మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కౌమారవ్యక్తుల న్యాయ -(జువెనైల్ జస్టిస్ , కేర్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ) సవరణ బిల్లు 2021ను ఆమోదించిన పార్లమెంటు
ఈ చట్టం సజావుగా అమలుచేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్‌లకు అధికారాలు
కనీస శిక్ష ప్రస్తావించని, ఏడు సంవత్సరాలకు పైబడిన జైలుశిక్ష గరిష్ఠంగా కలిగిన నేరాలు, లేదా కనీస శిక్ష 7 సంవత్సరాలకంటే తక్కువ కలిగిన నేరాలను తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు.
సిడబ్ల్యుసి సభ్యుడి నియామకానికి సంబంధించిన అర్హతను పునర్ నిర్వచించడం జరిగింది. నాణ్యమైన సేవలు అందించగలిగిన, ఇందుకు సంబంధించి తగిన సమర్ధత, సమగ్రత కలిగిన వారిని నియమిస్తారు.
Posted On:
28 JUL 2021 6:54PM by PIB Hyderabad
కౌమార వ్యక్తుల న్యాయ (సంరక్షణ, బాలల రక్షణ) సవరణ బిల్లు 2021 , కౌమార వ్యక్తుల చట్టం 2015ను సవరించేందుకు నిర్దేశించినది. దీనిని రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. ఈ బిల్లును ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టింది. దీనిని లోక్‌సభ 24-03-2021న ఆమోదించింది.
ఈ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర మహిళా శిశు అభివృధ్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరాని, ప్రస్తుత వ్యవస్థలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బాధిత బాలల సంరక్షణ, భద్రతకు సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్‌లకు బాధ్యతలు అప్పగించవలసిన పరిస్థితులు ఏర్పడినట్టు తెలిపారు. భారతీయ బాలలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిచ్చేందుకు పార్లమెంటుకుగల నిబద్ధతను ఆమె గుర్తుచేశారు.
ఈసవరణ ల ప్రకారం, జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని సెక్షన్ 61 కింద దత్తత స్వీకారానికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసే అధికారాన్ని, అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌లు, జిల్లామేజిస్ట్రేట్‌లకు అప్పగించింది. సత్వరం ఇందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, జవాబుదారిత్వం పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం కింద జిల్లా మేజిస్ట్రేట్ ఆందోళన కర పరిస్థితులలో ఉన్న బాలల సంరక్షణకు అనుకూలంగా వివిధ చర్యలు తీసుకునేందుకు జిల్లా మేజిస్ట్రేట్‌కు అధికారాలు అప్పగించడం జరిగింది. సవరించిన చట్టం ప్రకారం, బాలల సంరక్షణ సంస్థ జిల్లా మేజిస్ట్రేట్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న అనంతరం రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. జిల్లా మేజిస్ట్రేట్ జిల్లా బాలల సంరక్షణ యూనిట్లు, బాలల సంక్షేమ కమిటీలు, జువెనైల్ జస్టిస్ బోర్డులు, ప్రత్యేక జువెనైల్ పోలీస్ యూనిట్లు, బాలల సంరక్షణ సంస్థలు తదితరాల పనితీరును స్వతంత్రంగా అంచనా వేయాల్సి ఉంటుంది.
సిడబ్ల్యుసి సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతా ప్రమాణాలను పునర్ నిర్వచించారు. సిడబ్ల్యుసి సభ్యులను అనర్హులుగా ప్రకటించేందుకు ప్రాతిపదికకు సంబంధించిన అంశాలు కూడా పొందుపరిచారు. తగిన సమర్ధులు, నాణ్యమైన సేవలు అందించగలవారిని సిడబ్ల్యుసి సభ్యులుగా నియమించడానికి వీటిని చేర్చారు.
ప్రస్తుతం ఈ చట్టం కింద బాలలకు సంబంధించి చట్టపరమైన కేసుల విషయంలో మూడు కేటగిరీలను నిర్వచించడం జ రిగింది. అవి స్వల్ప, తీవ్ర, అత్యంత హేయమైన నేరాలు. కొన్ని నేరాలు ఈ మూడింటిలో ఏ కేటగిరీ కిందకూ రావు. కనీస శిక్షను సూచించని, ఏడు సంవత్సరాల గరిష్ఠ శిక్ష కలిగిన నేరాలు, లేదా కనీస శిక్ష ఏడు సంవత్సరాల లోపు కలిగిన నేరాలను ఈ చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు
ఈ చట్టానికి సంబంధించిన వివిధ ప్రొవిజన్ల అమలులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి , ఈ ఇబ్బందులను తొలగించేందుకు తగిన సవరణలు తీసుకురావడం జరిగింది. 2015 జువెనైల్ జస్టిస్ ( కేర్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ )యాక్ట్ 2015 కు సంబంధించి అన్వయంలో ఎదురైన ఇబ్బందులు తొలగించడానికి, అలాగే కొన్ని ప్రొవిజన్లకు సంబంధించిన పరిధిపై స్పష్టతకు సవరణలు తీసుకురావడం జరిగింది.
***
(Release ID: 1740105)
Visitor Counter : 644