గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ సాధనకు పట్టణాలు ఉత్పాదక కేంద్రాలుగా మారాలి : శ్రీ హర్దీప్ పూరి
గత ఆరు సంవత్సరాలలో (2015-2021) పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై చేసిన ఖర్చు ఎనిమిది రెట్లు పెరిగింది
ప్రజా కార్యక్రమంగా స్వచ్ఛ భారత్ మిషన్.. 1.41 లక్షల కోట్లతో స్వచ్ఛ భారత్ మిషన్ 2.0
Posted On:
13 SEP 2021 2:56PM by PIB Hyderabad
పట్టణ ప్రాంతాలలో ఉత్పాదకత పెరిగినప్పుడు మాత్రమే ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని కేంద్ర గృహాలు మరియు పట్టణ వ్యవహారాలు మరియు పెట్రోలియం సహజ వాయువుల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. 'కనెక్ట్ కరో 2021 - టూ వర్డ్స్ ఈక్విటబుల్, సస్టైనబుల్ ఇండియన్ సిటీస్' అనే అంశంపై ఏర్పాటైన సదస్సును మంత్రి ఈ రోజు ఇక్కడ ప్రారంభించారు. ప్రపంచ వనరుల సంస్థ అయిదు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయిదు రోజుల పాటు(13-17 సెప్టెంబర్) ఈ సదస్సును నిర్వహించనున్నది. సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దేశాభివృద్ధిలో పట్టణ ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయన్న ధీమాను వక్షతాం చేశారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు.
2030 నాటికి జాతీయ జిడిపిలో దాదాపు 70% నగరాల నుంచి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాలు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టనీకరణ వేగంగా సాగుతున్నదని అన్నారు. ప్రపంచంలో ఉత్తమ నగరాలుగా గుర్తింపు పొందిన ప్రాంతాలు జాతీయ జిడిపిలో కీలకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారత నగరాలతో పోల్చి చూస్తే వాటి వాటా ఐదు రెట్లు అధికంగా ఉందని మంత్రి వివరించారు. భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న ప్రధాన మంత్రి పిలుపును సాకారం చేయడానికి దేశంలో నగర పట్టణ ప్రాంతాలు ఆర్థిక రంగంలో ఇదే స్థాయిలో అభివృద్ధి సాధించవలసి ఉంటుందని అన్నారు.
పట్టణ ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా మార్చడానికి చర్యలను అమలు చేయడంతో పాటు ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి ప్రత్యేక చర్యలను అమలు చేయవలసి ఉంటుందని శ్రీ పూరీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనించడం, ఈ ప్రాంతాలకు వలసలు ఎక్కువ కావడంతో మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. 2030 నాటికి దేశంలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 630 మిలియన్లకు చేరే అవకాశం ఉందని అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రాంతాల్లో నివసించేవారికి అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేసే అంశాన్ని అత్యధిక ప్రాధాన్యత ఇవ్వక తప్పదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో పట్టణ ప్రాంతాలపై కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా పడిన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్యక్రమాలను రూపొందించాలని ఆయన అన్నారు.
పట్టణీకరణ వల్ల అనుకూల ప్రభావాలతో ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలకు రూపకల్పన చేయవలసి ఉంటుందని మంత్రి అన్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధిని కేవలం ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా పర్యావరణ వరంగా చూడాలని ఆయన అన్నారు. ఆర్ధిక, పర్యావరణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి సాధనకు ప్రణాళికలను రూపొందించాలని ఆయన సూచించారు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా పట్టణాలను రూపొందించాలని ఆయన అన్నారు. పట్టణీకరణ వల్ల పర్యావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని హెచ్చరిస్తూ ఇటీవల ఐపీసీసీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం పట్టణ ప్రాంతాల ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాదని మంత్రి వివరించారు.
గత ఆరు సంవత్సరాలుగా (2015-2021) పట్టణ అభివృద్ధిపై చేస్తున్న వ్యయం ఎనిమిది రెట్లు పెరిగిందని మంత్రి చెప్పారు, ఈ వ్యయం 2004 నుంచి 2014 వరకు 1.57 లక్షల కోట్ల రూపాయల వరకు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ మొత్తం 11.83 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నదని వివరించారు. వాతావరణ మార్పు మరియు వారసత్వ పరిరక్షణ వంటి ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం పథకాలను రూపొందించి మేలు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దాదాపు 1.13 కోట్ల ఇళ్లను మంజూరు చేశామని చెప్పిన మంత్రి ఇప్పటికే 50 లక్షలకు పైగా గృహ యూనిట్లను లబ్ధిదారులకు అందించి విజయం సాధించామని అన్నారు. 2022 లక్ష్యాలను సాధించడానికి ఇంధన పొదుపు, మన్నిక లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమర్థవంతమైన పద్ధతులను గృహ నిర్మాణంలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రాథమిక సామాజిక మౌలిక సదుపాయాలను కల్పించడానికి అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్ మిషన్) అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ పథకం కింద 3,700 ఎకరాలకు పైగా భూమిలో 1831 పార్కులను అభివృద్ధి చేశామని, 85 లక్షల వీధి దీపాలను మార్చి 185.33 కోట్ల యూనిట్ల (kWh) శక్తి ని ఆదా చేశామని అన్నారు.
ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, పర్యావరణ సమతుల్యత అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సుస్థిర అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి వివరించారు. పట్టణ ప్రాంతాల్లో సౌకర్యాలను అభివృద్ధి చేయడం వల్ల పట్టణ పర్యావరణ వ్యవస్థలతో పాటు పేదరికం, విద్య, ఆరోగ్యం, పారిశుధ్య రంగాలపై సానుకూల ప్రభావం కనిపిస్తుందని పేర్కొన్నారు.
సుస్థిరమైన జీవన విధానాల రూపకల్పనకు ప్రభుత్వం దీర్ఘకాలిక విధానాలకు రూపకల్పన చేసిందని శ్రీ హర్దీప్ పూరి అన్నారు. దీనిలో భాగంగా క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా వాతావరణ మార్పుల విధానాన్నిఅమలు చేసి నగరాలు పునరుత్పాదక శక్తిపై ఆధారపడటాన్ని తగ్గించామని అన్నారు.
రవాణా రంగానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని మంత్రి తెలిపారు. అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ స్కీమ్ కింద 20 వేల బస్సులకు ఆర్ధిక సహకారం అందించడానికి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అమలు చేసి సర్వీసులు పెంచుతామని అన్నారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మరియు నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ విధానాలను ప్రోత్సహిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం 18 నగరాల్లో 721 కిలోమీటర్ల మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయని, 27 నగరాల్లో 1,058 కిమీ మెట్రో నెట్‌వర్క్ నిర్మాణంలో ఉందని అన్నారు. వీటివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గి గాలి నాణ్యత పెరిగి ఉద్గారాలు తగ్గుతాయని వివరించారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు సరఫరా చేయడానికి ప్రభుత్వం 2.8 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో జల్ జీవన్ మిషన్ (అర్బన్) ను ప్రారంభిస్తుందని మంత్రి వెల్లడించారు. దేశంలోని మొత్తం 4,378 పట్టణ స్థానిక సంస్థలలో అందరికి నీరు సరఫరా చేసి 500 నగరాల్లో ద్రవ వ్యర్థాల నిర్వహణను ప్రారంభించడానికి అమృత్ పథకంలో భాగంగా దీనిని అమలు చేస్తామని అన్నారు.
ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 ని కూడా ప్రారంభిస్తుందని వెల్లడించిన మంత్రి 1.41 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో బురద నిర్వహణ, వ్యర్ధ నీటి శుద్ధి, చెత్తను వేరు చేయడం మరియు ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ల తగ్గింపు మరియు నిర్మాణం మరియు కూల్చివేతలో వ్యర్థాల నిర్వహణ ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించడం మరియు బయో-రెమిడియేషన్ డంప్ సైట్‌లపై దృష్టి పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమాల ద్వారా సమగ్ర పట్టణాభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు. సమాచారం మరియు సాంకేతికత ఆధారంగా ఈ కార్యక్రమాలు అమలు జరుగుతున్న నేపథ్యంలో 'ఈక్విటబుల్, సస్టైనబుల్ అర్బనైజేషన్' అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సు పట్టణ అభివృద్ధికి నూతన ఆలోచనలను అందిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
(Release ID: 1754564)
Visitor Counter : 185