సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రస్తుత కోవిడ్ మహమ్మారి ని దృష్టిలో ఉంచుకుని పింఛన్లు త్వరగా పంపిణీ చేయాలని బ్యాంకులను ఆదేశించిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ఈ చర్య వయోవృద్ధులకు “జీవన సౌలభ్యానికి” దారి తీస్తుంది

Posted On: 18 JUN 2021 6:29PM by PIB Hyderabad

వయోవృద్ధులు జీవన సౌలభ్యాన్ని కలగజేయాలని కోరే లక్ష్యంతో చేపట్టిన ఒక పెద్ద సంస్కరణ లో భాగంగా, ప్రస్తుత కోవిడ్ మహమ్మారి ని దృష్టిలో ఉంచుకుని పింఛన్లు త్వరగా పంపిణీ చేయాలని బ్యాంకులను ఆదేశించడం జరిగింది. పింఛనుదారుడు మృతిచెందిన సందర్భంలో, మరణించిన పింఛనుదారుల జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులను అనవసరమైన వివరాలు మరియు పత్రాలను కోరడం ద్వారా ఎటువంటి అసౌకర్యానికి గురి చేయకుండా, వారికి పింఛన్లు త్వరగా పంపిణీ చేయాలని కూడా, ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

కేంద్ర పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమ శాఖ జారీ చేసిన ఆదేశాల గురించి, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (డి.ఓ.ఎన్.ఈ.ఆర్) సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్); ప్రధానమంత్రి కార్యాలయం; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, విలేకరులకు వివరిస్తూ, పింఛనుదారుడు మృతి చెందిన సందర్భంలో, మరణించిన వారి కుటుంబ సభ్యులను అనవసరమైన వివరాలు మరియు పత్రాలు సమర్పించాలని, పింఛను పంపిణీ చేసే బ్యాంకులు కోరుతున్నట్లు, తమ శాఖ దృష్టికి వచ్చినట్లు, తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, పింఛనుదారులతో సహా అందరికీ జీవన సౌలభ్యం కల్పించాలనే లక్ష్యానికి కట్టుబడి ఉందనీ, అందువల్ల, ముఖ్యంగా మహమ్మారి సమయంలో, వృద్ధ పౌరులకు ఇటువంటి అసౌకర్యాలను నివారించాలనీ, ఆయన పేర్కొన్నారు.

పింఛన్లు పంపిణీ చేసే అన్ని బ్యాంకుల అధిపతులకు జారీ చేసిన ఒక ప్రకటనలో, మృతి చెందిన పింఛనుదారుని కుటుంబ సభ్యులను అనవసరంగా వేధించకుండా, మరణించిన పింఛనుదారుని మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా, వారి కుటుంబ పింఛను ప్రారంభించాలని ఆదేశించడం జరిగింది. ఒకవేళ పింఛనుదారుడు తన జీవిత భాగస్వామితో ఉమ్మడి బ్యాంకు ఖాతా కలిగి ఉంటే, కుటుంబ పింఛను ప్రారంభానికి ఒక సాధారణ లేఖ లేదా దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మృతిచెందిన పింఛనుదారునితో, అతని జీవిత భాగస్వామికి ఉమ్మడి బ్యాంకు ఖాతా లేని పక్షంలో, కుటుంబ పింఛను ప్రారంభం కావడానికి, ఇద్దరు సాక్షుల సంతకాలతో, ఫారం-14 అనే ఒక సాధారణ దరఖాస్తు సమర్పిస్తే సరిపోతుంది.

తాజా సూచనల గురించి, సంబంధిత అధికారులకు తెలియజేయడంతో పాటు, కుటుంబ పింఛన్ల కేసులను సానుభూతితో, కారుణ్య భావంతో పరిష్కరించడానికి వీలుగా, వారికి, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా, పింఛన్లు మరియు పింఛనుదారుల సంక్షేమ శాఖ (డి.ఓ.పి.పి.డబ్ల్యు) బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

పింఛనుదారుడు మృతిచెందిన తర్వాత కుటుంబ పింఛను దరఖాస్తును పరిష్కరించడంలో ఏదైనా అసౌకర్యం ఎదురైనప్పుడు, ఆ కుటుంబ సభ్యుడు సంప్రదించవలసిన, నోడల్ ఆఫీసర్ పేరు మరియు వారిని సంప్రదించడానికి అవసరమైన వివరాలను బ్యాంకు వెబ్‌-సైట్ లో ప్రముఖంగా పొందుపరచాలని కూడా ఆ ప్రకటనలో ఆదేశించారు. దీనితో పాటు, కుటుంబ పింఛను కేసుల మంజూరు పురోగతిపై ఆరు నెలలకు ఒకసారి నిర్ణీత విధానంలో పింఛను విభాగానికి ఒక నివేదిక సమర్పించవలసి ఉంటుంది.

పింఛనుదారులు, వయోవృద్ధులు మరియు వారి కుటుంబాల ప్రయోజనాల కోసం, ఇటీవల పింఛన్ల శాఖ చేపట్టిన ఇటువంటి అనేక వినూత్న సంస్కరణల్లో, ప్రస్తుత సంస్కరణ ఒక భాగంగా మనం గుర్తు చేసుకోవచ్చు.

 

****



(Release ID: 1728396) Visitor Counter : 257