గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భూగర్భ గనుల్లో తొలి మహిళా మైనింగ్ ఇంజినీరుగా చేరిన ఆకాంక్షా కుమారిని అభినందించిన కేంద్ర మంత్రి శ్రీ ప్రల్హద్ జోషి


లింగ సమానత్వం దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతిశీల విధానాలకు ఆకాంక్షా కుమారి సాధించిన విజయం నిదర్శనం : శ్రీ ప్రల్హద్ జోషి

Posted On: 31 AUG 2021 4:43PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పనిచేస్తున్న సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ భూగర్భ గనుల్లో తొలి మహిళా మైనింగ్ ఇంజినీరుగా చేరిన ఆకాంక్షా కుమారిని  కేంద్ర మంత్రి శ్రీ ప్రల్హద్ జోషి అభినందించారు. ఉత్తర కరన్‌పురా ప్రాంతంలో చురీ  సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ భూగర్భ గనిలో ఆకాంక్షా కుమారి మైనింగ్ ఇంజినీరుగా చేరడం పట్ల మంత్రి ట్వీట్ ద్వారా తన హర్షం వ్యక్తం చేశారు. భూగర్భ గనిలో తొలి మహిళా ఇంజినీరుగా చేరి ఆమె చరిత్ర సృష్టించారని మంత్రి పేర్కొన్నారు. 

ఆకాంక్షా కుమారి సాధించిన విజయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  ప్రగతిశీల విధానాలకు నిదర్శనమని ఆయన చెప్పారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం మహిళలకు ఉపాధి అవకాశాలు లభించేలా చూడడానికి చర్యలను అమలు చేస్తున్నదని అన్నారు. 

 మైనింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆకాంక్షా కుమారి సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కి  ఉత్తర కరన్‌పురా ప్రాంతంలో ఉన్న చురి భూగర్భ గనుల్లో చేరారు.  సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్   లో చేరిన మొదటి మహిళా మైనింగ్ ఇంజినీర్ గా ఆమె గుర్తింపు పొందారు.  మహిళా ఉద్యోగులు ఆఫీసర్లుగా, డాక్టర్లుగా సెక్యూరిటీ గార్డులుగా మాత్రమే కాకుండా డంపర్  వంటి భారీ యంత్రాలను కూడా నడుపుతూ తమ ప్రతిభను చాటుతూ ప్రతి రంగంలో రాణిస్తున్నారు.  ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు మైనింగ్ కంపెనీలలో ఒకటైన  సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో అతి ముఖ్యమైన మైనింగ్ కార్యకలాపాలలో మొదటిసారి ఒక మహిళ భూగర్భ గనుల్లో మైనింగ్ ఇంజినీరుగా విధుల్లో చేరారు. మహారత్న సంస్థగా గుర్తింపు పొందిన  కోల్ ఇండియా లిమిటెడ్‌లో రెండవ మైనింగ్ ఇంజనీర్ ఆకాంక్షా కుమారి  భూగర్భ బొగ్గు గనిలో  పనిచేస్తున్న  మొదటి మహిళ కావడం గమనార్హం. 

  జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా బార్కాగావ్‌కి చెందిన  ఆకాంక్ష నవోదయ విద్యాలయం నుంచి  తన పాఠశాల విద్యను పూర్తి చేశారు.  మైనింగ్ బెల్ట్‌కు చెందిన ఆమె చిన్నతనం నుంచి సమీప ప్రాంతాలలో సాగుతున్న బొగ్గు తవ్వకాల కార్యకలాపాలను చూసి వాటి పట్ల ఆకర్షితురాలైంది.  దీనితో  ఆమె చిన్ననాటి నుంచే  గనులు మరియు దాని కార్యకలాపాల పట్ల ఆమెలో జిజ్ఞాస పెరిగింది.  ధన్బాద్ లోని బిఐటి సింద్రీలో మైనింగ్ ఇంజనీరింగ్‌లో చేరి విజయం సాధించిన ఆకాంక్ష తన కలలను సాకారం చేసుకుంటూ మైనింగ్ రంగంలో విధుల్లో చేరింది. 

కోల్ ఇండియా లిమిటెడ్‌లో చేరడానికి ముందు ఆమె రాజస్థాన్‌లోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్  బలేరియా గనుల్లో మూడు సంవత్సరాలు పనిచేసింది.  తన కలలను నెరవేర్చడానికి  అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు ఆకాంక్ష కృతజ్ఞతలుతెలిపింది.  కోల్ ఇండియా లిమిటెడ్‌లో చేరడంతో  తన చిన్ననాటి కలను నెరవేరిందని పేర్కొన్న ఆకాంక్ష శక్తివంచన లేకుండా విధులను నిర్వర్తిస్తానని అన్నారు. 

***



(Release ID: 1750929) Visitor Counter : 196