కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
2022 మార్చి 31 వరకు ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన పొడిగింపుకు కాబినెట్ ఆమోదం
Posted On:
30 JUN 2021 4:15PM by PIB Hyderabad
ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద లబ్ధిదారులు నమోదు చేసుకోవటానికి మరో తొమ్మిది నెలలపాటు అదనపు సమయం ఇవ్వటానికి ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కాబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. దీనివలన ఈ రోజుతో పూర్తయ్యే ఈ పథకం ప్రయోజనం వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుంది. దీంతో గతంలో అంచనా వేసిన 58.5 లక్షల మందికి ఉపాధికి బదులు 71.8 లక్షలమందికి ఉపాధి లభిస్తుంది. 18.06.2021 నాటికి 21.42 లక్షలమంది లబ్ధిదారులకు 79,577 సంస్థల ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద రూ.902 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది.
ఇప్పుడు పొడిగించిన అదనపు కాలపరిమితితో సహా ఈ పథకం కింద 2022 మార్చి 31 వరకు రూ.22,098 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఈ పథకాన్ని ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ( ఇ పి ఎఫ్ వో) ద్వారా అమలు చేస్తున్నారు. దీనివలన వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న యజమానుల మీద ఆర్థిక భారాన్ని కూడా తగ్గించినట్టవుతుంది. ఆ విధంగా వారు మరింత మందికి ఉపాధి కల్పించేలా ప్రోత్సగించినట్టవుతుంది.
ఇపిఎఫ్ వో లో రిజిస్టర్ చేసుకున సంస్థలు కొత్తగా నియమించుకున్న ఉద్యోగుల జీతాలు నెలకు రూ. 15 వేల లోపు ఉంటే ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద లబ్ధిపొందుతాయి. అదే విధంగా 2020 మార్చి 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఉద్యోగం కోల్పోయినవారికి కూడా ప్రయోజనం కలుగుతుంది.
ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన కింద భారత ప్రభుత్వం ఇపిఎఫ్ వో లో నమోదైన సంస్థల సంఖ్య ఆధారంగా అటు యజమాని వాటా, ఇటు ఉద్యోగి వాటా కలిపి వేతనాల్లో 24% మొత్తాన్ని లేదా ఉద్యోగి వాటా అయిన 12% మాత్రమే ఈ ఖాతాలో జమచేస్తుంది. ఈ పథకం మార్గదర్శకాలను సవివరంగా చూదాలనుకుంటే కార్మిక, ఉపాధి, ఇపిఎఫ్ వో మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో చూడవచ్చు.
ఆత్మనిర్భర్ భారత్ పాకేజ్ 3.0 లో భాగంగా ఆర్థికాభివిద్ధి లక్ష్యంగా, ఉపాధి కల్పనకోసం ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన ను ప్రకటించారు. దీనివలన దేశం మీద కోవిడ్ ప్రభావాన్ని బాగా తగ్గించటం సాధ్యమవుతుంది. అల్పాదాయవర్గాలవారి కష్టాలను తగ్గిస్తూ ఉద్యోగాలిచ్చేవారిని తిరిగి వ్యాపారాలు ప్రారంభించేట్టు ప్రోత్సహిస్తుంది.
(Release ID: 1731565)
Visitor Counter : 260