భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం

"భారత్‌ కోసం ప్రాజెక్ట్‌ ఓ2"

Posted On: 13 JUN 2021 11:11AM by PIB Hyderabad

కరోనా రెండో దశలో, దేశవ్యాప్తంగా వైద్య ఆక్సిజన్‌ అవసరం పెరిగింది. భవిష్యత్తులో తగినంత ఆక్సిజన్‌ ఉండేలా చూసుకోవడానికి, ప్రస్తుత డిమాండ్‌కు తగ్గట్లుగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం తప్పనిసరిగా మారింది. వైద్య ఆక్సిజన్‌ డిమాండ్‌లో పెరుగుదలకు తగ్గట్లుగా దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం "భారత్‌ కోసం ప్రాజెక్ట్‌ ఓ2" పిలుపునిచ్చింది. 
 
    భారత్‌ కోసం ప్రాజెక్ట్‌ ఓ2 కింద, జియోలైట్స్ వంటి ముఖ్యమైన ముడి పదార్థాల జాతీయ స్థాయి సరఫరా, చిన్న ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, కంప్రెషర్ల తయారీ, ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్‌సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్ల వంటి తుది ఉత్పత్తులను నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఆక్సిజన్ అనుమతిస్తుంది. ఆక్సిజన్‌ స్వల్పకాలిక డిమాండ్‌ను తీర్చడమేగాక, దీర్ఘకాలిక అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడంపైనా కన్సార్టియం దృష్టి పెడుతుంది. భారతదేశ ఉత్పత్తిదారులు, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈల (ఫిక్కీ, ఎంఈఎస్‌ఏ వంటి వాటి భాగస్వామ్యంతో కూడినవి) నుంచి వచ్చే ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్‌సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్ల వంటి అత్యవసర ఉపకరణాల ఉత్పత్తిని ఒక నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, టాటా కన్సల్టింగ్‌ ఇంజినీర్స్‌, బెంగళూరు సీ-క్యాంప్‌, కాన్పూర్‌ ఐఐటీ, దిల్లీ ఐఐటీ, బాంబే ఐఐటీ, హైదరాబాద్‌ ఐఐటీ, భోపాల్‌ ఐఐఎస్‌ఈఆర్‌, పుణె వెంచర్‌ సెంటర్‌ సహా 40కిపైగా ఎంఎస్‌ఎంఈలు ఉత్పత్తి, సరఫరా కన్సార్టియంలో ఉంటాయి. 

    యూఎస్‌ఏఐడీ, ఎడ్వర్డ్స్ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్, క్లైమేట్ వర్క్స్ ఫౌండేషన్ వంటి సంస్థల నుంచి సీఎస్‌ఆర్‌ లేదా విరాళాలు సేకరించేందుకు ఈ కన్సార్టియం ప్రారంభమైంది. కన్సార్టియం విధుల్లో సాయపడేందుకు, సామాజిక బాధ్యతలో భాగంగా హోప్ ఫౌండేషన్, అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్, వాల్మార్ట్, హిటాచి, బీఎన్‌పీ పరిబాస్, ఎల్న్‌ఫోచిప్స్ ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు, వీపీఎస్‌ఏ/పీఎస్‌ఏ ప్లాంట్లను సేకరిస్తున్నాయి. కన్సార్టియంలోని ఉత్పత్తిదారుల కోసం జియోలైట్ వంటి ముడి పదార్థాల సేకరణకు ఆర్థిక సాయం చేయడానికి ఎన్‌ఎండీసీ లిమిటెడ్ అంగీకరించింది.
 
    ఈ ప్రాజెక్టుపై సమాచారం కావాలంటే 'industry-engagement@psa.gov.in'కు మెయిల్‌ చేయవచ్చు.

    వివిధ కొవిడ్‌ ప్రాజెక్టులపై మరిన్ని వివరాల కోసం 'https://www.psa.gov.in/innovation-science-bharat' పేజీని సందర్శించవచ్చు.
 

****(Release ID: 1726812) Visitor Counter : 33