రక్షణ మంత్రిత్వ శాఖ
ఉత్తరాఖండ్‌లోని వరద ప్రభావిత ధర్‌చులాలో అనుసంధానతను పునరుద్దరించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న 80 మంది సభ్యులు గల బి.ఆర్.ఓ బృందం
Posted On:
02 SEP 2021 10:29AM by PIB Hyderabad
ముఖ్యాంశాలు.....
ఎడతెగని వర్షాలు, కుండపోతగా కురిసిన వాన, ఆకస్మిక వరదల కారణంగా పితోరాఘర్-తవాఘాట్ జాతీయ రహదారిపై 500 మీటర్ల రోడ్ మార్గం కొట్టుకుపోయింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి ధర్‌చులా ను సందర్శించి బిఆర్.ఒ బృంద సభ్యులతోముచ్చటించారు.
రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించేందుకు ఎక్స్‌కవేటర్లు, జెసిబిలను ఏర్పాటు చేసి బిఆర్ ఒ కు చెందిన 80 మంది సభ్యుల ప్రత్యేక బృందం కృషి చేస్తోంది.
పాదచారుల కోసం బిఆర్ ఒ ఇప్పటికే ఫుట్ ట్రాక్‌ను నిర్మించింది. అలాగే మానవతా సహాయం కింద మారుమూల గ్రామాల వారికి ఆహారపొట్లాలను పంపిణీ చేశారు.
ఆగస్టు 2021 చివరి వారంలో , పితోరాఘర్‌జిల్లాలోని మారుమూల ధార్‌చులా పట్టణంలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దానికి తోడు ఆకస్మిక వరదలు వచ్చిపడ్డాయి.
2021 ఆగస్టు 30న ఆకస్మిక వరదలు , కుండపోత వర్షం కారణంగా పితోరాఘర్-తవాఘాట్ జాతీయ రహదారిపై దోబాట్ జనరల్ ఏరియాలో 98 -102 వ కిలోమీటర్ మధ్య సుమారు 500 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీనితో జాతీయరహదారిపై కీలకమైన ప్రాంతంలో రోడ్డు అనుసంధానత పోయినట్టయింది.
ప్రస్తుతం ఏర్పడిన అత్యవసర స్థితిని దృష్టిలో ఉంచుకుని సరిహద్దు రోడ్డు సంస్థ ప్రాజెక్ట్ హిరాక్ నుంచి ప్రత్యేక బృందాన్ని, తక్షణ పునరావాస కార్యకలాపాలు చేపట్టేందుకు , అడ్డంకులను వీలైనంత త్వరగా తొలగించేందుకు రంగంలోకి దించింది. ప్రస్తుతం 80 మందితో కూడిన బిఆర్ఒ టాస్క్ ఫోర్సు ఎక్సకవేటర్లు, జెసిబిల సహాయంతో రోడ్డు అనుసంధానతను పునరుద్ధరించేందుకు నిర్విరామ కృషి చేస్తున్నది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధమి 2021 సెప్టెంబర్ 1న పితోరాఘర్ జిల్లాలోని దార్‌చులాను సందర్శించి అక్కడ సహాయ కార్యక్రమాలను సమీక్షించారు. 2021 ఆగస్టు 30 న ఈ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురియడంతోపాటు వరదలు వచ్చిపడ్డాయి. దార్‌చులా వద్ద పితోరాఘర్ తవాఘాట్ రోడ్ వద్ద పలు చోట్ల రోడ్డు మార్గం తెగిపోవడం గురించి, దానిని పునరుద్ధరించేందుకు తాము తీసుకుంటున్న చర్యలు, పునరావాస కార్యకలాపాల గురించి బిఆర్ఒ టాస్క్‌ఫోర్సు కమాండర్ , ముఖ్యమంత్రికి వివరించారు.
ఇదిలా ఉండగా, బిఆర్ఒ ఇప్పటికే రోడ్డు దెబ్బతిన్న ప్రాంతంలో ఫుట్ ట్రాక్‌ను నిర్మించి పాదచారులు వెళ్లేందుకు ఏర్పాటు చేసింది. అలాగే బి.ఆర్.ఒ అక్కడి స్థానికులకు మానవతా సహాయం కింద ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. సవాలుతో కూడిన పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నప్పటికీ అన్ని ర్యాంకులకు చెందిన బిఆర్ ఒ అధికారులు వీలైనంత త్వరా రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
***
(Release ID: 1751432)
Visitor Counter : 230