందర్శించారు.
రెండు రోజులపాటు హైదరాబాద్‌లో కొనసాగనున్న ఈ మహా సమ్మేళనం 3.0ను ఐసీఏఆర్-ఐఐఎంఆర్‌తోపాటు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఒ), కేంద్ర వ్వవసాయ మంత్రిత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన “అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023” సన్నాహకాలలో భాగంగా వరుసగా 3 సమ్మేళనాలు ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌ఘడ్, అస్సాం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
****
(Release ID: 1755818)
Visitor Counter : 380