శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ సాధనకు దోహదపడే శాస్త్రీయ ప్రతిభ, అంకుర సంస్థలను గుర్తించడానికి కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
02 SEP 2021 4:00PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆశిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణ సాధనకు కేంద్రం రాష్ట్రాలు కలిసి పని చేయవలసి ఉంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక (స్వతంత్ర), భూ శాస్త్రం (స్వతంత్ర), అణుశక్తి, అంతరిక్ష, ప్రజా ఫిర్యాదులు,పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రజలలోకి వెళ్లి యువ పరిశోధకులు, మహిళా శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, అంకుల్ సంస్థలను నెలకొల్పాలని అనుకుంటున్న వారిని గుర్తించడానికి కేంద్రంతో కలిసి రాష్ట్రాలు పనిచేయాలని మంత్రి కోరారు.
'ఆజాది కా అమృత్ మహోత్సవ్ ' కార్యక్రమంలో భాగంగా ఏడాది పాటు నిర్వహించనున్న 'విజ్ఞాన్ ఉత్సవ్' ను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అన్ని శాస్త్ర, సాంకేతిక మండళ్లు పాల్గొంటాయి. ఈ సందర్భంగా ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఆత్మనిర్భర్ భారత్ సాధనలో శాస్త్ర, సాంకేతిక మండళ్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అన్ని రంగాల్లో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రాథమిక అవసరం అని ఆయన అన్నారు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే కార్యక్రమాలతో ప్రపంచ శాస్త్రీయ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు కేవలం ఒక ఏడాదికి మాత్రమే పరిమితం కాకూడదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి పేర్కొన్న విధంగా ఈ ఉత్సవాలలో నూతన ఆలోచనలు, విధానాలతో అభివృద్ధి సాధించడానికి ఉపకరించే కార్యాచరణ కార్యక్రమాలను రూపొందించవలసి ఉంటుందని మంత్రి అన్నారు. ఇప్పటి నుంచి రానున్న 25 సంవత్సరాలు నవ భారత నిర్మాణంలో కీలకంగా ఉంటాయని అన్నారు. స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకొనే నాటికి సాంకేతిక ఆవిష్కరణల ద్వారా అన్ని రంగాలలో అద్వితీయ ప్రగతిని సాధించడానికి కార్యాచరణ కార్యక్రమం రూపొందాలని పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి శాస్త్ర, సాంకేతిక రంగాలు ఉపయోగపడతాయని మధ్యప్రదేశ్ శాస్త్ర సాంకేతిక, సూక్ష్మచిన్న మధ్య
తరహా శాఖల మంత్రి శ్రీ ఓంప్రకాష్ సఖ్లేచా అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల సహకారంతో శాస్త్ర సాంకేతిక రంగాలపై కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు.
దేశాభివృద్ధికి దోహదపడే విధంగా ప్రాధాన్యతా అంశాలతో విజ్ఞాన్ ఉత్సవ్ ను నిర్వహిస్తున్నామని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ వివరించారు.
శాస్త్ర సాంకేతిక మండళ్ల ద్వారా రాష్ట్రాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సలహాదారుడు డాక్టర్ దేబ్రియ దత్తా అన్నారు. ఈ ఉత్సవాలతో దేశ శాస్త్ర సాంకేతిక రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అన్ని రాష్ట్రాలు పాల్గొనే ఈ విజ్ఞాన్ ఉత్సవ్ 2022 ఆగస్ట్ వరకు సాగుతుంది.
***
(Release ID: 1751564)
Visitor Counter : 186