వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఎగుమతిదారులకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహం

వివిధ ఎగుమతి ప్రోత్సాహక పథకాల కింద త్వరలో రూ.56,027 కోట్లు విడుదల

45వేల మందికిపైగా ఎగుమతిదారులకు ప్రయోజనాల పంపిణీ వీరిలో 98 శాతం ‘ఎంఎస్ఎంఈ’ విభాగంలోని చిన్న ఎగుమతిదారులే

ఎగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఉపశమనం

ఇప్పటికే ‘ఆర్ఓడీటీఈపీ’ కింద రూ.12454 కోట్లు; ‘ఆర్ఓఎస్సీటీఎల్’ కింద రూ.6,946 కోట్ల మేర ప్రకటించిన సుంకం మినహాయింపులకు ఇది అదనం

ఈ ప్రయోజనాలతో అంతర్జాతీయ విపణిలో నగదు ప్రవాహం ఎగుమతి గిరాకీ నిర్వహణ దిశగా ఆయా రంగాలకు తోడ్పాటు

ఈ మద్దతుతో బహుముఖ ప్రభావం సహా ఉపాధి సృష్టికి ఊపు

ఇటీవలి నెలల్లో ఎగుమతుల వృద్ధి బలోపేతమైన నేపథ్యంలో తాజా నిర్ణయంతో ఎగుమతుల వృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశం

Posted On: 09 SEP 2021 5:34PM by PIB Hyderabad

గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వాన ఎగుమతిదారుల ప్రోత్సాహకాల బకాయిల పంపిణీ నిమిత్తం రూ.56,027 కోట్ల బడ్జెట్‌ను ప్రస్తుత 21-22 ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మునుపటి విధానాల పరిధిలోగల ఎంఈఐఎస్, ఎస్ఈఐఎస్, ఆర్ఓఎస్ఎల్, ఆర్ఓఎస్సీటీఎల్సహా ఇతర స్క్రిప్ ఆధారిత పథకాలకు సంబంధించినవే కాకుండా 20-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆర్ఓడీటీఈపీ, ఆర్ఓఎస్సీటీఎల్ కింద చేసిన ఎగుమతుల సంబంధిత రాయితీ అభ్యర్థనల మొత్తాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయంవల్ల 45వేల మందికిపైగా ఎగుమతిదారులకు ప్రయోజనాల పంపిణీ కానుండగా.. వీరిలో 98 శాతం ఎంఎస్ఎంఈ విభాగంలోని చిన్న ఎగుమతిదారులే కావడం గమనార్హం.

   వివిధ ఎగుమతి ప్రోత్సాహక, రాయితీ పథకాల కింద ఎగుమతిదారులకు బకాయిపడిన రూ.56,027 కోట్లలో ఎంఈఐఎస్ (రూ.33,010 కోట్లు), ఎస్ఈఐఎస్ (రూ.10,002 కోట్లు), ఆర్ఓఎస్సీటీఎల్ (రూ.5,286 కోట్లు), ఆర్ఓఎస్ఎల్ (రూ.330 కోట్లు), ఆర్ఓడీటీఈపీ (రూ.2,568 కోట్లు), టార్గెట్ ప్లస్ వగైరా వారసత్వ పథకాల కింద (రూ.4,831 కోట్లు) వివిధ మొత్తాలు భాగంగా ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఓడీటీఈపీ కింద రూ.12454 కోట్లు; ఆర్ఓఎస్సీటీఎల్ కింద రూ.6,946 కోట్ల వంతున ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులపై ప్రకటించిన సుంకం మినహాయింపులకు అదనంగా ప్రస్తుత మొత్తాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి నెలల్లో భారత ఎగుమతులు వేగంగా వృద్ధిచెందాయి. ఈ మేరకు 2021 ఏప్రిల్-ఆగస్టు నెలల మధ్య సరుకుల ఎగుమతులు 164 బిలియన్ డాలర్లు కాగా, 2020-21తో పోలిస్తే 67 శాతం, 2019-20తో పోలిస్తే 23 శాతం అధికంగా నమోదవడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రోత్సాహక బకాయిలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాలన్న నిర్ణయంతో రాబోయే నెలల్లో ఎగుమతుల వృద్ధి మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

   రుకుల ఎగుమతులకు సంబంధించి ఎంఈఐఎస్ పరిధిలోకి వచ్చే ఔషధ, ఇనుము-ఉక్కు, ఇంజనీరింగ్, రసాయనాలు, మత్స్య, వ్యవసాయం, అనుబంధ, ఆటో, ఆటో విడిభాగాలు వంటి అన్ని రంగాల్లో మునుపటి సంవత్సరాల్లో చేసిన ఎగుమతులకూ ప్రయోజనాల కోసం అభ్యర్థనలు దాఖలు చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వేగంగా కోలుకుంటున్న అంతర్జాతీయ విపణిలో ఎగుమతుల గిరాకీతోపాటు నగదు ప్రవాహాల నిర్వహణకు ఈ ప్రయోజనాలు ఇతోధికంగా తోడ్పడతాయి. ఇక ప్రయాణ, పర్యాటక, ఆతిథ్య రంగాలుసహా సేవారంగంలోని ఎగుమతిదారులు కూడా 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఎస్ఈఐఎస్ కింద కేటాయించిన రూ.2,061 కోట్ల మేర ప్రయోజనాల కోసం అభ్యర్థనలు దాఖలు చేయవచ్చు. మరోవైపు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్ఈఐఎస్కు సంబంధించి కొన్ని సేవారంగ విభాగాలలో కొన్ని సవరణలతో త్వరలో ప్రకటన వెలువడనుంది. ఈ విధంగా మద్దతు లభిస్తుండటంవల్ల బహుముఖ ప్రభావంసహా ఉపాధి సృష్టికి ఉత్తేజం లభిస్తుంది.

   దేశంలో అత్యధిక కార్మికశక్తి ఆధారిత ప్రధానమైన దుస్తుల రంగానికి కూడా ఆర్ఓఎస్సీటీఎల్, ఆర్ఓఎస్ఎల్ కింద మునుపటి బకాయిలు చెల్లించబడతాయి. అంతేగాక పండుగల సీజన్ సందర్భంగా అంతర్జాతీయ విపణులలో గిరాకీని తట్టుకునే విధంగా అంతర అనుసంధానిత సరఫరా వ్యవస్థలోని భాగస్వామ్య సంస్థలు బలోపేతం చేయబడతాయి. ఈ నేపథ్యంలో మునుపటి సంవత్సరాల ఎగుమతి ప్రోత్సాహకాల కోసం ఎగుమతిదారులు 2021 డిసెంబరు 31లోగా అభ్యర్థనలు దాఖలు చేసుకోవాలి. ఈ గడువు దాటితే అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోబడవు. ఎంఈఐఎస్, ఇతర స్క్రిప్ ఆధారిత దరఖాస్తుల స్వీకరణ కోసం ఆన్‌లైన్‌ ఐటీ పోర్టల్ త్వరలోనే సిద్ధమవుతుంది. అంతేకాకుండా బడ్జెట్ ఆధారిత చట్రం కింద ఎగుమతి ప్రోత్సాహకాలకు నిధుల కేటాయింపు, పంపిణీని పర్యవేక్షించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన బలమైన వ్యవస్థతో ఈ పోర్టల్ సమీకృతం చేయబడుతుంది. మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ పరంగా ఇతరత్రా బాధ్యతలు ఉన్నప్పటికీ ఎగుమతి ప్రోత్సాహకాల బకాయిలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాల్లో కీలకమైన ఎగుమతి రంగానికి సకాలంలో, ఆవశ్యక మద్దతునివ్వాలన్నదే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం.

***



(Release ID: 1754008) Visitor Counter : 211