మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఉన్న‌త విద్యారంగం, సాంకేతిక మ‌రియు వృత్తి విద్యారంగంలో భాగ‌స్వామ్యాన్ని పెంచ‌డానికి వీలుగా బ్రిక్స్ దేశాల నిర్ణ‌యం.


విద్యార్థుల‌, అధ్యాప‌కుల కార్య‌కలాపాల నిర్వ‌హ‌ణ. ట్విన్నింగ్, జాయింట్ డిగ్రీల‌కుప్రోత్సాహం.

విద్యారంగంలో పూర్తిస్థాయి సామ‌ర్థ్యాల‌ను వెలికి తీయ‌డానికి వీలుగా బ‌హుళ పాక్షిక స‌హ‌కార ప్రాధాన్య‌త‌ను చాటిన శ్రీ సంజ‌య్ ధోత్రే.

భార‌త‌దేశం త‌న‌ ఆన్‌ లైన్ విద్యారంగంలో డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాల విస్త‌ర‌ణ‌ను వేగ‌వంతం చేసిందని స్ప‌ష్టం చేసిన శ్రీ సంజ‌య్ ధోత్రే.

ఆన్ లైన్ విద్యారంగ‌పై బ్రిక్స్ దేశాల విద్యా మంత్రుల విర్చువ‌ల్ స‌మావేశం. అనుభ‌వాల‌ను పంచుకున్న స‌భ్య దేశాలు.

Posted On: 06 JUL 2021 6:22PM by PIB Hyderabad

ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌పై ఐదు బ్రిక్స్ దేశాల‌కు చెందిన విద్యాశాఖ మంత్రులు విర్చువ‌ల్ సంత‌కాలు చేశారు.  
ఉన్న‌త విద్యారంగం, సాంకేతిక మ‌రియు వృత్తి విద్యారంగంలో విద్యాప‌రంగాను, ప‌రిశోధ‌న ప‌రంగాను భాగ‌స్వామ్యాన్ని పెంచ‌డానికిగాను బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసుకున్న విర్చువ‌ల్ స‌మావేశంలో ఈ సంత‌కాలు జ‌రిగాయి. భార‌త‌దేశం నిర్వ‌హిస్తున్న 13వ బ్రిక్స్ దేశాల శిఖ‌రాగ్ర స‌మావేశం నేప‌థ్యంలో బ్రిక్స్ దేశాల విద్యాశాఖ మంత్రుల‌కు సంబంధించిన 8వ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డిజ‌టిల్‌, సాంకేతిక ప‌రిష్కారాల‌ద్వారా అంద‌రికీ అందుబాటులో వుండేలా నాణ్య‌మైన విద్య‌నందించ‌డానికి, ప‌రిశోధ‌న‌, విద్యారంగ భాగస్వామ్యాన్ని పెంచ‌డంపైనా విద్యామంత్రులు చ‌ర్చ‌లు చేశారు. 


ఈ అంశానికి సంబంధించి స‌భ్య‌దేశాలు త‌మ‌కున్న విజ్ఞానాన్ని బ‌లోపేతం చేసుకోవాల‌ని, నూత‌న విజ్ఞానంకోసం కృషి చేయాల‌ని అంగీక‌రించాయి. త‌ద్వారా మ‌రిన్ని చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి కుదురుతుంద‌ని తెలిపాయి. స‌భ్యదేశాలు త‌మ విజ్ఞానాన్ని పంచుకోవడానికి , ఉత్త‌మ విధానాల‌ను ఇచ్చిపుచ్చుకోవ‌డానికి వీలుగా వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని కూడా నిర్ణ‌యించాయి. సెమినార్లు, విధాన‌ప‌ర‌మైన చ‌ర్చ‌లు, నిపుణుల‌తో సంప్ర‌దింపులు మొద‌లైన విధానాల ద్వారా ఈ ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించాయి.   


విద్యారంగంలోను, ప‌రిశోధ‌నా రంగంలోను భాగస్వామ్యాల‌ను పెంచుకోవ‌డానికిగాను స‌భ్య‌దేశాల మ‌ధ్య‌న  విద్యార్థులు, అధ్యాప‌కుల రాక‌పోక‌లు సులువుగా సాగ‌డానికిగాను ఈ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. అంతే కాదు బ్రిక్స్ దేశాల్లోని ఉన్నత విద్యారంగ సంస్థ‌ల మ‌ధ్య‌న ఉమ్మ‌డి, ద్వంద్వ డిగ్రీల‌ను ప్రోత్స‌హించాల‌ని స‌భ్య దేశాల మంత్రులు అంగీక‌రించారు. ప్ర‌తి బ్రిక్స్ దేశంలో సాంకేతిక మ‌రియు వృత్తిప‌ర‌మైన శిక్ష‌ణ‌, విద్య‌ను ప్ర‌ధాన‌మైన అంశంగా మంత్రులు గుర్తించారు. ఈ అంశంలో భాగ‌స్వామ్యాన్ని నిబ‌ద్ద‌త‌తో ప్రోత్సాహించాల‌ని నిర్ణ‌యించారు. 


కేంద్ర విద్యాశాఖ స‌హాయ మంత్రి శ్రీ సంజ‌య్ ధోత్రే ఈ స‌మాశానికి అధ్య‌క్ష‌తవ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఏర్ప‌డిన స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డానికిగాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులు, క‌మ్యూనిటీలు, ప్ర‌భుత్వాలు అంద‌రూ క‌లిసి దృఢ‌మైన విద్యా వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. విద్యారంగంలోని సంపూర్ణ సామ‌ర్థ్యాన్ని ఉప‌యోగించుకోవ‌డానికి వీలుగా బ‌హుళ‌పాక్షిక స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. ముఖ్యంగా ఈ స‌హ‌కారం బ్రిక్స్ దేశాల మ‌ధ్య‌న వుండాల‌ని అన్నారు. 
బ్రిక్స్ దేశాలకు సంబంధించి విద్యారంగ అభివృద్ధి ల‌క్ష్యాల‌ను అందుకోవాలంటే ఆన్ లైన్ విద్య‌, డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌లు చాలా ముఖ్యంగా మారాయ‌ని శ్రీ ధోత్రే అన్నారు. ఈ నేప‌థ్యంలో అంద‌రికీ నాణ్య‌మైన, స‌మాన స్థాయిలో విద్య అందుబాటులోకి తేవాలంటే సాంకేతికత ప్రాధాన్య‌త‌ను గుర్తించ‌డం చాలా ముఖ్య‌మ‌ని అన్నారు. 


విద్యారంగంపై కోవిడ్ 19 ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డానికిగాను బ్రిక్స్ దేశాలు అమ‌లు చేసిన విధానాలు, చ‌ర్య‌ల గురించి ఈ సంద‌ర్భంగా ఆయా దేశాల విద్యామంత్రులు పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త‌దేశం త‌ర‌ఫున మాట్లాడిన శ్రీ ధోత్రే .. భార‌త‌దేశం అమ‌లు చేసిన పిఎం ఈ వైద్య‌, స్వ‌యం ఎంఓఓసీల వేదిక‌, స్వ‌యం ప్ర‌భ టీవీ, దీక్ష‌, విర్చువ‌ల్ ప్ర‌యోగ‌శాల‌ల విధానాల గురించి మాట్లాడారు. 
డిటిజ‌ట్ మ‌రియు సాంకేతిక ప‌రిష్కారాల ద్వారా అంద‌రికీ నాణ్య‌మైన, స‌మాన‌స్థాయి విద్య‌ను అందించ‌డంపైనా శ్రీ ధోత్రే మాట్లాడారు. డిజిట‌ల్ అంత‌రాల‌ను తొల‌గించ‌డంద్వారా ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవాల్సి వుంటుంద‌ని ఆయ‌న సూచించారు. దేశంలోని సామాజికంగా ఆర్ధికంగా వెన‌క‌బ‌డిన వ‌ర్గాల‌కు డిజిట‌ల్ వ‌న‌రులు అందుబాటులోకి తేవాల్సి వుంటుంద‌ని ఆయ‌న అన్నారు. అందుకోసం భార‌త‌దేశం డిజిట‌ల్ ఇండియా క్యాంపెయిన్ , ఎఫ్ టి టి హెచ్ కనెక్టివిటీ ద్వారా కృషి చేస్తోంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 


ఈ స‌మావేశానికంటే ముందు జూన్ 29న  బ్రిక్స్ దేశాల విశ్వ‌విద్యాల‌యాల నెట్ వ‌ర్క్ కు చెందిన అంత‌ర్జాతీయ పాల‌నా బోర్డు స‌మావేశమైంది. ఈ అంశానికి సంబంధించిన ప్ర‌గ‌తిని స‌మీక్షించింది. ఈ నేప‌థ్యంలో విద్యారంగానికి సంబంధించిన బ్రిక్స్ సీనియ‌ర్ అధికారుల స‌మావేశం జులై 2న‌ జ‌రిగింది. దీనికి ఉన్న‌త విద్యారంగానికి చెందిన కార్య‌ద‌ర్శి శ్రీ అమిత్ ఖ‌రే అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ స‌మావేశంలో యుజిసి అధ్య‌క్షులు శ్రీ డిపి సింగ్‌, ఏఐసిటి అధ్య‌క్షులు శ్రీ అనిల్ స‌హ‌స్ర‌బుదే, ఐఐటి డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ సుభాసిస్ చౌద‌రి పాల్గొన్నారు. 



(Release ID: 1733278) Visitor Counter : 161