పర్యటక మంత్రిత్వ శాఖ
లేహ్ లో 26నుంచి మూడు రోజుల పర్యాటక సమ్మేళనం "లద్ధాఖ్: కొత్త ప్రారంభం , కొత్త లక్ష్యాలు" మొదలు
లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ రాధాకృష్ణ మాథుర్ మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తారు
లద్ధాఖ్ ప్రాంత సర్వతోముఖాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తూ "లద్ధాఖ్ పర్యాటక స్వప్నం" పత్రం ఆవిష్కరణ
Posted On:
25 AUG 2021 12:28PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు :
* ఈ సమ్మేళనం ప్రధాన లక్ష్యం సాహసకృత్యాలు, సాంస్కృతిక మరియు బాధ్యతాయుత పర్యాటకంపై దృష్టితో లద్ధాఖ్ ను ఒక మంచి పర్యాటక గమ్యంగా ప్రోత్సహించడం
* టూరిజం పరిశ్రమలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బాగస్వామ్యపక్షాలకు ప్రాంతం గురించిన పరిజ్ఞానాన్ని సమకూర్చడంతో పాటు స్థానికంగా పర్యాటక విధులు నిర్వహిస్తున్న వారికి దేశంలోని ఇతర ప్రాంతాలలో ఉండే టూర్ ఆపరేటర్లు /కొనుగోలుదారులతో పరస్పరం అభిప్రాయమార్పిడి అవకాశం కల్పించడం ఈ సమ్మేళనం లక్ష్యం
* ఈ మూడు రోజుల సమ్మేళనంలో భాగంగా లద్ధాఖ్ ప్రాంతంలో లభ్యమయ్యే పర్యాటక సౌకర్యాలు మరియు టూరిజం ఉత్పత్తుల ప్రదర్శనలు, నిపుణుల బృంద చర్చలు, బి 2 బి సమావేశాలు, సాంకేతిక పర్యటనలు, పర్యాటక ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుంది.
కేంద్రపాలిత ప్రాంతం లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ రాధా కృష్ణ మాథుర్ మరియు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పర్యాటక రంగంపై "లద్ధాఖ్: కొత్త ప్రారంభం , కొత్త లక్ష్యాలు" అనే ఇతివృత్తంపై లేహ్ లో 26 నుంచి 28 ఆగస్టు , 2021 వరకు జరుగుతున్న ఈ మూడు రోజుల మహా సమ్మేళనం ప్రసంగిస్తారు. శ్రీ కిషన్ రెడ్డి ఈ సమ్మేళనంలో చాక్షుష రీతిలో పాల్గొంటారు. లద్ధాఖ్ ప్రాంత సర్వతోముఖాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరిస్తూ రూపొందించే "లద్ధాఖ్ పర్యాటక స్వప్నం" అనే సాధన పత్రాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు.
నిర్వహణీయ పర్యావరణ అలవాట్ల నేపథ్యంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం, స్థానికంగా లభ్యమయ్యే సాధన సంపత్తిని మరియు మానవ వనరులను అభివృద్ధి పరచడం లక్ష్యంగా ఈ సాధన పత్రానికి రూపకల్పన చేశారు. లద్ధాఖ్ పార్లమెంట్ సభ్యుడు హ్రీ జంయాంగ్ తీరింగ్ నాంగ్యాల్, కేంద్రపాలిత ప్రాంతం లద్ధాఖ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ కె. మహబూబ్ అలీ ఖాన్ , భారత ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్ మరియు ఇతర ప్రముఖులు ఈ సమ్మేళనంలో పాల్గొంటారు.
కేంద్రపాలిత ప్రాంతం లద్ధాఖ్ పర్యాటక శాఖ, భారత సాహసయాత్రల నిర్వాహకుల సంఘం (ఏ టి ఓ ఏ) సహకారంతో భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆగస్టు 25-28 మధ్య "లద్ధాఖ్: కొత్త ప్రారంభం , కొత్త లక్ష్యాలు" అనే ఇతివృత్తంతో మూడు రోజుల సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. సాహసకృత్యాలు, సాంస్కృతిక మరియు బాధ్యతాయుత పర్యాటకం లక్ష్యంగా లద్ధాఖ్ ను పర్యాటక గమ్యంగా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ సమ్మేళనం ద్వారా భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు, సంప్రదింపు, వ్యాపార ఒప్పందాలకు అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా లద్ధాఖ్ ను దేశ, విదేశాల పర్యాటకులకు పరిచయం చేయడం ఈ సమ్మేళనం లక్ష్యం. అదే విధంగా ఈశాన్య ప్రాంతం , లద్ధాఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ లోని పర్యాటక గమ్యాలకు ప్రాధాన్యత ఇచ్చి పరిచయం చేయడం ఉద్దేశం.
మున్నెన్నడూ లేని రీతిలో మహమ్మారి ప్రపంచాన్ని కకావికలం చేసింది. విశ్వ మహమ్మారి కోవిడ్ -19 తరువాత ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుని సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు విమానాలు, రైళ్లు మరియు రహదారి మార్గంలో ప్రయాణాలు చేయడం పెరిగింది. దేశీయ పర్యాటక రంగంలో కూడా ట్రాఫిక్ పెరిగింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నది. ఇందులో భాగంగా లద్ధాఖ్ ప్రాంతాన్ని గురించి కూడా ప్రచారానికి ఉపక్రమించినది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో లద్ధాఖ్ గురించి ప్రచారం చేస్తున్నారు. దేఖో అప్నా దేశ్ ప్రచార కార్యక్రమం ద్వారా లద్ధాఖ్ కోసం ఒక ప్రత్యేక వెబినార్ నిర్వహించారు. ఇన్ క్రెడిబుల్ ఇండియా వెబ్ సైట్, మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక మాధ్యమం, కరపత్రాలు తదితర సాధనాల ద్వారా కూడా లద్ధాఖ్ గురించి ప్రచారం చేస్తున్నారు.
దాదాపు 150 మంది ప్రతినిధులు ఈ సమ్మేళనానికి హాజరవుతారని ఆశిస్తున్నారు. సమ్మేళనానికి హాజరయ్యేవారిలో భావ సారథులు, టూర్ ఆపరేటర్లు, హోటళ్ల అధిపతులు/ప్రతినిధులు, దౌత్యవేత్తలు, పర్యాటకులకు ఇళ్లను అద్దెకిచ్చే యజమానులు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, కేంద్రపాలిత ప్రాంతం లద్ధాఖ్ పాలనాధికారులు మరియు మీడియా ప్రతినిధులు ఉంటారు. ఈ మూడు రోజుల సమ్మేళనంలో భాగంగా లద్ధాఖ్ ప్రాంతంలో లభ్యమయ్యే పర్యాటక సౌకర్యాలు మరియు టూరిజం ఉత్పత్తుల ప్రదర్శనలు, నిపుణుల బృంద చర్చలు, బి 2 బి సమావేశాలు, సాంకేతిక పర్యటనలు, పర్యాటక ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుంది. ఈ సమ్మేళనానికి ముందురోజు ఆగస్టు 25వ తేదీన వ్యాపారవేత్తల మధ్య చర్చలు, సంప్రదింపుల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. 26వ తేదీన పర్యాటకానికి సంబంధించిన వివిధ అంశాలపై నిపుణుల బృంద చర్చలను ఏర్పాటు చేశారు. ఆగస్టు 27వ తేదీన ప్రతినిధులు రెండు బృందాలుగా విడిపోయి చిలింగ్ మరియు లికిర్ ప్రాంతాలకు సాంకేతిక పర్యటనలు జరుపుతారు.
***
(Release ID: 1749187)
Visitor Counter : 130