విద్యుత్తు మంత్రిత్వ శాఖ

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా దిల్లీకి సైకిల్‌ ర్యాలీ చేపట్టిన అస్సాం రైఫిల్స్‌కు మద్దతిచ్చి, సత్కరించిన ఎన్‌టీపీసీ

Posted On: 07 SEP 2021 3:04PM by PIB Hyderabad

భారత సైన్యానికి చెందిన ప్రఖ్యాత పారామిలిటరీ దళం అస్సాం రైఫిల్స్‌, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా, ఈ నెల 5న 'ఫ్రీడమ్ సైక్లింగ్ ర్యాలీ' చేపట్టింది. షిల్లాంగ్ నుంచి దిల్లీ వరకు 3000 కి.మీ. దూరం ఈ ర్యాలీ సాగుతోంది. ర్యాలీ చేపట్టిన జవాన్లను అభినందిస్తూ ఎన్‌టీపీసీ వారికి మద్దతునిచ్చింది. 75 సంవత్సరాల స్వతంత్ర ప్రగతిశీల భారత్‌ను, ప్రజలు, సంస్కృతి, విజయాల అద్భుత చరిత్రను గుర్తు చేస్తూ, "ఫిట్ ఇండియా ఉద్యమాన్ని" ప్రోత్సహిస్తూ ఈ ర్యాలీ సాగుతోంది.

ఎన్‌టీపీసీ బొంగాయ్‌గావ్‌ విభాగం ఈడీ శ్రీ సుబ్రత మండల్ నేతృత్వంలో, విద్యుత్‌ కేంద్రంలోని వివిధ విభాగాల నుంచి 20 మందికి పైగా ఉద్యోగుల బృందం అస్సాం రైఫిల్స్ బృందంతో కలిసి 18 కి.మీ.పైగా సైకిల్‌ యాత్రలో పాల్గొంది. జాతీయ రహదారి-27 ప్రారంభమయ్యే కషికోట్ర నుంచి ఖరేగావ్ వరకు ఎన్‌టీపీసీ, 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జెండాలను సైక్లిస్టులు తీసుకెళ్లారు. విద్యుత్‌ కేంద్రం అధికారులు అస్సాం రైఫిల్స్‌ జవాన్ల సత్కరించారు.

కోఖ్రాఝర్‌, బొంగాయ్‌గావ్‌ను విడదీసే జాతీయ రహదారి వద్ద, కల్నల్‌ అజిత్‌ ఖత్రి నేతృత్వంలోని 40 మంది అస్సాం రైఫిల్స్‌ బృందాన్ని సన్మానించారు. ఎన్‌టీపీసీ బొంగాయ్‌గావ్‌ ఈడీ శ్రీ సుబ్రత మండల్, జీఎం శ్రీ ఉమేష్‌ సింగ్‌, సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ శ్రీ హెచ్‌.కె.బ్రహ్మ, ఇతర సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***
 



(Release ID: 1752961) Visitor Counter : 194