సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎం.ఎస్.ఎం.ఇ.ల ప్రగతే లక్ష్యంగా 3 దేశాల మధ్య సహకారం


సామర్థ్యాల నిర్మాణంలో శిక్షణ, ఉత్తమ విధానాల, సాంకేతిక
పరిజ్ఞానాల మార్పిడితో తగిన మద్దతు అవసరం..
ఐ.బి.ఎస్.ఇ. వేదిక సమ్మేళనంలో
ఎం.ఎస్.ఎం.ఇ. కార్యదర్శి సూచన..
భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల మెరుగైన సహకారానికి
సమైక్య కృషి అవసరమన్న ఐ.బి.ఎస్.ఎ. సదస్సు..

Posted On: 08 SEP 2021 11:21AM by PIB Hyderabad

    సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల బలాలు, అవకాశాలు, అవి ఎదుర్కొనే సవాళ్ల గురించి అవగాహన కల్పించడం వంటి అంశాల్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా (ఐ.బి.ఎస్.ఎ.) వేదిక కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎం.ఎస్.ఎం.ఇ.ల) వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి బి.బి. స్వైన్ చెప్పారు. ఈ సంస్థల తుది ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాల కల్పన, సామర్థ్యాల నిర్మాణం శిక్షణ, ఉత్తమ విధానాల, సాంకేతిక పరిజ్ఞానాల పరస్పర మార్పిడి ద్వారా తగిన మద్దతు తదితర అంశాల్లో ఐ.బి.ఎస్.ఎ. వేదిక ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. ఎం.ఎస్.ఎం.ఇ.ల సమస్యలపై ఐ.బి.ఎస్.ఎ. వేదిక ఆధ్వర్యంలో జరిగిన 6వ వర్చువల్ సమ్మేళనంలో స్వైన్ మాట్లాడుతూ, సామర్థ్యాల నిర్మాణంలో శిక్షణ, ఉత్తమ విధానాలను, సాంకేతిక పరిజ్ఞానాలను ఇచ్చిపుచ్చుకోవడం, వాణిజ్యపరమైన అడ్డంకులను గురించి అవగాహన చేసుకోవడం, మూడు సభ్య దేశాల మధ్య మెరుగైన సహకారం, ఉమ్మడి కృషితో పెట్టుబడుల వెసులుబాటు కల్పించడం వంటి చర్యల ద్వారా ఎం.ఎస్.ఎం.ఇ.లకు తగిన మద్దతు అందించే లక్ష్యంతో  ఈ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నట్టు చెప్పారు.

   ఐ.బి.ఎస్.ఎ. వేదిక అనేది వినూత్నమైన సంస్థ. ప్రపంచంలోని 3 విభిన్న ఖండాలకు చెందిన పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రధాన ఆర్థిక శక్తులుగా ఎదుగుతూ, ఒకే రకం సవాళ్లను ఎదుర్కొంటున్న భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలను ఒక్కతాటిపైకి తెస్తూ ఈ ఐ.బి.ఎస్.ఎ. వేదిక రూపుదాల్చింది.

  కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ ఆతిథ్యంలో గత వారం ఈ సమ్మేళనం జరిగింది. భారతదేశానికి చెందిన జాతీయ చిన్న తరహా పరిశ్రమల సంస్థ (ఎన్.ఎస్.ఐ.సి.), బ్రెజిల్ కు చెందిన సూక్ష్మ, చిన్న తరహా వాణిజ్య సేవా సంస్థ (ఎస్.ఇ.బి.ఆర్.ఎ.ఇ.), దక్షిణాఫ్రికాకు చెందిన చిన్న తరహా వాణిజ్య అభివృద్ధి సంస్థ (డి.ఎస్.బి.డి.), చిన్నతరహా సంస్థల అభివృద్ధి సంస్థ (ఎస్.ఇ.డి.ఎ.)ల తో కలసి ఉమ్మడిగా ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు.

 

https://ci6.googleusercontent.com/proxy/tBdAutF0XOCEJ90bI4FIfszFJ6rGsv8zMxZReUPUNtIC2tmDzN7gamgXAhce5zPGHzaCapQQ2UPTVyYTOHYqx1rtxrlnjQUMFMfURQuBYD6hpB9A-MCLqCI7Kg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001D4XF.jpg
 

ఈ సమ్మేళనంలో ఎన్.ఎస్.ఐ.సి. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయేంద్ర మాట్లాడుతూ.., ప్రజాసమూహం కోసం, ప్రగతికోసమే ప్రజాస్వామ్యం“ అన్నదే 6వ ఐ.బి.ఎస్.ఎ. సమ్మేళనం ప్రధాన ఇతివృత్తమని అన్నారు. సమ్మేళనంలో చర్చించాల్సిన వివిధ రకాల అంశాలు, నిర్వహించాల్సిన సాంకేతిక సదస్సుల గురించి ఆయన క్లుప్తంగా వివరించారు. ఐ.బి.ఎస్.ఎ. కూటమిలోని సభ్యదేశాలు పరస్పరం తమ అనుభవాలనుంచి, ఉత్తమ విధానాలనుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని ఆయన అన్నారు. నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞాన మద్దతు, ఆర్థిక సదుపాయాలతో అనుసంధానం, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో, ఐ.బి.ఎస్.ఎ. తాము తీసుకున్న చర్యలు తదితర అంశాలను సభ్యదేశాలు పరస్పరం మార్పిడి చేసుకోవలసిన అవసరం ఉందన్నారు.

   బ్రెజిల్.కు చెందిన సూక్ష్మ, చిన్న తరహా వాణిజ్య సేవల సంస్థ పరిపాలన, ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్ ఎడ్వర్డో డియాగో మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి సంక్షోభంతో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ఇప్పటికీ ఉపాధిని కల్పించగలిగే స్థితిలో ఉన్నాయని, వాటి సుస్థిర అభివృద్ధికోసం ఐ.బి.ఎస్.ఎ. మరెంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు.

 

https://ci5.googleusercontent.com/proxy/2gXCR_Nm6PARzliYbTXx1nID1Bk-p9EpT34n4bW3wI9WyHULn9DPh2YxlNy0kcOb-4qZmjD-heUXRzQWfkL7V5RX2ojmbeHCGPkPIQR99OjyRwX45rwYMOYZ7A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GIRG.jpg

  దక్షిణాఫ్రికాకు చెందిన చిన్న తరహా వాణిజ్య అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ లిండోకుహెల్ ఎంకుమానే మాట్లాడుతూ,.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎం.ఎస్.ఎం.ఇ.లను) ప్రోత్సహించడం ద్వారా పేదరికం, అసమానత, నిరుద్యోగం వంటి సమస్యలను నిర్మూలించవచ్చని అన్నారు. ఈ విషయంలో యువతకు, మహిళలకు సమ్మిళితంగా నైపుణ్యాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

  ఎం.ఎస్.ఎం.ఇ. వ్యవహారాల కేంద్ర మంత్రిత్వ శాఖలోని చిన్న, మధ్యతరహా సంస్థల విభాగం సంయుక్త కార్యదర్శి మెర్సీ ఎపావో మాట్లాడుతూ, భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఎం.ఎస్.ఎం.ఇ. రంగానికి ఎంతో కీలకపాత్ర ఉందన్నారు. ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న అనేక చర్యలు దేశంలోని ఎం.ఎస్.ఎం.ఇ.ల ప్రగతికి దోహదపడుతున్నాయని మెర్సీ అన్నారు. ఎం.ఎస్.ఎం.ఇ.లపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం గురించి కూడా ఆమె ప్రసంగించారు.

 

 

https://ci4.googleusercontent.com/proxy/_qOklQpqTezfBF4qH6yhgQNW8wW65NKQ73fJpRmF3sd-FQnsduRJyT4swbFnVcfL_xfox4DYghiSn7ERApcONmFeTau2moo_5K8TF_Nl8TfXKz0SaT14IWx_PA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003U30Q.jpg

   మూడు సభ్యదేశాలు పాల్గొన్న ఐ.బి.ఎస్.ఎ. వేదిక 6వ వర్చువల్ సమ్మేళనం సందర్బంగా నాలుగు సాంకేతిక సదస్సులు రెండు రోజులపాటు జరిగాయి. ఎం.ఎస్.ఎం.ఇ. మంత్రిత్వ శాఖకు సంబంధించిన పలువులు నిపుణులు, సీనియర్ అధికారులు, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లోని చిన్న, మధ్యతరహా సంస్థల వ్యవహారాలకు చెందిన అధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు ఈ సాంకేతిక సదస్సుల్లో పాలుపంచుకున్నారు. జాతీయ ఔత్సాహిక, సృజనాత్మక వ్యవస్థలో ఎం.ఎస్.ఎం.ఇ.లకు తగిన సామర్థ్యాలను కల్పించడం, ప్రపంచ స్థాయి గొలుసు సంస్థలుగా వాటిని సమీకృతం చేయడం, సుస్థిర అభివృద్ధి, భవిష్యత్తులో కోవిడ్-19 వంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఐ.బి.ఎస్.ఎ. సభ్యదేశాలు సన్నాహపడటం తదితర అంశాలపై ఐ.బి.ఎస్.ఎ. సమ్మేళనంలో విపులంగా చర్చించారు. 

  ఎం.ఎస్.ఎం.ఇ. రంగంలో ఐ.బి.ఎస్.ఎ. సభ్యదేశాల మధ్య సహకారం పెంపొందించుకునే కృషిలో ఈ సమ్మేళనం కూడా కీలక పాత్ర పోషించినట్టయింది. కూటమిలోని ప్రతి సభ్యదేశం సామర్థ్యాన్ని, పోటీ తత్వాన్ని సమీకృతం చేసుకునేందుకు కూడా ఈ సమ్మేళనం దోహదపడింది. ఎం.ఎస్.ఎం.ఇ.ల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సమ్మేళనంలో జరిగిన చర్చల ప్రాతిపదికగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. వివిధ సవాళ్లను అధిగమించి, ప్రపంచ వేదికపై పోటీపడే స్థాయికి ఎం.ఎస్.ఎం.ఇ.లను తయారు చేసేందుకు వీలుగా ఈ ప్రణాళికను తీర్చిదిద్దనున్నారు.

 

****


(Release ID: 1753180) Visitor Counter : 255