బొగ్గు మంత్రిత్వ శాఖ
హరితాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కోల్ ఇండియా
Posted On:
13 SEP 2021 3:54PM by PIB Hyderabad
బొగ్గు తవ్వకాల వల్ల భూసారం తగ్గకుండా , భూ ఉపరితల భాగం దెబ్బతినకుండా చూసే విధంగా బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్ ) తన నూతన బొగ్గు గనుల్లో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తవ్వకాల వల్ల సాధారణంగా భూసారం తగ్గి పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటుందన్న వాదన ఉంది. అయితే, కోల్ ఇండియా అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల బొగ్గు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో భూసారం తగ్గడం లేదు. పర్యావరణ సమతుల్యానికి భంగం కలగడం లేదు. తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతాలను తిరిగి వాటి పూర్వపు స్థితి లోనికి తీసుకుని రావడానికి, పచ్చదనాన్ని పెంచడానికి కోల్ ఇండియా పథకాలను అమలు చేస్తున్నది. పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షించడానికి ఓపెన్‌కాస్ట్ విధానంలో తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని మూసి వేసి దానిపై పెద్ద ఎత్తున మొక్కలను నాటడానికి వీలుగా కోల్ ఇండియా లిమిటెడ్ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది.
కోల్ ఇండియా లిమిటెడ్ నిర్వహిస్తున్న అనేక గ్రీన్ ఫీల్డ్ బొగ్గు గనుల్లో మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లాలోని జయంత్ ఓపెన్‌కాస్ట్ కోల్ ప్రాజెక్ట్ అతి పెద్డది. బొగ్గు తవ్వకాలను సాగిస్తున్న ఈ ప్రాజెక్టు భూమి పునరుద్ధరణ, పచ్చదనం కార్యక్రమాలకు రోజువారీ ప్రాతిపదికన ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్నది. దీనివల్ల కాలుష్యం తో పాటు కార్బన్ ఉద్గారాల విడుదల సమస్య గణనీయంగా తగ్గింది. ఈ ప్రాజెక్టును కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) అమలు చేస్తున్నది.
ఉపరితలంపై జీవ పునరుద్ధరణ
జయంత్ ప్రాజెక్టు కు పర్యావరణ అటవీ అనుమతులు ఇవ్వడానికి న్యూఢిల్లీలోని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి (బొగ్గు) వివరణాత్మక సమీక్షను నిర్వహించారు. దీనికోసం ఎన్‌సిఎల్ నివేదికను సమర్పించింది. ఉపగ్రహం ద్వారా సేకరించిన సమాచారాన్ని దీనిలో పొందుపరిచారు. తవ్వకాలను చేపట్టిన తరువాత అటవీ విస్తీర్ణం తవ్వకాలను చేపట్టక ముందు దాని కంటే ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.పర్యావరణ పరిరక్షణలో కోల్ ఇండియా సాధించిన విజయాల్లో ఇది అత్యుత్తమ విజయంగా గుర్తింపు పొందింది.
జయంత్ ప్రాజెక్ట్ ఉపగ్రహ చిత్రాలు (2020)
జయంత్ కోల్ ప్రాజెక్ట్ సుమారు 3200 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు అయ్యింది. ఏడాదికి ఇక్కడ 25 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి సౌకర్యాలను కల్పించారు. ప్రాజెక్ట్‌లో 1975-76 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అయ్యింది. బొగ్గు ఉత్పత్తిలో 1977-78 నుంచి భారీ సామర్థ్యం కలిగిన డ్రాగ్‌లైన్, షోయెల్ , డంపర్స్ లాంటి భారీ యంత్ర పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గును ఉత్తర ప్రదేశ్ లోని శక్తినగర్ సమీపంలో 2000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని గల ఎన్టీపీసీ సింగ్రౌలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కు మెర్రీ-గో-రౌండ్ వ్యవస్థ ద్వారా రవాణా చేస్తున్నారు.
పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలు మధ్యప్రదేశ్ రాజ్య వాన్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సహకారం అమలు జరుగుతున్నాయి. పునరుద్ధరించిన భూ భాగాలు, వ్యర్ధాలను నిల్వ చేసే ప్రాంతాలు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం భారీ తోటల పెంపకం జరుగుతోంది. జామ, జంగిల్ జిలేబి, నువ్వులు, సిరస్, విప్ప , సుబాబుల్, బిల్వ , ఉసిరి , కొల పొన్న, కాంచనము , కానుగ , వేప, కోడిసిపాల , వెదురు, బౌగెన్విల్లే, కసివింద , గుల్మోహర్, ఖామర్, తుమ్మ మొదలైన వాటిని పెంచుతున్నారు.
మొక్కల పెంపకం
2020 సంవత్సరానికి సంబంధించిన ఉపగ్రహం ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా తవ్వకాలను చేపట్టక ముందు ఉన్న అటవీ విస్తీర్ణం సుమారు 1180 హెక్టార్లుగా ఉండగా తాజా భూ సేకరణ నివేదిక ప్రకారం 1419 హెక్టార్లకు పెరిగింది. ఇది మొత్తం తవ్వకాలు సాగుతున్న ప్రాంతంలో దాదాపు 45% వరకు ఉంది. గనిని మూసివేసిన తర్వాత 2600 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇది మైనింగ్ ముందు దశ కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది.
గని మూసివేత ప్రణాళికను అన్ని కొత్త బొగ్గు ప్రాజెక్టులలో చేరుస్తున్నారు. మైనింగ్ కార్యకలాపాలు పూర్తయిన తర్వాత భూమిని దాని అసలు స్థితికి పునరుద్ధరించడానికి మార్గదర్శక కారకంగా మారుతుంది. పునరుద్ధరణ చర్యలు తవ్వకాలు ప్రారంభం అయిన వెంటనే ప్రారంభమవుతాయి,
***
(Release ID: 1754654)
Visitor Counter : 175