ఆర్థిక మంత్రిత్వ శాఖ
పన్నుల రంగ నిపుణులు, సంబంధిత ప్రతినిధులు, ఇన్ఫోసిస్ నిపుణులతో కేంద్ర ఆర్ధిక శాఖ సమావేశం
Posted On:
22 JUN 2021 8:05PM by PIB Hyderabad
ఆదాయ పన్ను శాఖకు సంబంధించిన పోర్టల్ నిర్వహణపై జూన్ 22వ తేదీన కేంద్ర ఆర్ధిక శాఖ సీనియర్ అధికారులకు, ఇన్ఫోసిస్ ప్రతినిధులకు మధ్యన సమావేశం జరిగింది.కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెవిన్యూశాఖ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్, సిబిడిటి ఛైర్మన్ శ్రీ జె.బి. మహాపాత్ర, సిబిడిటి సభ్యురాలు శ్రీమతి అను . జె.సింగ్ ఇంకా సిబిడిటికి చెందిన ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ నుంచి ఆ సంస్థ ఎండీ మరియు సిఇవో శ్రీ సలీల్ పరేఖ్, సివొవో శ్రీ ప్రవీణ్ రావు ఇంకా ఇతర ముఖ్యమైన ప్రతినిధులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు సంస్థలకు సంబంధించిన పన్నుల రంగ నిపుణులు పదిమంది ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.
ఆదాయపన్నుశాఖవారు ఎలక్ట్రానిక ఫైలింగ్ కు సంబంధించి పోర్టల్ వర్షన్ 2.0ను జూన్ నెల 7వ తేదీనుంచి ప్రారంభించారు. ఇది ప్రారంభమైనప్పటినుంచీ అనేక సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటూ వస్తోంది. దీనికి సంబంధించి పన్నులు చెల్లించే ప్రజలు, నిపుణులు, ఇతర సంబంధిత వ్యక్తులు తాము ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ఈ విషయం తెలియగానే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి స్వయంగా ఈ సమస్యను వెండర్ ఇన్ఫోసిస్ యాజమాన్యానికి తెలియజేశారు. అయినప్పటికీ సాంకేతిక సమస్యలు తొలగకపోవడంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీమతి సీతారామన్ పన్ను చెల్లింపుదారులైన ప్రజలకు సరైన సేవలు అందించడమే తమ ప్రధాన కర్తవ్యమని దీనికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశం ఏర్పాటుకోసం కృషి చేసిన ఐసిఏఐని ఆ సంస్థ అధ్యక్షుడు శ్రీ జంబుసారియాను ఆర్ధిక మంత్రి ప్రశంసించారు. అలాగే దీనికి సంబంధించి ఇ మెయిల్ ద్వారా సమాచారం పంపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
పోర్టల్ నిర్వహణకు సంబంధించి సేవలందిస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ వెంటనే ఈ సమస్యలను పరిష్కరించి ఇది వినియోగదారులకు అన్ని విధాలా ఉపయోగపడేలా చూడాలని కోరారు. కొత్త పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలపట్ల ఆమె తన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ 19 మహమ్మారి సమస్య వున్నప్పటికీ పన్ను చెల్లింపుదారులు సమయానికి పన్నులు చెల్లించడంపట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించి ఇన్ఫోసిస్ ప్రతినిధులు మాట్లాడుతూ అన్ని సాంకేతిక సమస్యలను తెలుసుకోవడం జరిగిందని వాటిని వెంట వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట నిజమేనని వారు అంగీకరించారు. తగిన వనరులను కేటాయించి వేగవంతంగా పని చేస్తున్నామని ఇప్పటికే కొన్ని సమస్యలను తొలగించామని వారు స్పష్టం చేశారు. నిర్దిష్ట కాలపరిమితిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఒకవారంలోపు అన్ని సమస్యలు తొలగిపోతాయని వారు అన్నారు. దీనికిసంబంధించిన అన్ని వివరాలను పబ్లిక్ డొమెయిన్ లో వుంచుతామని అన్నారు.
ఈ కార్యక్రమం తర్వాత ఆర్ధిక శాఖ సీనియర్ అధికారులు, ఇన్ఫోసిస్ ప్రతినిధులు మధ్యన మరొక ప్రత్యేక సమావేశం జరిగింది. సాంకేతిక సమస్యల పరిష్కారంపై వివరాణత్మకంగా చర్చించారు.
****
(Release ID: 1729954)
Visitor Counter : 243