ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

"ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్"


హెచ్.ఐ.వి., టి.బి., రక్త దానం కార్యక్రమాలపై అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించిన - శ్రీ మన్సుఖ్ మాండవీయ

అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులతో దృశ్య మాధ్యమం ద్వారా సంభాషించిన - కేంద్ర మంత్రి

Posted On: 12 AUG 2021 4:50PM by PIB Hyderabad

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ ఈరోజు హెచ్‌.ఐ.వి., టి.బి. మరియు రక్తదానం పై మొదటి దశ అవగాహనా కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ సమక్షంలో ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎన్.ఏ.సి.ఓ) నిర్వహించింది.

75వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న "భారత్-కా-అమృత్-మహోత్సవ్" లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన లక్ష మందికి పైగా విద్యార్థులతో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, దృశ్య మాధ్యమం ద్వారా, కలుసుకున్నారు.   వర్చువల్ ఈవెంట్ పార్టిసిపేషన్ లింక్, ఫేస్‌-బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి వివిధ సామాజిక మాధ్యమాలకు చెందిన వేదికల ద్వారా వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఇంతకుముందు హెచ్.ఐ.వి., క్షయ, తలసేమియా బారిన పడి, కోలుకున్న ముగ్గురు యోధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ వ్యాధులకు వ్యతిరేకంగా వారు కొనసాగించిన పోరాటంలో, భారత ప్రభుత్వ పథకాలు వారికి సహాయపడి, ఎలా మద్దతు ఇచ్చాయో, తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. 

దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా యువత పాల్గొన్నందుకు, కేంద్ర ఆరోగ్య మంత్రి, తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ,  "స్వతంత్ర భారతదేశంలో యువత శక్తిని గుర్తించి, పెంపొందించిన మొదటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు యువత కోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు  'ఖేలో ఇండియా' కార్యక్రమం వంటి అనేక పథకాలు, సంస్థలను ప్రారంభించారు.  ఎప్పుడైనా యువత ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు, వారు దానిని తప్పక  సాధిస్తారు.  టి.బి. రోగుల్లో ఎక్కువ మంది చిన్న వయసు వారు ఉన్నారు.  గ్రామాల్లో టీ.బీ. రోగులు ఉండకూడదని ఆయా గ్రామాల యువత గట్టిగా నిర్ణయించుకుంటే, వారు తప్పక దాన్ని సాధిస్తారు." అని పేర్కొన్నారు.  అవగాహన కల్పించడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ, రక్త దాన శిబిరాలను నిర్వహిస్తున్న అన్ని ఎన్.జి.ఓ.లు మరియు సి.ఎస్.ఓ.లను ఆయన అభినందించారు.

75వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" లో ఆయన మాట్లాడుతూ,  "భారతదేశంలోని యువతరం, వచ్చే 25 సంవత్సరాల్లో తాము సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనీ, స్వాతంత్య్ర శతాబ్ది సంవత్సరంలో నూతన భారత నిర్మాణంలో చురుకుగా పాల్గొనాలనీ, భారత ప్రధానమంత్రి కోరారు." అని తెలియజేశారు.  టీ.బీ.ని తొలగించడం, హెచ్.ఐ.వి. వ్యాప్తి నివారణకు కృషి వంటి రెండు కార్యకలాపాల ద్వారా దేశం కోసం పనిచేయడం, రక్షణ దళాలలో చేరడంతో సమానమని, శ్రీ మాండవీయ యువతకు ఉద్భోదించారు. అందరికీ మంచి ఆరోగ్యాన్ని సాధించడంలో కలిసి పనిచేస్తామని దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ, దేశంలోని యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చేసి, నిర్ణయాత్మక మార్గాలను అందించడానికి ప్రభుత్వం నిరంతరం ఎలా కృషి చేస్తోందో వివరించారు. ఇటీవలి జాతీయ విద్యా విధానం భారతదేశాన్ని "గ్లోబల్-నాలెడ్జ్-సూపర్-పవర్‌" గా మారుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. "సాధికారత కలిగిన యువత మన పౌరులకు ఆరోగ్యకరమైన మరియు అర్థవంతమైన జీవితాన్ని అందించాలనే మా లక్ష్యాన్ని నెరవేరుస్తుంది.  సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మూడవది, అందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును అందించడం." అని ఆమె పేర్కొన్నారు. 'ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్' పునరుజ్జీవనం పొందిన ఇండియా 2.0 యొక్క శక్తిని మరియు సామర్థ్యాన్ని ఆవిష్కరిస్తుందని ఆమె పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో - కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, శ్రీ రాజేష్ భూషణ్;  కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి, శ్రీ అలోక్ సక్సేనా;   కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి, శ్రీమతి ఆర్తి అహుజా తో పాటు,   కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. 

 

*****



(Release ID: 1745364) Visitor Counter : 262