ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆదాయ పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలపై చర్చకు ఇన్ఫోసిస్‌తో ఆర్థిక మంత్రిత్వ శాఖ సమావేశం

Posted On: 23 AUG 2021 6:48PM by PIB Hyderabad

ఇన్ఫోసిస్ ఎండీ & సీఈవో శ్రీ సలిల్ పరేఖ్‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఆలస్యంగా ప్రారంభమైన, ప్రారంభమై రెండున్నర నెలల తర్వాత కూడా ఆదాయ పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న లోపాలపై కేంద్ర ప్రభుత్వం, పన్ను చెల్లింపుదారుల తరపున తీవ్ర అసంతృప్తిని ఆర్థిక మంత్రి వ్యక్తం చేశారు. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న పునరావృత సమస్యలపై ఇన్ఫోసిస్ నుంచి వివరణ కోరారు.

    పోర్టల్‌ ద్వారా అందించేందుకు అంగీకరించిన సేవలు ఇప్పటికైనా సక్రమంగా వినియోగదారులకు చేరేలా నిర్ధరించడానికి ఇన్ఫోసిస్‌ తరపున మరిన్ని వనరులు మోహరించి, ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోర్టల్ పనితీరులో జాప్యం కారణంగా తలెత్తే సమస్యలపైనా పరేఖ్‌కు అధికారులు అవగాహన కల్పించారు.

    పోర్టల్‌ ద్వారా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వచ్చే నెల 15వ తేదీ నాటికి పరిష్కరించాలని పరేఖ్‌కు ఆర్థిక మంత్రి స్పష్టంగా చెప్పారు. దీని వల్ల పన్ను చెల్లింపుదారులు, నిపుణులు పోర్టల్‌ ద్వారా వారి పని సజావుగా చేసుకుంటారన్నారు.

    పోర్టల్ సజావుగా పనిచేయడానికి తాను, తన బృందం అవసరమైన ప్రతిదీ చేస్తున్నామని శ్రీ పరేఖ్ వివరించారు. ఈ ప్రాజెక్టులో 750 మంది సభ్యులు పని చేస్తున్నారని, ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్‌రావు వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బంది లేని ఈ-ఫైలింగ్‌ అనుభవాన్ని అందించడానికి ఇన్ఫోసిస్ వేగంగా పని చేస్తోందని శ్రీ పరేఖ్ హామీ ఇచ్చారు.

 

***



(Release ID: 1748426) Visitor Counter : 216