విద్యుత్తు మంత్రిత్వ శాఖ

అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక పరిధిలోని ఇంధన పరిశ్రమనుద్దేశించి ప్రసంగించిన విద్యుత్‌శాఖ మంత్రి

Posted On: 16 SEP 2021 7:58PM by PIB Hyderabad

   అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌), దీని పరిధిలోని ప్రధాన పరిశ్రమల ప్రతినిధులతో న్యూఢిల్లీలో ఇవాళ నిర్వహించిన వాస్తవిక సాదృశ ఇంధన పరిశ్రమల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కేంద్ర విద్యుత్‌-నవ్య/పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి శ్రీ ఆర్‌.కె.సింగ్‌ ప్రసంగించారు. దేశంలో 2047నాటికి ‘ఇంధన స్వావలంబన’ సాధనపై ప్రధాని స్వప్న సాకారానికి తమ మంత్రిత్వశాఖ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇంధన రంగంలో భారత ప్రభుత్వ ప్రాథమ్యాలను శ్రీ సింగ్‌ ఈ సందర్భంగా వివరించారు. భారత అమెరికాలకు ఒకే విధమైన లక్ష్యాలున్నాయని, అలాగే వాతావరణ సమస్యల విషయంలోనూ సమాన ఉత్సాహంతో సాగుతున్నాయని మంత్రి వివరించారు. వాతావరణ మార్పు సమస్య ఉపశమనం దిశగా ప్రపంచంలోని మిగిలిన దేశాల పోరుకు ఈ భాగస్వామ్యం ఒక ప్రేరణగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. తదనుగుణంగా అమెరికా-భారత భాగస్వామ్యంలో ఇంధన పరిశ్రమల రంగం కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

   భారతదేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 2022 నాటికి 175 గిగావాట్లకు, 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలని బృహత్‌ లక్ష్యం నిర్దేశించుకున్నదని శ్రీ సింగ్‌ ప్రకటించారు. సౌర, పవన విద్యుత్‌ రంగాల్లో భారత్‌ నేడు 100 గిగావాట్ల స్థాపిత సామర్థ్య స్థాయిని సాధించిందని, దీనికి జల విద్యుత్‌ సామర్థ్యాన్ని జోడించడంతో పునరుత్పాదక స్థాపిత సామర్థ్యం 146 గిగావాట్లకు పెరిగిందని తెలిపారు. అంతేకాకుండా మరో 63 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యం సాధన దిశగా ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. దీంతో పునరుత్పాదక సామర్థ్యం జోడింపు రీత్యా వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ ఒకటిగా నిలుస్తున్నదని తెలిపారు. శక్తి వినియోగం కోసం హైడ్రోజన్‌ను ఒక ఇంధనంగా వాడుకోవడంపై భారత్‌ ప్రణాళిక గురించి మంత్రి వివరించారు. హైడ్రోజన్‌ను గిట్టుబాటయ్యే ఇంధనంగా వినియోగించే మార్గాన్ని సుగమం చేయడంలో భాగంగా రాబోయే 3-4 నెలల్లో హరిత హైడ్రోజన్‌ సరఫరా కోసం స్పర్థాత్మక బిడ్లను భారత్‌ ఆహ్వానించనున్నదని చెప్పారు.

   నిల్వ సామర్థ్యం పెంపును ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి శ్రీ సింగ్‌ వివరించారు. ఈ మేరకు భారీ పునరుత్పాదక సామర్థ్య ఏకీకరణకు మద్దతులో భాగంగా ‘పంప్‌డ్‌ హైడ్రో స్టోరేజ్‌’ సామర్థ్యం పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశంలో బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యం పెంపు దిశగా జాతీయ, అంతర్జాతీయ తయారీదారుల నుంచి సమీప భవిష్యత్తులో బిడ్లు ఆహ్వానించే ప్రక్రియకు సన్నాహాలు సాగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా భారత్‌ త్వరలోనే ‘4000 మెగావాట్‌ అవర్‌ బీఈఎస్‌ఎస్‌’ బిడ్లు, ఆ తర్వాత లద్దాఖ్‌లో ‘12 గిగావాట్‌ అవర్‌’ ప్రాజెక్టు బిడ్లు ఆహ్వానించనుందని తెలిపారు. ప్రపంచం మరిన్ని ఎలక్ట్రోలైజర్లు, బ్యాటరీ స్టోరేజీ సదుపాయాలు ప్రవేశపెట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. తద్వారా ఈ పరిజ్ఞానాల్లో పొదుపును సాధించడంసహా అవి వాణిజ్యపరంగా గిట్టుబాటయ్యేలా చేయాలన్నారు. ఇలా చేయగలిగితేనే మనం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనంవైపు వాస్తవంగా మళ్లగలమని స్పష్టం చేశారు.

   ప్రసంగం ముగిసిన అనంతరం సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల ప్రతినిధులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. దీనికి  ‘యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌’ సీనియర్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ శ్రీ నోల్టీ థెరియట్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అమెరికా-భారత వ్యూహాత్మక పరిశుభ్ర ఇంధన భాగస్వామ్యంపై ఇటీవల చర్చలు ముగియడంతోపాటు గిగావాట్‌ అదనపు పునరుత్పాదక సామర్థ్యం జోడించే లక్ష్యం మైలురాయిని చేరిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు సుస్థిర ప్రగతికి, సాంకేతికాభివృద్ధికి, మౌలిక సదుపాయాల వృద్ధికి అమెరికా-భారత్‌ల మధ్య ఇంధన సహకారం ఏ మేరకు తోడ్పడగలదో ప్రైవేటు రంగానికి తెలిపేందుకు ఈ సంభాషణ వేదికగా ఉపయోగపడింది. అదే సమయంలో స్వల్ప కర్బన ఉద్గార మార్గాల సృష్టిని దృష్టిలో ఉంచుకుంటూ వ్యాపారాలకు, వ్యక్తులకు అవకాశాలు కల్పించే  పెట్టుబడుల సమీకరణకు ఎలా సహకరిస్తుందో కూడా అవగతం కావడానికి దోహదపడింది.

 ***



(Release ID: 1755680) Visitor Counter : 179


Read this release in: English , Urdu , Hindi , Punjabi