ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మానసిక ఆరోగ్య సేవల అందుబాటు పెంపు

Posted On: 10 AUG 2021 1:43PM by PIB Hyderabad

డిప్రెషన్‌ సహా మానసిక రుగ్మతలను నయం చేయడానికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 1982 నుంచి 'జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని' (ఎన్ఎంహెచ్‌పీ) అమలు చేస్తోంది. దీని కింద, 'జాతీయ ఆరోగ్య మిషన్'లో (ఎన్‌హెచ్‌ఎం) భాగంగా, 'జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం' (డీఎంహెచ్‌పీ) అమలు కోసం రాష్ట్రాలు/యూటీల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఆయా ప్రభుత్వాలకు సాంకేతిక, ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. డీఎంహెచ్‌పీ అమలు ఉద్దేశాలు:

i. నివారణ, ప్రచారం, దీర్ఘకాలిక నిరంతర సంరక్షణ సహా మానసిక ఆరోగ్య సేవలను వివిధ స్థాయుల్లో, జిల్లా ఆరోగ్య సేవల పంపిణీ వ్యవస్థ వరకు అందించడం
ii. ఆత్మహత్యల నివారణ సేవలు, పని ప్రాంతపు ఒత్తిడి నిర్వహణ, జీవన నైపుణ్యాల శిక్షణ, పాఠశాలలు & కళాశాలల్లో కౌన్సెలింగ్ అందించడం
iii. మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం మౌలిక సదుపాయాలు, ఉపకరణాలు, సిబ్బంది పరంగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచడం
iv. సామాజిక అవగాహన, మానసిక ఆరోగ్య సేవల పంపిణీలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం
 
    మానసిక ఆరోగ్య సేవల అందుబాటును మెరుగుపరిచే ఉద్దేశ్యంతో, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలోనే మానసిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆయుష్మాన్ భారత్-హెచ్‌డబ్ల్యూసీ పథకం కింద, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో భాగంగా, మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను సేవల ప్యాకేజీకి అనుసంధానించారు.  మానసిక, నాడీ సంబంధ, సబ్‌స్టాన్స్‌ యూజ్‌ డిజార్డర్స్‌పై (ఎంఎన్‌ఎస్) కార్యాచరణ మార్గదర్శకాలు ఆరోగ్య కేంద్రాల (హెచ్‌డబ్ల్యుసీ) స్థాయిలో, ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలో విడుదలయ్యాయి. ఈ మార్గదర్శకాల ద్వారా, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాథమిక స్థాయిలో మానసిక ఆరోగ్య సేవలు అందుతున్నాయి.

    కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డా.భారతి ప్రవీణ్‌ పవార్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు వెల్లడించారు.

***


(Release ID: 1744397)
Read this release in: English , Urdu , Bengali , Punjabi