మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అందరికీ సమాన విద్య అవకాశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు

Posted On: 22 JUL 2021 2:47PM by PIB Hyderabad

6 నుంచి 14 ఏళ్ల వయస్సున్న ప్రతి చిన్నారికి సమీప పాఠశాలలో ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని "చిన్నారులకు ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం (ఆర్‌టీఈ) - 2009" ప్రభుత్వాన్ని నిర్దేశిస్తోంది. కరోనా సమయంలో పిల్లలందరి చెంతకు విద్యను చేర్చేందుకు కేంద్ర విద్యాశాఖ వివిధ చర్యలు తీసుకుంది. వారి ప్రాంతం లేదా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా, ఎస్సీ/ఎస్టీలతో సహా ప్రతి వర్గానికి చెందిన విద్యార్థులకు ఈ చర్యలు అందుబాటులోకి వచ్చాయి.

    విద్యను బహుళ విధానాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు, డిజిటల్/ఆన్‌లైన్/ఆన్ ఎయిర్ విద్యకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఏకీకృతం చేసే లక్ష్యంతో 'పీఎమ్‌ఈవిద్య' పేరిట సమగ్ర విధానాన్ని ప్రారంభించాం. దీక్ష (ఆన్‌లైన్), స్వయం (ఆన్‌లైన్), స్వయంప్రభ (టీవీ), దూరదర్శన్, ఎయిర్‌ నెట్‌వర్కులు సహా ఇతర టీవీ ఛానెళ్ల ద్వారా బహుళ పద్ధతుల్లో విద్యను పొందేందుకు అన్ని రకాల డిజిటల్ విధానాలు ఈ కార్యక్రమం ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇంకా, వివిధ పద్ధతుల ద్వారా నిరంతర విద్యను కొనసాగించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 'ప్రగ్యత' మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇంటర్‌నెట్ అనుసంధానం లేని లేదా తక్కువ బ్యాండ్‌విడ్త్‌తో ఇంటర్‌నెట్‌ అందుబాటులో లేని పరిస్థితులుంటే, ఇంటర్నెట్‌పై ఆధారపడని దూరదర్శిని, ఆకాశవాణి వంటి వేదికల ద్వారా ఈ వనరులు అందుబాటులోకి వచ్చాయి. 1 నుంచి 12 తరగతులు చదివే; పరికరాలు ఉన్న, లేని పిల్లలకు విద్యను అందించేందుకు ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్‌ రూపొందించాం. వీటితో పాటు; విద్యార్థుల ఇళ్ల వద్దకు అందించిన కమ్యూనిటీ రేడియో, వర్కుషీట్లు & పాఠ్య పుస్తకాలు, చిన్నారుల ఇళ్ల వద్దకు ఉపాధ్యాయులు, కమ్యూనిటీ తరగతులు, టోల్ ఫ్రీ నంబర్లు, శ్రవణ విద్య కోసం ఎస్‌ఎంఎస్‌ ఆధారిత అభ్యర్థనలు, ఎడ్యుటైన్మెంట్ కోసం రేడియోల ద్వారా స్థానిక విద్య వంటి వనరులను ఉపయోగించాం. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్న చర్యలు "ఇండియా రిపోర్ట్ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ జూన్ 2020"లో ఉన్నాయి. ఈ క్రింది లింక్‌ ద్వారా ఆ వివరాలు పొందవచ్చు:
https://www.education.gov.in/sites/upload_files/mhrd/files/India_Report_Digital_Education_0.pdf.

    కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.
 

*****(Release ID: 1737727) Visitor Counter : 110