రైల్వే మంత్రిత్వ శాఖ

ఆక్సిజన్ ఎక్స్‌ ప్రెస్‌లద్వారా జాతికి 32000 టన్నుల ‘ఎల్‌ఎంఓ’ సరఫరా


దక్షిణాది రాష్ట్రాలకు 17,600 టన్నులకుపైగా ‘ఎల్‌ఎంఓ’ చేరవేత
ఇప్పటిదాకా 443 ఆక్సిజన్‌ ఎక్స్‌ ప్రెస్‌ల ద్వారా ‘ఎల్‌ఎంఓ’ సరఫరా పూర్తి
నేటివరకూ 1830 ట్యాంకర్లతో ‘ఎల్‌ఎంఓ’ రవాణా ద్వారా
15 రాష్ట్రాలకు ఊరటనిచ్చిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు;

ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా తమిళనాడుకు 5,600 టన్నులకుపైగా ‘ఎల్‌ఎంఓ’;

తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‌.. కర్ణాటక రాష్ట్రాలకు 3,200; 4,000;

4100 టన్నుల మేర ‘ఎల్‌ఎంఓ’ రవాణా చేసిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు;

ఈ మేరకు మహారాష్ట్ర-614; ఉత్తర ప్రదేశ్‌-3797; మధ్యప్రదేశ్‌-656; ఢిల్లీ-5722; హర్యానా-2354; రాజస్థాన్‌-98;

కర్ణాటక-4149; ఉత్తరాఖండ్‌-320; తమిళనాడు-5674; ఆంధ్రప్రదేశ్‌-4036; పంజాబ్‌-225; కేరళ-513; తెలంగాణ-3255; జార్ఖండ్‌-38; అస్సాం-560 టన్నుల వంతున ప్రాణవాయువు చేరవేశాయి.

Posted On: 17 JUN 2021 6:18PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా వైద్యపరమైన ద్రవ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) రవాణాకు ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ, కొత్త పరిష్కారాలతో ముందడుగు వేసిన భారత రైల్వేశాఖ వివిధ రాష్ట్రాలకు ఎంతో ఊరటనిస్తూ ప్రాణవాయువును సకాలంలో చేరవేసింది. ఈ మేరకు ఆక్సిజన్‌ ఎక్స్‌ ప్రెస్‌లు జాతికి అందిస్తున్న సేవలో భాగంగా ఇప్పటివరకూ 32,000 టన్నులకుపైగా ‘ఎల్‌ఎంఓ’ను సరఫరా చేయడంద్వారా కొత్త మైలురాయిని అధిగమించాయి. తదనుగుణంగా నేటిదాకా మొత్తం 443 ఆక్సిజన్‌ ఎక్స్‌ ప్రెస్‌లు 1,830 ట్యాంకర్లతో 32,017 టన్నుల ప్రాణవాయువును దేశంలోని వివిధ రాష్ట్రాలకు చేరవేసి, లక్ష్యాన్ని పూర్తిచేయడమేగాక ఎంతో ఉపశమనం కలిగించాయి. ఇందులో ఒక్క దక్షిణాది రాష్ట్రాలకే 17,600 టన్నులకుపైగా ‘ఎల్‌ఎంఓ'ను సరఫరా చేయగా, తమిళనాడుకు 5,600 టన్నుల మేర అందించాయి. అలాగే తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‌.. కర్ణాటక రాష్ట్రాలకు 3,200; 4,000; 4100 టన్నుల మేర ‘ఎల్‌ఎంఓ’ను రవాణా చేశాయి. దేశవ్యాప్తంగా ప్రాణవాయువు సరఫరా సంబంధిత వివరాలు అందే సమయానికి 1 ట్యాంకర్లలో 78 టన్నుల ‘ఎల్‌ఎంఓ'తో మరో ఎక్స్‌ ప్రెస్‌ మార్గమధ్యంలో ఉంది.

   ఈ ఆక్సిజన్‌ ఎక్స్‌ ప్రెస్‌లు 54 రోజుల కిందట ఏప్రిల్‌ 24న మహారాష్ట్రలో 126 టన్నుల ‘ఎల్‌ఎంఓ’ను అందించడం ద్వారా తమ ప్రయాణం ప్రారంభించడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ప్రాణవాయువు కోసం విజ్ఞప్తి చేసిన రాష్ట్రాలకు వీలైనంత తక్కువ సమయంలో ఆక్సిజన్‌ సరఫరాను భారత రైల్వేశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అనుగుణంగా మొత్తం 15 రాష్ట్రాలు- ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, అస్సాంలకు ఆక్సిజన్‌ ఎక్స్‌ ప్రెస్‌లద్వారా ప్రాణవాయువు సరఫరాతో ఎంతో ఉపశమనం లభించింది. ప్రాణవాయువు సరఫరాకు సంబంధించి కడపటి సమాచారం అందేసరికి మహారాష్ట్రకు 614 టన్నులు; ఉత్తరప్రదేశ్‌కు దాదాపు 3797 టన్నులు, మధ్యప్రదేశ్‌కు 656 టన్నులు, ఢిల్లీకి 5722 టన్నులు, హర్యానాకు 2354 టన్నులు, రాజస్థాన్‌కు 98 టన్నులు, కర్ణాటకకు 4149 టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320 టన్నులు, తమిళనాడుకు 5674 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 4036 టన్నులు, పంజాబ్‌కు 225 టన్నులు, కేరళకు 513 టన్నులు, తెలంగాణకు 3255 టన్నులు, జార్ఖండ్‌కు 38 టన్నులు, అస్సాం రాష్ట్రానికి 530 టన్నుల చొప్పున ‘ఎల్‌ఎంఓ’ సరఫరా చేయబడింది.

   ఈ మేరకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఇప్పటివరకూ దేశంలోని 15 రాష్ట్రాల్లోగల సుమారు 39 నగరాలు/పట్టణాలకు ‘ఎల్‌ఎంఓ’ రవాణా చేయబడింది. రాష్ట్రాలవారీగా- లక్నో, వారణాసి, కాన్పూర్‌, బరేలీ, గోరఖ్‌పూర్‌, ఆగ్రా (ఉత్తరప్రదేశ్‌); సాగర్‌, జబల్‌పూర్‌, కట్నీ, భోపాల్‌ (మధ్యప్రదేశ్‌); నాగ్‌పూర్, నాసిక్, పూణే, ముంబై, సోలాపూర్ (మహారాష్ట్ర); హైదరాబాద్ (తెలంగాణ); ఫరీదాబాద్, గురుగ్రామ్ (హర్యానా); తుగ్లకాబాద్, ఢిల్లీ కంటోన్మెంట్‌, ఓఖ్లా (ఢిల్లీ); కోట, కనక్‌పడా (రాజస్థాన్‌); బెంగళూరు (కర్ణాటక); డెహ్రాడూన్‌ (ఉత్తరాఖండ్‌); నెల్లూరు, గుంటూరు, తిరుపతి, తాడిపత్రి, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌); ఎర్నాకుళం (కేరళ); తిరువళ్లూరు, చెన్నై, ట్యుటికోరిన్‌, కోయంబత్తూరు, మదురై (తమిళనాడు); భటిండా ఫిలౌర్ (పంజాబ్‌); కామరూప్‌ (అస్సాం); రాంచీ (జార్ఖండ్‌) వంటి నగరాలు/పట్టణాలు ఈ జాబితాలో ఉన్నాయి.

   ఆక్సిజన్ సరఫరాకు వీలున్న ప్రదేశాలుగల వివిధ మార్గాలను భారత రైల్వేశాఖ ముందుగానే గుర్తించింది. తదనుగుణంగా ఏ రాష్ట్రంలోనైనా అవసరం పడిన సందర్భంలో అక్కడికి ఆక్సిజన్‌ రవాణాకు సదా సన్నద్ధతతో ఉంది. కాగా, ‘ఎల్‌ఎంఓ’ తీసుకొచ్చేందుకు ఆయా రాష్ట్రాలు రైల్వేశాఖకు ట్యాంకర్లను సమకూరుస్తాయి. వీటిద్వారా దేశం నలుదిక్కులలో పలుచోట్లగల ఆక్సిజన్‌ ఉత్పాదక ప్రాంతాలు- పశ్చిమాన హాపా, బరోడా, ముంద్రా; తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుళ్‌ వంటి ప్రదేశాల నుంచి ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపి,  దాన్ని ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలకు సంక్లిష్ట రైలు మార్గాలద్వారా రకరకాల ప్రణాళికల ప్రాతిపదికన చేరవేస్తుంది.

   ప్రాణవాయువు అవసరాలను వీలైనంత త్వరగా తీర్చడం కోసం ఆక్సిజన్‌ రవాణా ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను నడపడంలో రైల్వేశాఖ ఎన్నడూ ఎరుగని సరికొత్త ప్రమాణాలు, మైలురాళ్లను సృష్టిస్తోంది. దూరప్రాంత మార్గాల్లో ఈ కీలకమైన రవాణా రైళ్ల సగటు వేగం అనేక సందర్భాల్లో 55 కిలోమీటర్లకన్నా ఎక్కువగా ఉంటోంది. అత్యంత ప్రాముఖ్యంగల హరిత కారిడార్‌లో వివిధ నిర్వహణ మండళ్ల బృందాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య కూడా 24 గంటలూ శ్రమిస్తూ నిర్దేశిత సమయానికి ఆక్సిజన్‌ గమ్యానికి చేరేవిధంగా కర్తవ్యం నిర్వర్తిస్తున్నాయి. వివిధ సెక్షన్ల నడుమ సిబ్బంది విధులు మారడం కోసం సాంకేతికంగా నిలపాల్సిన సమయాన్ని కేవలం 1 నిమిషం స్థాయికి తగ్గించడం విశేషం. మరోవైపు ఆక్సిజన్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు ఎక్కడా ఆగకుండా దూసుకెళ్లేందుకు వీలుగా ఆయా మార్గాలు సదా అందుబాటులో ఉంచబడుతున్నాయి. అదే సమయంలో ఇతర సరకు రవాణా రైళ్ల నిర్వహణకు భంగం కలగకుండా ఈ బాధ్యతను నెరవేరుస్తండటం విశేషం. సరికొత్త ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ల నిర్వహణ చురుకైన కసరత్తు మాత్రమేగాక, సంబంధిత గణాంకాలు కూడా ఎప్పటికప్పుడు నవీకరించబడుతున్నాయి. ఇక ట్యాంకర్లలో ప్రాణవాయువు నింపుతున్న నేపథ్యంలో ఈ రాత్రి మరికొన్ని ఆక్సిజన్‌ ఎక్స్‌ ప్రెస్‌లు బయల్దేరనున్నాయి.

 

***


(Release ID: 1728055) Visitor Counter : 189