పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీ జ్యోతిరాదిత్య సింధియాకు పదవీ బాధ్యతలు అప్పగించిన - శ్రీ హర్దీప్ ఎస్. పురి


సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన - జనరల్ వి.కె. సింగ్

Posted On: 09 JUL 2021 3:43PM by PIB Hyderabad

పౌర విమానయాన శాఖ మంత్రిగా, శ్రీ జ్యోతిరాదిత్య మాధవ్ రావు సింధియాకు, పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గృహ, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పురి, ఈ రోజు పదవీ బాధ్యతలు అప్పగించారు.   ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, శ్రీ సింధియా, సామాజిక మాధ్యమంలో ఒక ట్వీట్ చేస్తూ, “శ్రీ హర్దీప్ ఎస్. పురి నుండి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉంది. నా విధులను శ్రద్ధతో నిర్వర్తించాలనీ, ఆయన చేపట్టిన మంచి పనులను కొనసాగించాలని నేను నిశ్చయించుకున్నాను.” అని పేర్కొన్నారు.

గతంలో, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా 2007-2009 నుండి కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి గా బాధ్యతలు నిర్వర్తించారు.  అదేవిధంగా, 2009 నుండి 2012 వరకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ తరువాత, ఆయన, 2012 నుండి 2014 వరకు విద్యుత్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) గా పనిచేశారు.  మధ్యప్రదేశ్ నుంచి లోక్‌సభకు ఆయన, నాలుగుసార్లు ఎన్నికయ్యారు.  కాగా, రాజ్యసభ సభ్యునిగా, ఆయన, ఇప్పుడు, మొదటి సారి వ్యవహరిస్తున్నారు.   శ్రీ సింధియా ఆర్ధిక శాఖ; విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ; స్థాయి సంఘం కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు.  అదే విధంగా, ఆయన, విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడల శాఖల స్థాయీ సంఘాలలో సభ్యుడుగా;  అంచనాలు, ఫిర్యాదులు, హక్కులపై కమిటీలలో సభ్యుడుగా;  దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల బృందం సభ్యుడిగా కూడా వ్యవహరించారు. 

ఇక, విద్యార్హతల విషయానికి వస్తే, శ్రీ సింధియా హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిక శాస్త్రంలో డిగ్రీ తో పాటు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్  లో మాస్టర్స్ (ఎం.బి.ఏ) కూడా చేశారు.

పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా, జనరల్ (రిటైర్డ్) డాక్టర్ విజయ్ కుమార్ సింగ్ ఈ ఉదయం, బాధ్యతలు స్వీకరించారు.  2014 మే నెలలో లోక్‌ సభ కు ఎన్నికైన తరువాత శ్రీ వి.కె. సింగ్ భారత ప్రభుత్వంలో అనేక బాధ్యతలు నిర్వహించారు.  2019 మే నెలలో, శ్రీ సింగ్ తిరిగి లోక్ సభకు ఎన్నికయ్యారు.  కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

 


(Release ID: 1734520)