సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

భారతదేశానికి 39 వ ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది


తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లోని పాలంపెట్ వద్ద ఉన్న రుద్రేశ్వర ఆలయం (రామప్ప ఆలయం) యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది

प्रविष्टि तिथि: 25 JUL 2021 7:46PM by PIB Hyderabad

మరో మైలురాయి సాధనలో భారత్‌ ముందంజలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌కు సమీపంలో ములుగు జిల్లాలోని పాలంపేట వద్ద ఉన్న రుద్రేశ్వర ఆలయాం (రామప్ప ఆలయం అని కూడా పిలుస్తారు) యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఈ రోజు యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 44 వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రామప్ప ఆలయం 13 వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతం. దాని వాస్తుశిల్పి రామప్ప పేరు మీద 2019 సంవత్సరానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశానికి నామినేషన్‌గా ప్రభుత్వం ప్రతిపాదించింది.

'ప్రపంచ వారసత్వ ప్రదేశంగా  కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయం, భారతదేశంలోని తెలంగాణ. బ్రావో!' అంటూ యునెస్కో ఈ రోజు ఒక ట్వీట్‌లో ప్రకటించింది.

కాకతీయ రామప్ప ఆలయాన్ని యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడంపై ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అద్భుత ఆలయ సముదాయాన్ని సందర్శించి, దాని గొప్పతనాన్ని అనుభవించాలని ఆయన ప్రజలను కోరారు.

యునెస్కో చేసిన ట్వీట్‌పై స్పందించిన ప్రధాని;

"అద్భుతం! అందరికీ, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు.

దిగ్గజ రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం యొక్క అద్భుతమైన నైపుణ్యానికి ప్రతీక. ఈ ప్రఖ్యాత ఆలయ సముదాయాన్ని సందర్శించి, దాని గొప్పతనం గురించి మొదటి అనుభవాన్ని పొందాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. "


ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ గుర్తింపును ప్రదానం చేసినందున కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మార్గదర్శకత్వం మరియు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ సమీపంలో ములుగు జిల్లాలోని పాలంపేట వద్ద ఉన్న రుద్రేశ్వర ఆలయం (రామప్ప ఆలయం అని కూడా పిలుస్తారు).

'తెలంగాణ వరంగల్ లోని పాలంపేట వద్ద ఉన్న రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపును అందజేసిందని తెలియజేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. దేశం తరపున ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరఫున గౌరవనీయ ప్రధాని మార్గదర్శకత్వం మరియు మద్దతుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ' అని జి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) బృందంతో పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.