హోం మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో
72వ బృందం ఐ.పి.ఎస్ ప్రొబేషనర్ల శిక్షణ ముగింపు కవాతు
ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్;
ప్రధాని పిలుపు- ‘దేశానికే ప్రాముఖ్యం.. సదా ప్రాథమ్యం’తోపాటు కేంద్ర హోంమంత్రి ప్రబోధించిన చైతన్యపూరిత పోలీసింగ్ స్ఫూర్తి గురించి మీకు బాగా తెలుసు... వారి అంచనాలు-ఆకాంక్షలను మీరు అందుకోగలరని నేను కచ్చితంగా భావిస్తున్నాను;
దేశాన్ని సమైక్యంగా ఉంచడంలో భారత పోలీస్ సర్వీస్ అధికారుల పట్టుదల... అంకితభావం... నిజాయితీ... సహకారాలకు హోంశాఖ సహాయమంత్రి అభినందన;
కవాతులో పాల్గొన్న 114 మంది యువ ప్రొబేషనర్లలో 33 మంది మహిళలు;
తొలి రెండు అగ్రస్థానాలూ మహిళా అధికారుల కైవసం; రాజస్థాన్ కేడర్‌కు చెందిన కుమారి రంజీతాశర్మకు ఉత్తమ ఆల్ రౌండ్ ఐపీఎస్ ప్రొబేషనర్ పురస్కారం... ప్రధానమంత్రి అధికార దండం - హోంశాఖ మంత్రి రివాల్వర్ ప్రదానం;
కవాతులో నేపాల్.. భూటాన్.. మాల్దీవ్స్.. మారిషస్
పోలీసు శాఖల నుంచి మొత్తం 34 మంది విదేశీ ప్రొబేషనర్లు
Posted On:
06 AUG 2021 2:07PM by PIB Hyderabad
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లో ఇవాళ ఇండియన్ పోలీసు సర్వీస్ (ఐపీఎస్) 72వ బృందం ప్రొబేషనర్ల శిక్షణ ముగింపు కవాతు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ శ్రీ అతుల్ కర్వాల్, ఇతర సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ నిత్యానంద రాయ్ మాట్లాడుతూ- “మనసులోని మాటను నిర్భయంగా వెల్లడించే ఆత్మనిబ్బరంగల అఖిలభారత సర్వీసు లేకపోతే ఐకమత్యం చెడుతుంది... సమైక్య భారతానికి తావులేదు” అన్న భారతదేశపు ఉక్కుమనిషి, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మాటలను ఉటంకించారు. ఈ నేపథ్యంలో దేశాన్ని సమైక్యంగా ఉంచే దిశగా భారత పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారుల పట్టుదల, అంకితభావం, నిజాయితీ, సహకారాలను అభినందిస్తున్నానని హోంశాఖ సహాయమంత్రి పేర్కొన్నారు. వీటన్నిటికీ దీటుగా క్షేత్రస్థాయిలో నాయకత్వం వహించడమేగాక ఎలాంటి పరిస్థితుల్లోనూ సత్యంవైపు నైతిక వైఖరిని అనుసరించగల స్థైర్యంతో ముందుకు సాగాలని వారికి సూచించారు. ప్రధాని పిలుపునిచ్చిన మేరకు “దేశానికే ప్రాముఖ్యం.. సదా ప్రాథమ్యం” ప్రబోధానికి కట్టుబడి ఉండాలని శ్రీ నిత్యానంద రాయ్ సూచించారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి ప్రబోధించిన చైతన్య నిండిన పోలీసింగ్ స్ఫూర్తి గురించి వారికి బాగా తెలుసునని, ఆ ఇద్దరు నాయకుల అంచనాలు-ఆకాంక్షలను ప్రొబేషనర్లు అందుకోగలరన్న విశ్వాసం తనకున్నదని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలో పొందుపరచిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రం విలువలకు అనుగుణంగా పోలీసులు చట్ట పరిరక్షకులుగా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పేర్కొన్నారు. సత్యంవైపు నిలిచే సామర్థ్యంతోపాటు పారదర్శకత, నిజాయితీ, అణకువ, సాహసం, అంకితభావం, సమష్టి కృషితోనే ఈ లక్ష్యం సాధ్యంకాగలదని స్పష్టం చేశారు. పోలీసు శాఖకు నిజమైన నాయకులుగా ఎదగాలంటే వారి విలువలు, దృక్పథం, వ్యక్తిత్వం, ప్రవర్తన తదితరాలు అత్యున్నత స్థాయిలో ఉండాలని పేర్కొన్నారు. అకాడమీలో వృత్తిగత సామర్థ్యాలను పెంపొందించుకున్న నేపథ్యంలో పరివర్తనాత్మక నాయకత్వాన్ని అందించాలని పిలుపునిచ్చారు.
ప్రజలతో చక్కని సంబంధాల దిశగా సామాజిక పోలీసింగ్ వైపు చురుగ్గా కృషిచేయాలని శ్రీ రాయ్ చెప్పారు. ఎటువంటి చర్యలకు శ్రీకారం చుట్టినా, వాటిని సామాజికంగా మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. మన సమాజంలో మహిళలు, పిల్లలపై నేరాలు నేటికీ ఆందోళనకరంగానే ఉన్నాయని, వీటిని అరికట్టడం వారి ప్రధాన కర్తవ్యంలో కీలక భాగమని ఆయన స్పష్టం చేశారు. తమ కిందిస్థాయి సిబ్బందిలోని పురుషులు, మహిళలందరికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఏడాదికి కనీసం 100 గంటలపాటు శిక్షణ ఇవ్వాలని శ్రీ రాయ్ సూచించారు. తమ దిగువస్థాయి పోలీసు సిబ్బంది సామర్థ్యాలను మెరుగుపరచనిదే అసాధారణ ఫలితాలు సాధించే అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రవాదం, తిరుగుబాట్లు, మతతత్వం, మత ఛాందసవాదం, వామపక్ష తీవ్రవాదం, సైబర్ నేరాలు, కుట్రలు-కుతంత్రాల వంటివాటిని దేశం నేడు ఎదుర్కొంటున్నదని హోంశాఖ సహాయమంత్రి చెప్పారు. ఇటువంటి ముప్పుల నుంచి ఈ గొప్ప దేశాన్ని రక్షించే కీలక బాధ్యతలను యువ పోలీసు అధికారులు సమర్థంగా నిర్వర్తించగలరని ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రితోపాటు పౌరులందరూ విశ్వసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా జాతి భద్రత కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసు అధికారులు, సిబ్బందికి దేశం రుణపడి ఉందని శ్రీ రాయ్ అన్నారు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల నడుమ పోలీసులు కూడా ‘ముందువరుస యోధులుగా’ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని ఆయన అన్నారు. కరోనాపై యుద్ధంలో భాగంగా 2,000 మంది సిబ్బంది ప్రాణత్యాగం చేశారని, విధుల్లో వారి అంకితభావం, చిత్తశుద్ధిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
యూనిఫాం ధరించిన ప్రతి అధికారి జీవితంలోనూ శిక్షణ ముగింపు కవాతు ఒక గర్వకారణ అంశమని హోంశాఖ సహాయమంత్రి అన్నారు. జాతి సేవలోకి తొలి అడుగు వేసేముందు విజయసాధన, గౌరవాలను సదా గుర్తుకు తెచ్చే మధుర క్షణాలు ఇవేనని పేర్కొన్నారు. ఈ కవాతులో 33 మంది మహిళా పోలీసు అధికారులు కూడా పాల్గొనడాన్ని ఆయన ప్రస్తావించారు. భారత పోలీసు సర్వీసులో వారు సాధించిన విజయాలపై అభినందనలు తెలిపారు. మరింతమంది మహిళలు ఈ సేవలో ప్రవేశించేందుకు ముందుకొస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో సవాళ్లతో కూడిన శిక్షణ అంకాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ప్రొబేషనర్లందరికీ శ్రీ రాయ్ అభినందనలు తెలిపారు. అలాగే జ్ఞాపికలు, పతకాలు సాధించినవారిని కూడా మంత్రి అభినందించారు. యువ పోలీసు అధికారులు తమ ఆదర్శాలు, ఆశయాలకు అనుగుణంగా నైపుణ్య ప్రమాణాలను నిలబెట్టుకోగలరని హోంశాఖ సహాయ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దేశవాసులంతా గర్వించే విధంగా భారత రాజ్యాంగంలో పొందుపరచిన విలువలను పాటించాలని ఆకాంక్షించారు.
రాయల్ భూటాన్ పోలీస్, మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్, మారిషస్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీస్ సర్వీస్‌లకు చెందిన విదేశీ ప్రొబేషనర్లు కూడా ఈ కవాతులో పాల్గొనడం గురించి తెలుసుకుని ఎంతో సంతోషించానని శ్రీ నిత్యానంద రాయ్ చెప్పారు. ఈ చిరస్మరణీయ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతున్నానని, ఈ శిక్షణ కాలంలో ఏర్పడిన స్నేహ సంబంధాల తోడ్పాటుతో మన దేశాల మధ్య సంబంధబాంధవ్యాలు మరింత పటిష్ఠం కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కవాతులో మొత్తం 144 మంది ఐపీఎస్ ప్రొబేషనర్లు పాల్గొనగా, వారిలో 33 మంది మహిళా అధికారులు ఉన్నారు. ఈ ఏడాది తొలి రెండు అగ్రస్థానాలనూ మహిళా అధికారులే కైవసం చేసుకున్నారు. వీరిలో అత్యుత్తమ ఆల్ రౌండ్ ఐపీఎస్ ప్రొబేషనర్ పురస్కారానికి ఎంపికైన రాజస్థాన్ కేడర్ అధికారి కుమారి రంజీతాశర్మకు ప్రధానమంత్రి అధికార దండం - హోం మంత్రి రివాల్వర్‌ను హోంశాఖ సహాయమంత్రి ప్రదానం చేశారు. అలాగే రెండో స్థానంలో నిలిచిన తమిళనాడు కేడర్ అధికారి కుమారి శ్రేయా గుప్తా ‘భువనానంద మిశ్రా స్మారక ట్రోఫీ’ని అందుకున్నారు. కాగా, మొత్తం 34 మంది విదేశీ ప్రొబేషనర్లలో నేపాల్ నుంచి 10 మంది, రాయల్ భూటాన్ పోలీస్ నుంచి 12 మంది, మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ నుంచి 7 మంది, మారిషస్ పోలీస్ ఫోర్స్ నుంచి 5 మంది వంతున ఈ కవాతులో పాల్గొన్నారు.
***
(Release ID: 1743262)
Visitor Counter : 232