ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆర్థిక పరిస్థితి పునరుద్ధరణకు సత్వర వ్యాక్సినేషన్ కీలకం!


మామూలు పరిస్థితులు నెలకొనేందుకు ఇది
అవసరమన్న డాక్టర్ వి.కె. పాల్

రోజూ కనీసం కోటి డోసుల వ్యాక్సినేషన్ లక్ష్యం: డాక్టర్ అరోరా.

వ్యాక్సినేషన్ విజయవంతం కావడానికి
ప్రజల భాగస్వామ్యమే కీలకం
“టీకాల లభ్యత సమస్యే కాదు, వచ్చే నెలకల్లా
అందుబాటులో 20-22కోట్ల డోసులు”

Posted On: 22 JUN 2021 9:31AM by PIB Hyderabad

   కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు అమలులోకి వచ్చిన తొలి రోజున భారతదేశంలో దాదాపు 81లక్షల డోసుల మేర టీకాలను అందించి వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించినట్టు  నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ తెలిపారు.

 

వేగంగా వ్యాక్సినేషన్  చేపట్టే భారత్ సామర్థ్యానికి ఇది సూచన

  రోజులు, వారాల తరబడి భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించడంలో భారతదేశపు సామర్థ్యాన్ని తొలిరోజు వ్యాక్సినేషన్ లెక్కలు సూచిస్తున్నాయని డాక్టర్ వి.కె. పాల్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్ (డి.డి. న్యూస్)తో ఆయన మాట్లాడుతూ,  "తగిన ప్రణాళికా రచన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కారణంగానే ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ సాధ్యమైంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉద్యమ తరహాలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం." అని ఆయన  అన్నారు.

 

“ధర్డ్ వేవ్ ఉంటుందా, ఉండదా? అన్నది మనచేతుల్లోనే ఉంది.”

  కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ, ఎక్కువ శాతం జనాభాకు వ్యాక్సినేషన్ అందించగలిగితే కోవిడ్ వైరస్ థర్డ్ వేవ్.ను ఆపివేయవచ్చని డాక్టర్ పాల్ అభిప్రాయపడ్డారు.  “కోవిడ్ నియంత్రణకు తగిన జాగ్రత్తలన్నీ పాటించి, మనమంతా వ్యాక్సినేషన్ తీసుకుంటే అసలు థర్డ్ వేవ్ ఎందుకు వస్తుంది? అసలు సెకండ్ వేవ్ కూడా రాని దేశాలు ప్రపంచంలో ఉన్నాయి.; కోవిడ్ వైరస్ కట్టడికి అవసరమైన జాగ్రత్తలన్నీ అనుసరిస్తే ఇప్పటి కాలం ఇలాగే గడిచిపోతుంది కదా!" ఆయన అన్నారు.


మామూలు పరిస్థితి నెలకొనాలంటే సత్వర వ్యాక్సినేషన్ ప్రక్రియే కీలకం

  భారత దేశంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కేలా చేయాలంటే, మామూలు కార్యకలాపాలన్నీ తిరిగి కొనసాగాలంటే వేగవంతంగా వ్యాక్సినేషన్ నిర్వహించడం చాలా ముఖ్యమని డాక్టర్ వి.కె. పాల్ స్పష్టం చేశారు. “మన దైనందిన కార్యకలాపాలను, సామాజిక జీవితాన్ని తిరిగి కొనసాగించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు, వాణిజ్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించి ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా కాపాడుకోవడమూ అవసరమే; వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టగలిగినప్పుడే మనం ఇవన్నీ చేయగలుగుతాం” అని అన్నారు.

 

“వ్యాక్సీన్లు ప్రాణాలకు రక్షణ,.. వ్యాక్సీన్ తీసుకోవడానికి ఇదే సరైన తరుణం”

   మన వ్యాక్సీన్లు సురక్థితమైనవి కావనుకోవడం చాలా తప్పు అని డాక్టర్ పాల్ అన్నారు. “మన వ్యాక్సీన్ల లాగే, ప్రపంచంలోని వ్యాక్సీన్లు అన్నీ అత్యవసర వినియోగానికి కావలసిన అధికారిక ఆమోదాన్ని కలిగి ఉన్నాయి. సమాజంలోని వివిధ వర్గాలవారు వాటిని తీసుకున్నారు. సెకండ్ వేవ్ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. కోవిడ్ వ్యాక్సీన్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం" అని ఆయన అన్నారు.
  వ్యాక్సినేషన్ ప్రక్రియలో తొలుత ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడంవల్ల సెకండ్ వేవ్ సందర్భంగా వారికి ఎలాంటి రక్షణ లభించిందో డాక్టర్ పాల్ వివరించారు. “సెకండ్ వేవ్ లో చాలా తక్కువ మంది ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు మాత్రమే వైరస్ సోకింది. అలా కాని పక్షంలో సెకండ్ వేవ్.తో మన ఆసుపత్రుల వ్యవస్థ యావత్తూ కుప్పకూలిపోయేది. వ్యాక్సీన్లతో రక్షణ లభిస్తుందనడానికి ఇదే సరైన పూచీ అని తెలుసుకోండి. ” అని అన్నారు. 


రోజూ కోటీ 25లక్షల డోసుల వ్యాక్సిన్ అందించే సామర్థ్యం భారత్.కు ఉంది.

  భారతదేశంలో చేపట్టిన వ్యాధినిరోధక వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్.టాగీ-ఎన్.టి.ఎ.జి.ఐ.) అధ్యక్షుడు డాక్టర్ ఎన్.కె. అరోరా కూడా ఈ ఇంటర్వ్యూలో పాలు పంచుకున్నారు. ఈ రోజున ఇంత భారీ స్థాయిలో వ్యాక్సీన్ డోసులు వేయడం గొప్ప విజయమని ఆయన అన్నారు. “ఈ రోజు మనం సాధించింది ఎంతో గొప్ప విజయం. రోజుకు కనీసం కోటిమందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నది మా లక్ష్యం. ప్రతి రోజూ కోటీ 25లక్షల డోసుల వ్యాక్సినేషన్.ను సునాయాసంగా నిర్వహించ గలిగేంత సామర్థ్యం మనకు ఉంది.” అని డాక్టర్ అరోరా అన్నారు.

  ప్రైవేటు రంగంనుంచి మంచి తోడ్పాటు లభించిన నేపథ్యంలో ఈ లక్ష్యాన్ని సాధించడం మనకు సాధ్యమేనని, సవరించిన మార్గదర్శక సూత్రాలు అమలులోకి వచ్చిన తొలిరోజునే ఇది రుజువైందని అరోరా అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో గతంలో కూడా భారతదేశం ఎలాంటి విజయం సాధించిందో ఆయన వివరించారు. “ఇది గతంలో జరగనిదేమీ కాదు. కేవలం వారం రోజుల్లోనే దాదాపు 17 కోట్లమంది చిన్నారులకు పోలియో టీకా మందును అందించాం. ఏదైనా చేయాలని దేశం నిర్ణయిస్తే, మనం దాన్ని సాధించ గలిగే స్థితిలో ఉన్నాం” అని డాక్టర్ అరోరా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలసికట్టుగా ముందుకు సాగితే దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ఎంత మెరుగ్గా పరిష్కరించగలమో తెలిపేందుకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఒక నిదర్శనంగా నిలవబోతోందని ఆయన అన్నారు.

 

వ్యాక్సినేషన్ ప్రక్రియపై సందేహాల నిర్మూలనలో ప్రజా భాగస్వామ్యం, అవగాహన కీలకం

  వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రబలుతున్న వదంతులను, అపోహలను తొలగించేందుకు ప్రజల భాగస్వామ్యం, ప్రజల్లో అవగాహన చాలా అవసరమని ఎన్.టాగీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. “వ్యాక్సినేషన్ గురించిన భయం పోవాలంటే, జన్ భాగీదారీ (ప్రజా భాగస్వామ్యం), జన్ జాగరణ్ (ప్రజల్లో అవగాహన) అనేవి  చాలా అవసరం. ఎలాంటి సంశయం లేకుండా ముందుకు వచ్చి వ్యాక్సీన్ వేయించుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది.” అని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై అవగాహనను పెంచేందుకు సన్నాహాలు కూడా పూర్తయ్యాయని, వ్యాక్సీన్లపై సంశయాలను పారదోలేందుకు ఆశా కార్యకర్తలు, కోవిడ్ పై పోరాట యోధులు అట్టడుగు గ్రామస్థాయిలో  ఇప్పటికే పని ప్రారంభించారని ఆయన అన్నారు.

 

“వ్యాక్సీన్ల సరఫరాకు ఎలాంటి సమస్యలూ ఉండవు”

వ్యాక్సీన్ల లభ్యతపై ఎలాంటి సమస్యలూ ఉండబోవని డాక్టర్ అరోరా హామీ ఇచ్చారు. “వచ్చే నెలలో మనకు 20నుంచి 22కోట్ల మేర వ్యాక్సీన్ డోసులు అందబోతున్నాయి” అని అన్నారు. దేశంలోని పర్వత ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలతో పాటుగా, ప్రతి మారు మూలకూ వ్యాక్సీన్లు చేరేందుకు వీలుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను విస్తరింపజేస్తున్నట్టు డాక్టర్ అరోరా చెప్పారు.


కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గడువులో మార్పు అవసరం లేదు. 

  కోవిషీల్డ్ వ్యాక్సీన్ రెండు డోసుల మధ్య గడువుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు డాక్టర్ అరోరా సమాధానమిస్తూ ఈ గడువును పెంచాలని అనిపించడం లేదన్నారు. “ఇందుకు సంబంధించి నేషనల్ వ్యాక్సీన్ ట్రాకింగ్ సిస్టమ్ కింద మేం సమాచారాన్ని సేకరిస్తున్నాం. వ్యాక్సీన్ల  సామర్థ్యం, రెండు డోసుల మధ్య గడువు, ప్రాంతాలవారీగా వాటి ప్రభావం, వైరస్ వేరియంట్లు వంటి అంశాలపై వాస్తవ సమాచారం ఆధారంగా పరిస్థితిని మధింపు చేస్తున్నాం. కోవిషీల్డ్ డోసుల మధ్య అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం అనిపించడం లేదు. ప్రతి డోసు ద్వారా ప్రజలకు గరిష్ట స్థాయిలో ప్రయోజనం అందాలన్నదే ప్రధాన సూత్రం. ప్రస్తుతం అందిస్తున్న డోసులు ప్రయోజనకరంగానే ఉన్నట్టు రుజువవుతోంది.” అని అన్నారు. అయితే, ఏదీ శిలాక్షరాల్లాగా శాశ్వతం కాబోదని కూడా అయన ఇదే సందర్భంలో వ్యాఖ్యానించారు.

 

***


(Release ID: 1729388) Visitor Counter : 288