ఆర్థిక మంత్రిత్వ శాఖ

పిఎస్‌బిల పోటీ పరీక్షను స్థానిక భాషల్లో ఐబిపిఎస్‌ నిర్వహించడంపై వివరణ ఇచ్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

Posted On: 13 JUL 2021 5:30PM by PIB Hyderabad

భారత రాజ్యాంగం 22 భాషలను గుర్తించినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకు ( పిఎస్‌బి)ల క్లరికల్ ఉద్యోగాలకు  ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబిపిఎస్)  పోటీ పరీక్షను ఇంగ్లీష్ , హిందీ భాషల్లో మాత్రమే నిర్వహించడంపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. అన్ని స్థానిక భాషల్లో బ్యాంకింగ్  పరీక్షలను నిర్వహిస్తామంటూ కేంద్ర ఆర్థిక  శాఖ మంత్రి 2019లో చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఈ వార్తలు ప్రచురితం అయ్యాయి. 

అయితే, ఆర్ధిక శాఖ మంత్రి చేసిన ప్రకటన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు (ఆర్‌ఆర్‌బి) మాత్రమే వర్తిస్తుందని ఆర్ధిక మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్న లక్ష్యంతో ఆర్‌ఆర్‌బి ల ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I ఉద్యోగాల  భర్తీకి  ఇంగ్లీష్, హిందీలతో పాటు కన్నడ, కొంకణితో సహా   13 భాషల్లో పోటీ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం 2019లో నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. 

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ గ్రేడ్ ఉద్యోగాల భర్తీకి స్థానిక/ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్షలను నిర్వహించాలంటూ వస్తున్న డిమాండ్ ను పరిశీలించడానికి ఒక కమిటీ ని ఏర్పాటు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వివరించింది. అన్ని అంశాలను పరిశీలించి కమిటీ తన నివేదికను 15 రోజుల్లో ఆర్థిక  మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. కమిటీ సిఫార్సులు అందేంతవరకు పరీక్షల నిర్వహణకు ఐబిపిఎస్ చేపట్టిన ప్రక్రియ ను నిలిపి వేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

 

****


(Release ID: 1735243) Visitor Counter : 200