నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

వారణాసిలో పి.ఎం.కె.కె.ని సందర్శించిన కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండే

Posted On: 24 JUN 2021 11:11AM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మార వైరస్ సవాలును దీటుగా ఎదుర్కొనేలా, దేశంలోని లక్షకుపైగా కోవిడ్ యుద్ధవీరులతో నైపుణ్యాలు అధ్యయనం చేయించేందుకు, వారి నైపుణ్యాల స్థాయిని మెరుగుపరిచేందుకు ‘సానుకూల స్వల్పకాల కోర్సు’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మౌలిక నైపుణ్యాంశాలను బోధించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది జూన్ 18న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వారణాసిలోని ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాన్ని (పి.ఎం.కె.కె.ని) కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్.ప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే సందర్శించారు. అక్కడ శిక్షణ పొందుతున్నవారితో ముచ్చటించారు. వారు భవిష్యత్తులో చక్కని విజయాలు సాధించాలన్న ఆకాంక్షను కేంద్రమంత్రి వ్యక్తం చేశారు. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2021-06-22at18.04.25(1)5KII.jpeg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2021-06-22at18.04.25(2)47Q3.jpeghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2021-06-22at18.04.25PQSN.jpeg


  దేశంలోని 26 రాష్ట్రాల్లో ఉన్న 111 కేంద్రాల్లో ఈ శిక్షణా కార్యక్రమం మొదలైంది. ఈ శిక్షణా కేంద్రాల  ద్వారా వివిధ ప్రాంతాల్లోని ఆరోగ్య రక్షణ కేంద్రాల్లో సేవలందించేందుకు దాదాపు లక్షమంది నైపుణ్యం కలిగిన వారు త్వరలోనే అందుబాటులోకి వస్తారు. వివిధ రాష్ట్రాలనుంచి అందిన డిమాండ్ల మేరకు ఉద్యోగాల్లో ఉన్న సిబ్హబందికి ఈ కేంద్రాల్లో దశలవారీగా శిక్షణ అందిస్తారు. కోవిడ్-19 నియమ నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను అనుసరిస్తూ శిక్షణ నిర్వహిస్తారు. ఆరు రకాల ఈ స్వల్పకాల శిక్షణా కోర్సులను ఆరోగ్య రక్షణ రంగం నైపుణ్య మండలి (హెచ్.ఎస్.ఎస్.సి.) అతి తక్కువ వ్యవధిలో రూపొందించింది. ఆరోగ్య రక్షణ రంగానికి చెందిన నిపుణులతో హెచ్.ఎస్.ఎస్.సి. ఏర్పాటైంది. జాతీయ వొకేషనల్ విద్య, శిక్షణా మండలి (ఎన్.సి.వి.ఇ.టి.) ఆమోదంతో ఈ కోర్సులకు రూపకల్పన జరిగింది. 
  వారణాసిలోని పి.ఎం.కె.కె.ని సందర్శించిన సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ మహేంద్ర సింగ్ పాండే మాట్లాడుతూ,  కోవిడ్-19 దాడితో మనం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళ నేపథ్యంలో సిబ్బంది సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఈ స్వల్పకాల శిక్షణా కోర్సు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం ఒక ముందడుగని అన్నారు. “ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య రక్షణ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లోని యువతకు తగిన శిక్షణను అందిస్తాం. చెప్పారు. వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పౌరులకు మరింత మెరుగైన సహాయం అందించేలా  వారికి పటిష్టమైన శిక్షణ కల్పిస్తాం. మన వైద్యులపై, నర్సులపై పనిభారాన్ని తగ్గించడంలో, భవిష్యత్తులో యువతకు మరిన్ని మైరుగైన అవకాశాలను అందించడంలో ఈ శిక్షణ సహాయకారిగా ఉంటుందన్న విశ్వాసం  ఉంది.” అని ఆయన అన్నారు.
  కోవిడ్-19 వైరస్ పై పోరాటంలో ఎన్నో సేవలందిస్తున్న లక్ష మందికిపైగా ఆరోగ్య నిపుణులకు వారి  విధి నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు, వారి నైపుణ్యాల స్థాయిని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మౌలికమైన రక్షణ సహాయం, అత్యవసర రక్షణ సదుపాయం, ఆధునాతన చికిత్సా సదుపాయం, నమూనాల సేకరణలో సాయం, ఇంటివద్ద సంరక్షణ విధులు, వైద్య పరికరాలను అందించడం వంటి నూతన విధులకు కూడా ఈ శిక్షణ దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వల్పకాల శిక్షణ అనంతరం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, నమూనా సేకరణ కేంద్రాల్లో పనిచేసేలా   సిబ్బందికి మూడు నెలల ఉద్యోగ శిక్షణ కూడా ఉంటుంది. 
  శిక్షణ పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున యోగ్యతా ధ్రువీకరణ పత్రం ప్రదానం చేస్తారు. అలాగే స్టైపెండ్, రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా, భోజనం, వసతి సదుపాయం కూడా ఉంటాయి. శిక్షణకు ఎంపికైన వారికి వ్యాక్సినేషన్, పి.పి.ఇ. కిట్లు, ప్రయాణానికి పాస్.లు అందించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. శిక్షణలో నాణ్యత లక్ష్యంగా శిక్షణా కేంద్రాల్లో సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, శిక్షణా సామగ్రి వంటివన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. 
  కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం కోవిడ్.పై వివిధ రాష్ట్రప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు జరిపే పోరాటనికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. అలాగే వైద్యులు, నర్సులపై పనిభారాన్ని గణనీయంగా తగ్గించేందుకు దోహదపడుతుంది. 
  ఇప్పటికే అనుభవం సాధించిన ఆరోగ్య కార్యకర్తల నైపుణ్యాలను, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ( పి.ఎం.కె.వి.వై.) ధువీకరించిన అభ్యర్థుల నైపుణ్యాలను  మరింతగా మెరుగుపరిచేందుకు కూడా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ఏదైనా ఆరోగ్య రక్షణ కేంద్రంలో నియమితులయ్యే ముందుగానే వారి నైపుణ్యాల మెరుగుదలకు తగిన చర్యలు తీసుకొంటోంది. 

 


(Release ID: 1730030) Visitor Counter : 187