ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గుజరాత్ లోని భావ్‌నగర్ సర్ తఖ్తాసింజి ఆసుపత్రిలో 2 పిఎస్‌ఎ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ
ఈ ప్లాంట్ తో ఆసుపత్రిలో రానున్న 20 సంవత్సరాల వరకు ఆక్సిజన్ కొరత ఏర్పడదు : శ్రీ మాండవీయ
ప్రజల భాగస్వామ్యంతో "మొత్తం సమాజం" స్ఫూర్తితో కోవిడ్ నుంచి ప్రతి ఒక్కరిని రక్షించడానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
23,000 కోట్ల రూపాయల కోవిడ్ ప్యాకేజీ ద్వారా రానున్న ఆరు నెలల్లో సమగ్ర ప్రణాళిక మరియు సామర్ధ్య మెరుగుదల కార్యక్రమాల అమలు : శ్రీ మాండవీయ
Posted On:
12 JUL 2021 1:48PM by PIB Hyderabad
గుజరాత్ లోని భావ్‌నగర్ సర్ తఖ్తాసింజి ఆసుపత్రిలో 2 పిఎస్‌ఎ ఆక్సిజన్ ప్లాంట్లను ఈ రోజు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ వర్చువల్ విధానంలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ సమక్షంలో ప్రారంభించారు. ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు 1000 ఎల్‌పిఎం సామర్థ్యం గల రెండు ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లను, రాగి పైపింగ్ నెట్‌వర్క్, అగ్నిమాపక వ్యవస్థ మరియు ఆటోమేటిక్ ఆక్సిజన్ సోర్స్ చేంజోవర్ సిస్టమ్ వంటి అనుబంధ సౌకర్యాలు కూడా మంత్రి ప్రారంభించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, జలమార్గాలు మరియు షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి శ్రీ శాంతను ఠాకూర్, కేంద్ర పర్యాటక మరియు ఓడరేవు, నౌకారవాణా మరియు జలమార్గాల సహాయ మంత్రి శ్రీపద్ యెస్సో నాయక్ పాల్గొన్నారు.
సర్ తఖ్తాసింజి ఆసుపత్రిలో కల్పించిన సౌకర్యాలను భావనగర్ ప్రజలకు మంత్రి అంకితం చేశారు. ఇటీవల ప్రారంభించిన ఇటువంటి సౌకర్యాలు సంక్షోభ సమయాల్లో దేశానికి సహాయపడతాయని ఆయన అన్నారు. దేశాన్ని కోవిడ్ బారి నుంచి రక్షించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజల భాగస్వామ్యంతో "మొత్తం సమాజం" స్ఫూర్తితో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కోవిడ్ -19 దశ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలకు ప్రజలు పూర్తిగా సహకరించారని అన్నారు. లాక్ డౌన్ సమయంలో అమలు చేసిన ఆంక్షలను పాటించిన ప్రజలు కోవిడ్ అనుగుణ ప్రవర్తనతో సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యాధి నివారణకు సహకరించారని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అతి తక్కువ కాలంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 4000 మెట్రిక్ టన్నుల నుంచి 12,000 మెట్రిక్ టన్నులకు పెంచగలిగామని మాండవీయ అన్నారు.
కోవిడ్ -19ని పూర్తిగా ఎదుర్కొని దానిని నివారించి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శ్రీ మాండవీయ స్పష్టం చేశారు. కోవిడ్ రెండవ దశలో ఆక్సిజన్ సరఫరా, ఆస్పత్రుల్లో పడకల లభ్యత, ఔషధాల సరఫరా లాంటి అంశాల్లో ఎదురైన సమస్యలను గుర్తించి లోపాలను సరిచేశామని మంత్రి అన్నారు. అత్యవసర సమయాల్లో అవసరమైన మందులను కొనుగోలు చేయడానికి ప్రతి జిల్లాలో తగినన్ని నిధులు అందుబాటులో ఉంచామని అన్నారు. కోవి-19 అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి 23,000 కోట్ల రూపాయల ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి అన్నారు. పిల్లలకు పూర్తి ఆరోగ్య సంరక్షణ అందించడానికి అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు.ఆరోగ్యపరమైన సంక్షోభం తలెత్తినప్పుడు వినియోగించడానికి కేంద్ర రాష్త్ర స్థాయిల్లో అదనంగా నిల్వలను సిద్ధం చేస్తున్నామని అన్నారు. రానున్న ఆరు నెలల కాలంలో సమగ్ర ప్రణాళికను అమలు చేస్తూ సామర్ధ్య పెంపుదల కార్యక్రమాలను అమలు చేస్తామని మంత్రి వివరించారు.
గుజరాత్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్ తఖ్తాసింజి ఆసుపత్రిలో సామాజిక బాధ్యత కార్యక్రమంలో దీన్‌దయాల్ పోర్ట్ ట్రస్ట్ రెండు మెడికల్ ఆక్సిజన్ పిఎస్‌ఎ యూనిట్లను 2.53 కోట్ల రూపాయల ఖర్చుతో నెలకొల్పింది. ఇక్కడ నెలకొల్పిన పిఎస్ఎ ఆక్సిజన్ జనరేటర్ యూనిట్ ఒక్కొక్కటి నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతి యూనిట్ ద్వారా 5-6 బార్ ప్రెజర్ వద్ద గంటకి 60,000 లీటర్లు మొత్తం 1,20,000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. దీనిని కోవిడ్ తో సహా అన్ని రకాల చికిత్సల కోసం వచ్చే వారికి ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థ వల్ల సిలిండర్లను తరచుగా నింపవలసిన అవసరం లేకుండా ఆసుపత్రికి అంతరాయం లేకుండా ఆక్సిజన్ సరఫరా అవుతుంది.
పిఎస్ఎ ఆక్సిజన్ జనరేషన్ యూనిట్ నిరంతర పీడన శోషణ నిర్జలీకరణ ప్రక్రియ ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది.
పోర్టు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజీవ్ రంజన్,భావ్‌నగర్ ఎంపి డాక్టర్ భారతిబెన్ ధీరూభాయ్ షియాల్, భవనగర్ మేయర్ శ్రీమతి కీర్తి దానిధారియా, జిల్లా పంచాయతీ అధ్యక్షులు మరియు గుజరాత్ ప్రభుత్వ సీనియర్ అధికారులు వర్చువల్ విధానంలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1734846)
Visitor Counter : 217