నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

కర్భన కాలుష్య రహితంగా భారతీయ రవాణా రంగం!


కార్యక్రమానికి ఉమ్మడిగా శ్రీకారం చుట్టిన
నీతీ ఆయోగ్, డబ్ల్యు.ఆర్.ఐ. ఇండియా

Posted On: 24 AUG 2021 2:32PM by PIB Hyderabad

  భారతదేశంలో రవాణా రంగాన్ని కర్బన కాలుష్య రహితంగా రూపొందించడానికి ఉద్దేశించిన వేదికను నీతీ ఆయోగ్, ప్రపంచ వనరుల సంస్థ (డబ్ల్యు.ఆర్.ఐ.-ఇండియా) ఉమ్మడిగా ప్రారంభించాయి. ఎన్.డి.సి. ట్రాన్స్.పోర్ట్ ఫర్ ఆసియా (ఎన్.డి.సి.-టి.ఐ.ఎ.) పథకంలో భాగంగా ఆగస్టు 23న ఈ వేదిక ప్రారంభమైంది. తక్కువ స్థాయి కర్భన ఉద్గారాలను విడుదలచేసే రవాణా వ్యవస్థ రూపకల్పనకు ఈ వేదిక దోహదపడుతుంది.

   వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నీతీ ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) అమితాబ్ కాంత్ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ మంత్రిత్వ శాఖల ప్రముఖులు, ఎన్.డి.సి.-టి.ఐ.ఎ. ప్రాజెక్టు భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, రవాణా, ఇంధన రంగాలకు చెందిన భాగస్వామ్య వర్గాల వారు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆసియా ఖండంలో రవాణా రంగం ద్వారా వాయుకాలుష్యానికి దారి తీసే కార్బన్ డయాక్సైడ్, మీథేన్, ఓజోన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు స్థాయిని 2 డిగ్రీలకంటే దిగువకు గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు.

  వాతావరణ కాలుష్య కారకమైన కర్బన ఉద్గారాల విడుదలలో భారీ స్థాయిలోని మనదేశపు రవాణారంగం 3వ స్థానంలో ఉంది. అంతర్జాతీయ ఇంధన అధ్యయన సంస్థ (ఐ.ఇ.ఎ.),  వాతావరణ మార్పులపై కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ 2018వ సంవత్సరపు అధ్యయన నివేదిక ప్రకారం,..రవాణా రంగంలో అంతర్భాగమైన ఒక్క రోడ్డు రవాణా ద్వారానే 90శాతం పైగా కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం వాతావరణంలోకి విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో రవాణా రంగం ద్వారా వాతావరణంలోకి వెలువడుతున్న కర్బన ఉద్గారాగాలను తగ్గించేందుకు విధానపరమైన వివిఝధ చర్యల ద్వారా భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టే అంశంపై దృష్టిని కేంద్రీకరిస్తోంది. విద్యుత్ వాహనాల ప్రోత్సాహక కార్యక్రమంలో నీతీ ఆయోగ్ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. విద్యుత్ వాహనాల వినియోగం, బ్యాటరీ స్టోరేజీ అంశాలపై జాతీయ పథకం అమలు చేయడం ద్వారా నీతీ ఆయోగ్ ఈ ప్రధాన పాత్రను నిర్వహిస్తోంది.

  అయితే,..దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వినియోగం విషయంలో తగిన వెసులుబాటుకోసం వివిధ  భాగస్వామ్య  వర్గాలకు దేశంలో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాష్ట్రాల నియమిత సంస్థలు, ఆర్థిక సంస్థలు, వ్యాపార సంస్థలు, పరిశోధనా, సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, ప్రైవేటు సంస్థలు, మేధావి వర్గాలు ఈ భాగస్వామ్య వర్గాల పరిధిలోకి వస్తారు. భాగస్వామ్య వర్గాల ప్రతినిధుల మధ్య పరస్పర సమన్వయ కృషి ద్వారా పారిశ్రామిక రంగంలో సక్రమమైన కార్యకలాపాలకోసం పెట్టుబడులకు, సానుకూల పద్ధతులను అమలు చేయడానికి వీలు కలుగుతుంది.

  దేశంలో రవాణా రంగంలో కర్బన ఉద్గాగారాల విడుదలను నియంత్రించే బహుళ భాగస్వామ్య వర్గాల వేదికను రూపొందించడం, ఇందుకు తగిన పటిష్ట విధానాలను అనుసరించడం, సందర్భోచిత వ్యూహాన్ని రూపకల్పన చేయడం వంటి అంశాలపై ఎన్.డి.సి.-టి.ఐ.ఎ. ఇండియా కార్యక్రమం దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఈ వేదిక ద్వారా డబ్ల్యు.ఆర్.ఐ. బృందం, నీతీ ఆయోగ్ ప్రతినిధులు, ప్రాజెక్టులోని ఇతర భాగస్వాములు సన్నిహిత సమన్వయంతో పనిచేస్తారు. దేశంలో విద్యుత్ వాహనాల రవాణాను వేగవంతం చేసేందుకు అవసరమైన వాణిజ్య నమూనాల రూపకల్పన కోసం వీరు కృషి చేస్తారు. రవాణా రంగం ద్వారా వెలువడే కాలుష్యాలను తగ్గించడంలో ప్రత్యేక ఫలితాల సాధనకు, ఏకరూప విధానాల రూపకల్పనకు అవసరమైన చర్చలు చేపట్టడానికి తగిన అవకాశాన్ని కూడా ఈ వేదిక కల్పిస్తుంది.

   రవాణా రంగాన్ని కర్బన ఉద్గార రహితంగా రూపొందించడానికి ఉద్దేశించిన వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతీ ఆయోగ్ సి.ఇ.ఒ. ప్రధానోపన్యాసం ఇస్తూ, దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందన్నారు. “వివిధ సంస్థల సి.ఇ.ఒ.లు, పరిశోధకులు, విద్యావేత్తలు, బహుళ రంగాల ఏజెన్సీలు, ఆర్థిక సంస్థలతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమైక్యం చేసి ఒకే ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. విద్యుత్ వాహనాల వినియోగంలో సంపూర్ణ స్థాయి ప్రగతి లక్ష్యాల సాధనకు అనుసరించదగిన సృజనాత్మక వాణిజ్య నమూనాల రూపకల్పనకు కూడా ఇది సహాయపడుతుంది. కాలుష్యానికి తావులేని స్వచ్ఛమైన రవాణా పద్ధతులను పరస్పర సహకారంతో చేపట్టడానికి మనం కలసికట్టుగా కృషి చేయాల్సి ఉంటుంది.” అని ఆయన అన్నారు.

 డబ్ల్యు.ఆర్.ఐ. ఇండియా సి.ఇ.ఒ., డాక్టర్ ఒ.పి. అగర్వాల్ మాట్లాడుతూ,... పట్టణ రవాణా రంగాన్ని కర్బన కాలుష్యరహితంగా తయారు చేసేందుకు భారతదేశానికి గొప్ప అవకాశం అందుబాటులో ఉందన్నారు. కాలినడకను, సైక్లింగ్.ను ప్రోత్సహించడం, వాహనాల విద్యుదీకరణతో కూడిన ప్రజా రవాణాను అమలు చేయడం దేశవ్యాప్తంగా అనుసరించదగిన సరైన వ్యూహాలని ఆయన అభిప్రాయపడ్డారు.

   డబ్ల్యు.ఆర్.ఐ. ఇండియా సమీకృత రవాణా వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ భట్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ,..రవాణా రంగాన్ని కర్బన కాలుష్య రహితంగా తయారు చేసేందుకు భాగస్వామ్యవర్గాల వేదిక ఎంత అవసరమో వివరించారు. “రవాణా రంగం ద్వారా విడుదలయ్యే కాలుష్యాన్ని తగ్గించాలంటే బహుళ రంగాలనుంచి కార్యాచరణ అవసరం. దేశంలో రవాణా రంగాన్ని కాలుష్యానికి తావులేనంత స్వచ్ఛంగా రూపొందించేందుకు వీలుగా విభిన్నవర్గాల అభిప్రాయాలను సమీకృతం చేసేందుకు ఈ కార్యక్రమం ఒక వాహకంగా పనిచేస్తుంది.” అని అమిత్ భట్ అన్నారు.

  ఎన్.డి.సి. రవాణా ఇనిషియేటివ్ ఫర్ ఆసియా (టి.ఐ.ఎ. 2020-2023) పేరిట నిర్వహించిన ఈ వేదిక, ఏడు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి కార్యక్రమం. చైనా, ఇండియా, వియత్నాం దేశాల్లో రవాణా రంగాన్ని కర్బన ఉద్గార రహితంగా తయారు చేసేందుకు ఆయా దేశాలు కీలకపాత్ర పోషించేలా ఈ సంస్థలు కృషి చేస్తాయి. అంతర్జాతీయ వాతావరణ అధ్యయన కార్యక్రమం (ఐ.కె.ఐ.)లో భాగంగా ఈ పథకాన్ని చేపట్టారు. పర్యావరణ వ్యవహారాల ఫెడరల్ మంత్రిత్వ శాఖ, ప్రకృతి పరిరక్షణ, అణు భద్రత సంస్థ (బి.ఎం.యు.) ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాయి. జర్మన్ ఫెడరల్ పార్లమెంటు అయిన బుండెస్టాగ్ తీర్మానం ఆధారంగా ఈ సంస్థలు తమ మద్దతు అందిస్తున్నాయి.

  ఈ ప్రాజెక్టులో భారతదేశం తరఫున చేపట్టవలసిన కార్యక్రమాలను అమలు చేసే అధీకృత సంస్థగా నీతీ ఆయోగ్ వ్యవహరిస్తోంది.

 

***


(Release ID: 1748707) Visitor Counter : 277