వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

మరింత విస్తృత స్థాయిలో నాణ్యతా పరీక్షలకు యోచన!


ఆటబొమ్మలు, హెల్మెట్లు, ఎయిర్ కండిషనర్ల, తదితర
ఉత్పాదనల నాణ్యతా నిర్ధారణకోసం మరిన్ని లేబరేటరీలు..
నానో టెక్నాలజీ ఉత్పాదనల
నాణ్యతా నిర్ధారణ దిశగా ఎన్.టి.హెచ్...

కాస్మెటిక్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ సామగ్రి
నాణ్యత, భద్రతా ప్రమాణాల పర్యవేక్షణకు ఏర్పాట్లు..

నాణ్యతా నిర్ధారణకోసం ఎన్.టి.హెచ్.కు
ప్రతి ఏడాదీ 25వేల మేర వస్తు నమూనాలు..


ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో విద్యార్థులకు
ఎన్.టి.హెచ్. స్కాలర్ షిప్పులు..

Posted On: 07 SEP 2021 5:06PM by PIB Hyderabad

  “పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారతదేశం కాలంతో కలసి ఎలా ముందుకు సాగుతూ వచ్చిందో తెలియజెప్పడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ పరిధిలోని జాతీయ పరీక్షా పరిశోధనాగారం (ఎన్.టి.హెచ్.) ఒక నిదర్శనంగా నిలిచింది. అలాగే, ప్రతి జీవన రంగంలో జాతి నిర్మాణానికి ఒక సంస్థ ఎలాంటి సేవలందిస్తోందో,  చెప్పడానికి కూడా ఎన్.టి.హెచ్.ను. ఒక మంచి ఉదాహరణం.”  అంటున్నారు లీనా నందన్.. కేంద్ర వినియోగదార్ల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఆమె వ్యవహరిస్తున్నారు. దేశాభివృద్ధి ప్రక్రియలో ఎన్.టి.హెచ్. పోషించే గణనీయమైన పాత్రను గురించి తెలియజెప్పడానికి  మంగళవారం నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె ఈ అభిప్రాయాలు వ్యక్తంచేశారు.

  పారిశ్రామక రంగంలో నాణ్యాతా సంప్రదింపుల సేవలందించడంలో కీలకపాత్ర పోషించే జాతీయ పరీక్షా పరిశోధనాగారానికి (ఎన్.టి.హెచ్.కు) 109ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని, నాణ్యతా హామీ పరిశోధనాగారంగా ఇది పనిచేస్తోంది. ఇంజినీరింగ్ రంగంలోని అన్ని రకాల పరిశ్రమలకు, వినియోగదారులకు, ప్రభుత్వ ఏజెన్సీలకు ఎన్.టి.హెచ్. తన సేవలందిస్తోంది. దీనికి దేశవ్యాప్తంగా 6 లేబరేటరీలు ఉన్నాయి. పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణా సంస్థలుగా ఈ లేబరేటరీలు పనిచేస్తున్నాయి.

  తాజాగా జాతీయ పరీక్షా పరిశోధనాగారం లేదా నేషనల్ టెస్ట్ హౌస్ (ఎన్.టి.హెచ్.)గా పిలుచుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థను 1912లో దక్షిణ కలకత్తా (కోల్కతా)లోని అలీపూర్ లో ఏర్పాటు చేశారు. అప్పటినుంచి, వివిధ రకాల వైజ్ఞానిక సిద్ధాంతాలకు, ఆవిష్కరణలకు, పలు రకాల ఉత్పాదనల రూపకల్పనకు ఇది ఎన్నో సేవలందించింది. 

 

  డాక్టర్ ఎస్. వెంకటేశ్వరన్, డాక్టర్ కృష్ణన్ వంటి వైజ్ఞానిన మేధావులు ఈ సంస్థకోసం ఎన్నో సేవలందించారు. ఎన్.టి.హెచ్.లోని శాస్త్రవేత్తలు, దేశం గర్వించదగిన ఒకప్పటి ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్ కు పరిశోధనలో సహాధ్యాయులుగా పనిచేశారు. అనేక పరీక్షలు, ఆవిష్కరణల్లో వారు భాగస్వాములయ్యారు. ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే “రామన్ ఎఫెక్ట్” సిద్ధాంతం ఆవిష్కరణలో కూడా వీరు పాలుపంచుకున్నారు. “రామన్ ఎఫెక్ట్” సిద్ధాంతాన్ని ఆవిష్కరించినందుకు గాను సర్ సి.వి.రామన్.కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. 1930లో స్వీడిష్ అకాడమీలో జరిగిన నోబెల్ పురస్కార ప్రదాన కార్యక్రంలో సర్ సి.వి. రామన్ మాట్లాడుతూ,.. ఎన్.టి.హెచ్. (అప్పటి గవర్నమెంట్ టెస్టింగ్ హౌస్- జి.టి.హెచ్.)లో శాస్త్రవేత్తగా పనిచేసిన డాక్టర్ ఎస్. వెంకటేశ్వరన్,.. “రామన్ ఎఫెక్ట్” ఆవిష్కరణలో అందించిన సేవలను ప్రశంసించారు.

  దేశంలో ఉత్పత్తి అవుతున్న లేదా,  దిగుమతి అయిన పలు ఉత్పాదనల నాణ్యత, భద్రతా ప్రమాణాలను పరీక్షించి నిర్ధారించే ప్రక్రియలో ఎన్.టి.హెచ్. నిర్విరామంగా సేవలందిస్తూ వస్తోంది. రైలు మార్గాలు, వ్యాగెన్లు, బోగీలు, ఎత్తయిన భవంతులు, సిమెంట్ కాంక్రీట్, ఇనుము, ఉక్కు కడ్డీలు, ట్రాన్స్ ఫార్మర్లతోపాటుగా, మిక్సర్ గ్రైండర్, ఓవెన్, టోస్టర్, బ్యాటరీలు, వైర్లు, కేబుళ్లు, తాళ్లు, ప్రెజర్ కుక్కర్లు వంటి వినియోగ వస్తువుల నాణ్యత, భద్రతా ప్రమాణాలను కూడా ఎన్.టి.హెచ్. పర్యవేక్షిస్తూ వస్తోంది. వివిధ రకాల పారిశ్రామిక ఉత్పాదనల రంగంలో తాజాగా జాతీయ ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాల తాజా పరిణామాలను ఎప్పటిలా కొనసాగేలా ఎన్.టి.హెచ్. తగిన చర్యలు తీసుకుంటుంది. పారిశ్రామిక రంగంలో స్వావలంబన సాధనే లక్ష్యంగా చేపట్టిన ఆత్మనిర్భర భారత్ కార్యక్రమానికి ఇది తగిన మద్దతును అందిస్తోంది.

  దీనిపై మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, గత 75 సంవత్సరాల్లో, జాతి నిర్మాణానికి సంబంధించిన పలు పథకాలకు ఎన్.టి.హెచ్. తన సేవలను అందించిందన్నారు. పలు రకాల వంతెనలు, రోడ్లు, భారీ రహదారులు, విమానాశ్రయాలు, ఉక్కు ప్లాంట్లు, రిఫైనరీలు, విద్యుత్ ప్లాంట్లు వంటి వాటికి సంబంధించి వైజ్ఞానిక పరీక్షల్లో, నాణ్యతా పర్యవేక్షక ప్రక్రియల్లో కూడా ఎన్.టి.హెచ్. పాలుపంచుకుందని చెప్పారు. అంతేకాక, వినియోగదారులు, భారీ, చిన్నతరహా పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రసాయన, సివిల్, విద్యుత్, మెకానికల్, విధ్వంస నివారణ పరీక్ష (ఎన్.డి.టి.), రబ్బర్-పేపర్-ప్లాస్టిక్, జవుళి రంగాలకు సంబంధించిన వినియోగదారులకు కూడా ఎన్.టి.హెచ్. తగిన సేవలను అందిస్తోందని అన్నారు.

  ఎన్.టి.హెచ్. కార్యకలాపాలపై ఒక కార్యక్రమాన్ని విలేకరుల ముందు ప్రదర్శించారు. గ్యాస్ బర్నర్లు, స్విచ్.లు, ఫ్లెక్సిబుల్ వైర్లు, డాక్యుమెంట్ల అర్కీవ్స్ తదితర ఉత్పాదనలకు సంబంధించి పరీక్షా ప్రక్రియను ఎలా నిర్వహిస్తారో వివరిస్తూ మొత్తం నాలుగు వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. జమ్ము కాశ్మీర్.లో,.. చీనాబ్ నదిపై నిర్మించిన వంతెనకు సంబంధించిన వెల్డింగ్ ప్రక్రియ, వెల్డింగ్ సర్టిఫికేషన్  ఎన్.టి.హెచ్. ఆమోదంతోనే జరిగిన విషయాన్ని విలేకరులకు వివరించారు.

  దీనికి తోడుగా, ప్యాకేజ్డ్ మంచినీరు, విద్యుత్ వాహనాల బ్యాటరీ పరీక్షా సేవలు, ఎల్.ఇ.డి. పరీక్షా సేవలు, సౌరశక్తి ఫలకాలపై పరీక్షలు వంటి వాటికి కూడా ఎన్.టి.హెచ్. తన సేవలను విస్తరించబోతోంది. భారత ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలకు కూడా తన సేవలను విస్తరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగానికి, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇ-మార్కెట్ పోర్టల్.లో ఉండే విక్రయదార్లకు సంబంధించిన నాణ్యతా పర్యవేక్షణ సేవలను కూడా ఎన్.టి.హెచ్. అందిస్తోంది. పెన్ను వంటి అతి చిన్న ఉత్పాదననుంచి, ట్రాన్స్.ఫార్మర్ వంటి భారీ ఉత్పాదన వరకూ నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ సేవలను ఆయా అధీకృత ఏజెన్సీలకు ఎన్.టి.హెచ్. అందిస్తూ వస్తోంది.

  ఎన్.టి.హెచ్. డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ పి. కంజీలాల్,.. వీడియో కనెక్షన్ ద్వారా మీడియా సమావేశంలో పాలుపంచుకున్నారు. నాణ్యతా ప్రమాణాల నిర్ధారణా పరీక్షలకోసం సంవత్సరానికి దాదాపు 25,000 నమూనాలు, ఉత్పాదనలు ఎన్.టి.హెచ్.కు అందుతూ ఉంటాయని, వాటిలో 60 శాతం ప్రభుత్వ ఏజెన్సీలనుంచి, 20-25శాతం ప్రైవేటు సంస్థలనుంచి, 15-20శాతం వ్యక్తులనుంచి అందుతున్నాయని డాక్టర్ పి. కంజీలాల్ చెప్పారు.

  ఇంజినీరింగ్/ఎమ్మెస్సీలో ప్రతిభను చూపే విద్యార్థులకు స్కాలర్ షిప్.లను కూడా ఎన్.టి.హెచ్. అందిస్తుంది. నానో టెక్నాలజీ, ఎలెక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ టెక్నాలజీ, ఆహార భద్రత, వంతెనలు, భవననాలపై సివిల్ ఇంజినీరింగ్ ప్రకంపనాల ప్రభావం తదితర అంశాలపై అధ్యయనం, పరిశోధన కోసం ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ. 25,000చొప్పున స్కాలర్ షిప్పుగా అందిస్తారు.

  మరో వైపు నానో మెటీరియల్ టెస్టింగ్ లేబరేటరీని రూపొందించేందుకు ఎన్.టి.హెచ్. సన్నాహాలు చేస్తోంది. నానో సంబంధిత పదార్థాలతో కూడిన ఉత్పాదనలు,.. ప్రత్యేకించి కాస్మెటిక్స్, ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులు, ఇళ్లలో వాడే డిజిటల్ పరకరాలు వంటి ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులను, ప్రతికూలతలను అంచనా వేసేందుకు ఈ లేబరేటరీ దోహదపడుతుంది. వినియోగ వస్తువుల పారిశ్రామిక రంగంలో నానో సంబంధిత సామగ్రికి కూడా ఎంతో విస్తృతమైన మార్కెట్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మైక్రోవేవ్.లు వంటి వాటి తయారీలో ఈ పరిస్థితి ఏర్పడే సూచనలున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఈ ఉత్పాదనల తయారీలో నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు ఎన్.టి.సి. సేవలందించే అవకాశాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  త్వరలో కోల్కతాలో సంపూర్ణ స్థాయిలో ఆహార పరీక్షా పరిశోధనా శాలను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి చెప్పారు. దీనికి తోడు, షార్ట్ సర్క్యూట్ పరిణామాలను ఎదుర్కొనడంలో ట్రాన్స్.ఫార్మర్ సామర్థ్యంపై పరీక్షా కేంద్రాన్ని ఘజియాబాద్.లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే సమయంలో ఇంపల్స్ వోల్టేజీ టెస్టింగ్, ట్రాన్స్.ఫార్మర్ పరీక్షా కేంద్రాన్ని చెన్నైలోను, ఎయిర్ కండిషనర్ల పరీక్షా కేంద్రాన్ని ముంబైలోను, ఆటబొమ్మల నాణ్యతా పరీక్షా కేంద్రాన్ని ముంబై, జైపూర్ నగరాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. అలాగే, హెల్మెట్ల భద్రతా ప్రమాణాల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల మంత్రిత్వ  శాఖ ఆలోచిస్తోంది. విలేకరుల సమావేశంలో సంయుక్త కార్యదర్శి వినీత్ మాథుర్, అదనపు కార్యదర్శి నిధీ ఖరే కూడా పాల్గొన్నారు.

 

బవిష్యత్ ప్రణాళికలు

  • కోల్కతాలో సంపూర్ణ ఆహార నాణ్యతా పరీక్షల పరిశోధనా కేంద్రం
  • ఘజియాబాద్.లో షార్ట్ సర్క్యూట్లను ఎదుర్కొనే ట్రాన్స్.ఫార్మర్ సామర్థ్య పరీక్షా కేంద్రం
  • చెన్నైలో ఇంపల్స్ వోల్టేజీ టెస్టింగ్, ట్రాన్స్.ఫార్మర్ పరీక్షా కేంద్రం.
  • ముంబైలో ఎయిర్ కండిషనర్ల పరీక్షా కేంద్రం
  • ముంబై, జైపూర్ నగరాల్లో ఆటబొమ్మల నాణ్యతా పరీక్షా కేంద్రం
  • హెల్మెట్ల బలం, భద్రతా ప్రమాణాలపై పరీక్షా సదుపాయం.

 

ఎన్.టి.హెచ్. ముందడుగు

          ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగదార్ల అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు, తదితర పరిణామాలకు తగినట్టుగా ఎన్.టి.హెచ్. ఈ కింది సదుపాయాలను ప్రవేశపెట్టింది.

  1. ప్యాకేజ్డ్ తాగునీరు, మున్సిపల్ తాగునీరు.
  2. ఎస్.ఇ.డి. ఆధారిత దీపాలు (భద్రత, పనితీరు ప్రాతిపదికగా).
  3. మైనింగ్ భద్రతా వ్యవహారాల డైరెక్టరేట్ జనరల్ (డి.జి.ఎం.ఎస్.) పరిధిలో గనుల ఉత్పాదనల భద్రతా పరీక్షల ప్రక్రియ, భవనాలు, ఆనకట్టలు, వంతెనల విధ్వంస నివారణా పరీక్షా ప్రక్రియ.
  4. ఇళ్లలో వాడే ఎలక్ట్రానిక్ పరికరాలు, ట్రాన్స్.ఫార్మర్లు, బ్యాటరీ, స్విచ్చులు, కేబుళ్లు తదితర వస్తువుల పరీక్షా ప్రక్రియ.
  5. భద్రతా సామగ్రి పరీక్షా ప్రక్రియ..ఉదాహరణకు,..ప్రెజర్ కుక్కర్, ఎల్.పి.జి. ఓవెన్, మైక్రో ఓవెన్ తదితరాలు.
  6. టి.ఎం.టి. కడ్డీలు, సిమెంట్, ఇసుక, నిర్మాణంలో వాడే స్టీల్, పెయింట్లు, రబ్బర్, ప్లాస్టిక్, పేపర్, జవుళి, పాదరక్షలు, వంట నూనెలు, ఎరువులు, బొగ్గు, నిర్మాణ సామగ్రి, రాళ్లు, వైద్య సంబంధిత ఫర్నిచర్, వాల్వులు.

 

****



(Release ID: 1752989) Visitor Counter : 153