మంత్రిమండలి

భారీ టెలికాం సంస్కరణలకు ఓకె! కేంద్ర కేబినెట్ ఆమోదం


పెరగనున్న ఉద్యోగాలు, అభివృద్ధి, పోటీతత్వం..

వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు..

టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల లిక్విడిటీకీ పరిష్కారం

Posted On: 15 SEP 2021 4:24PM by PIB Hyderabad

   టెలికమ్యూనికేషన్ల రంగంలో తలపెట్టిన అనేక నిర్మాణపరమైన భారీ సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతలోని కేంద్రమంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ సంస్కరణలు,.. టెలికాం రంగాన్ని పరిరక్షించడంతోపాటు, మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తాయని, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతాయని భావిస్తున్నారు. సంస్కరణలు,.. నగదు అందుబాటు అవకాశాలను మెరుగుపరుస్తాయని, పెట్టుబడులను ప్రోత్సహించి, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లపై (టి.ఎస్.పి.లపై) నియంత్రణా పరమైన భారాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.

  కోవిడ్-19 వైరస్ మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొనడంలో టెలికాం రంగం చక్కని సామర్థ్యాన్ని, పనితీరును చూపిన నేపథ్యంలో, ఈ సంస్కరణా ప్యాకేజీ కారణంగా,.. బ్రాడ్ బాండ్ సదుపాయం, టెలికాం అనుసంధానం వంటివి మరింత వేగవంతంగా విస్తృతం కాగలవని భావిస్తున్నారు. డాటా వినియోగంపై భారీగా ఒత్తిడి పెరగడం ఆన్ లైన్ విద్య, వర్క్ ఫ్రమ్ హోమ్, సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తుల మధ్య అనుసంధానం పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ తాజా సంస్కరణలు టెలికం రంగానికి మరింత ఊపునిస్తాయని ఆశిస్తున్నారు.

   కాగా, బలమైన, దృఢమైన టెలికాం రంగం ఏర్పాటు కావాలన్న ప్రధానమంత్రి దార్శనికతను కేంద్రమంత్రివర్గ నిర్ణయంతో మరింత బలోపేతమైంది. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా పోటీతత్వం పెంచడం, వినియోగదారుకు ఎంపిక సదుపాయం, అంత్యోదయ పథకం, గుర్తింపునకు నోచుకోని అంశాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం, ఇప్పటివరకూ బ్రాడ్ బాండ్ సదుపాయంలేని చోట్లకు ఇంటర్నెట్ అనుసంధానంతో సార్వత్రిక బ్రాడ్ బాండ్ అనుసంధానం కల్పించడం తాజా సంస్కరణల ప్యాకేజీ ధ్యేయంగా పెట్టుకున్నారు.  4-జి విస్తృతిని, నగదు అందుబాటులో ఉంచే అవకాశాలు పెంచడం, 5-జి నెట్వర్క్.లో పెట్టుబడుల ప్రోత్సాహానికి తగిన వాతావరణాన్ని కల్పించడం కూడా తాజా సంస్కరణల లక్ష్యం.

 

  ఈ సంస్కరణల ప్యాకేజీలో భాగంగా చేపట్టదలచిన తొమ్మిది నిర్మాణ పరమైన సంస్కరణలను, ఐదు విధానపరమైన సంస్కరణలను, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకోసం ఉపశమన చర్యలను ఈ దిగువన చూడవచ్చు:

నిర్మాణపరమైన సంస్కరణలు

  1. స్థూల సర్దుబాటు రెవెన్యూ (ఎ.జి.ఆర్.) హేతుబద్ధీకరణ: టెలికాం రంగంతో సంబంధం లేని రెవెన్యూను స్థూల సర్దుబాటు రెవెన్యూ నిర్వచనం నుంచి మినహాయిస్తారు.
  2. బ్యాంకు గ్యారంటీల (బి.జి.ల) హేతుబద్ధీకరణ: లైసెన్స్ రుసుం, ఇతర లెవీ ఫీజులకు సంబంధించిన, బ్యాంకు గ్యారంటీల ఆవశ్యకత భారీగా (80శాతం వరకూ) తగ్గుతుంది. విభిన్నమైన లైసెన్స్ అంశాల విషయంలో పలు రకాలైన బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.
  3. వడ్డీ రేట్ల హేతుబద్ధీకరణ/జరిమానాల తొలగింపు: లైసెన్స్ రుసుం/స్పెక్ర్టమ్ వినియోగ చార్జీని (ఎస్.యు.సి.ని) ఆలస్యంగా చెల్లించినప్పటికీ భారతీయ స్టేట్ బ్యాంకు పరపతిపై కనీస వడ్డీ రేటును 4శాతం బదులుగా 2శాతం మాత్రమే వసూలు చేస్తారు. 2021 అక్టోబరు 1నుంచి ఇది అమలులోకి వస్తుంది; ప్రతి నెలకు బదులుగా ఏడాదికి ఒకసారి వడ్డీని లెక్కగడతారు; పెనాల్టీని లేదా పెనాల్టీపై విధించే వడ్డీని కూడా తొలగించారు.
  4. ఇకపై జరిగే వేలం పాటలకు సంబంధించి, కిస్తీ చెల్లింపులకోసం బ్యాంకు గ్యారంటీలు అవసరం లేదు. పరిశ్రమ ఎదిగిన నేపథ్యంలో గత కాలపు వ్యవస్థలో భాగమైన బ్యాంకు గ్యారంటీలు ఇకపై ఏమాత్రం అవసరం లేదు.
  5. స్పెక్ట్రమ్ గడువు: భవిష్యత్తులో జరగబోయే వేలం ప్రక్రియలకు సంబంధించి, స్పెక్ట్రమ్ గడువును 20ఏళ్లనుంచి 30ఏళ్లకు పెంచారు.
  6. భవిష్యత్తు వేలం ప్రక్రియలకు సంబంధించిన స్పెక్ట్రమ్.ల విషయంలో,  పదేళ్ల తర్వాత కూడా స్పెక్ట్రమ్.ను సరెండర్ చేయడానికి వెసులుబాటు కల్పించారు. 
  7. భవిష్యత్తులో వేలం పాటలకోసం సేకరించుకున్న స్పెక్ట్రమ్.కు సంబంధించి  వినియోగ చార్జీ (ఎస్.యు.సి.) లేదు.
  8. స్పెక్ట్రమ్ పంచుకునే విధానానికి ప్రోత్సాహం-స్పెక్ట్రమ్ ను పెంచుకునేందుకు ఇదివరకు అదనంగా విధిస్తూ వస్తున్న 0.5శాతం ఎస్.యు.సి.ని తొలగించారు.
  9. పెట్టుబడుల ప్రోత్సాహానికి చర్యలు.- ఇందుకోసం టెలికాం రంగంలో ఆటోమేటిక్ మార్గం ద్వారా వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి (ఎఫ్.డి.ఐ.కి) అనుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల రక్షణలనూ వర్తింపజేస్తారు.

 

విధానపరమైన సంస్కరణలు

వేలం పాటల తేదీలను సూచిస్తూ ఆక్షన్ క్యాలెండర్ ఏర్పాటు -  స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియలు సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నిర్వహిస్తారు.

  1. సులభతర వాణిజ్య నిర్వహణకు ప్రోత్సాహం- వైర్.లెస్ పరికర సామగ్రికి సంబంధించి 1953వ సంవత్సరపు కస్టమ్స్ నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం వసూలు చేసే లైసెన్సుల ఫీజులను తొలగించారు. ఎవరికి వారు స్వీయ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది.
  2. మీ ఖాతాదారును తెలుసుకోండి (కె.వై.సి.) నిర్ధారణపై సంస్కరణలు:  యాప్ ఆధారిత స్వీయ కె.వై.సి.ని అనుమతి.  ఇ-కె.వై.సి. రేటును కేవలం ఒక రూపాయికి సవరించారు.  ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్.కు లేదా పోస్ట్ పెయిడ్.నుంచి ప్రీపెయిడ్.కు మారాలన్నా మళ్లీ తాజాగా కె.వై.సి.ని నిర్ధారించాల్సిన అవసరం లేదు.
  3. పేపర్ కస్టమర్ అక్విజిషన్ ఫారాల (సి.ఎ.ఎఫ్.) స్థానంలో డిజిటల్ స్టోరేజీ డాటాను ప్రవేశపెడతారు. వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన గిడ్డంగుల్లో పేరుకుపోయి ఉన్న 300-400 కోట్లమేర సి.ఎ.ఎఫ్.లు ఇకపై ఏ మాత్రం అవసరం లేదు. ఇక గిడ్డంగుల్లోని సి.ఎ.ఎఫ్.లపై ఆడిట్ చేపట్టాల్సిన పనికూడా లేదు.
  4. టెలికాం టవర్ల ఏర్పాటుకోసం రేడియో ఫ్రీక్వెన్సీ కేటాయింపు స్థాయీ సలహా సంఘం నుంచి ఆమోదం తెలిపే ప్రక్రియను మరింత సడలించారు. పోర్టల్.పై డాటాను టెలికాం శాఖ స్వీయ డిక్లరేషన్ ఆధారంగా అనుమతిస్తుంది. పౌర విమానయాన శాఖ వంటి ఇతర ఏజెన్సీల ఆన్ లైన్ పోర్టల్స్.ను ఇకపై కేంద్ర టెలికాం శాఖ పోర్టల్ తో అనుసంధానం చేస్తారు.

 

టెలికాం ప్రొవైడర్ల నగదు మార్పిడి వసతి సమస్యకు పరిష్కారాలు

టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించిన ఈ దిగువ అంశాలన్నింటినీ కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది:

  1. ఎ.జి.ఆర్. నిర్ధారణ కారణంగా తలెత్తిన బకాయిల వార్షిక చెల్లింపులపై మారటోరియం విధించడమో, లేదా వాయిదా సదుపాయం కల్పించడమో చేస్తారు. అయితే,.. సదరు బకాయి మొత్తాల ప్రస్తుత నిఖర విలువకు రక్షణ కల్పిస్తూ ఈ సదుపాయం అమలు చేస్తారు.
  2. గత కాలపు వేలం ప్రక్రియల్లో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్.కు సంబంధించి బకాయిల విషయంలో చెల్లింపుపై ఐదేళ్ల వరకూ మారటోరియం విదించడమో, వాయిదా సదుపాయం కల్పించడమో చేస్తారు. (ఈ విషయంలో 2021వ సంవత్సరపు ఆక్షన్.ను మినహాయిస్తారు). అయితే, ఆయా వేలం ప్రక్రియల్లో నిర్దేశించిన వడ్డీ రేటు ప్రకారం సదరు బకాయిల మొత్తాల ప్రస్తుత నిఖర విలువకు రక్షణ కల్పిస్తారు.
  3. బకాయిల వాయిదా కారణంగా తలెత్తిన వడ్డీని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఈక్విటీ మార్గంలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది.
  4. వాయిదాకు, మారటోరియం సదుపాయానికి అనుమతించిన బకాయి మొత్తాన్ని మారటోరియం వ్యవధి చివర్లో ఈక్విటీ రూపంలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను రాబోయే రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖరారు చేస్తుంది.

   పైన పేర్కొన్న సంస్కరణలు అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు (టి.పి.ఎస్.లకు) వర్తిస్తాయి. లిక్విడిటీ, నగదు అందుబాటుపై సర్వీస్ ప్రొవైడర్లకు ఉపశమనం లభిస్తుంది. ఈ ఏర్పాట్లు టెలికాం రంగంతో సంబంధం ఉన్న వివిధ రకాల బ్యాంకులకు ఉపయోగపడతాయి.

 

***



(Release ID: 1755255) Visitor Counter : 349