పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
సాగర్ జిల్లాలోని బినా వద్ద ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన 200 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన - పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
చుట్టుపక్కల జిల్లా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అవసరాలను తీర్చగల ఆక్సిజన్ బాట్లింగ్ మరియు రీఫిల్లింగ్ ప్లాంట్ కు - శంకుస్థాపన
Posted On:
12 JUN 2021 5:17PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని సాగర్ జిల్లా బినా వద్ద తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మరియు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు ప్రారంభించారు. ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన 200 పడకల భారీ కోవిడ్-19 సంరక్షణ సౌకర్యాన్ని బి.పి.సి.ఎల్. కి చెందిన బినా చమురు శుద్ధి కర్మాగారం సమీపంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ అవసరమైన ఆక్సిజన్ ను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బి.పి.సి.ఎల్) యొక్క 100 శాతం అనుబంధ సంస్థ అయిన భారత్ ఒమన్ రిఫైనరీస్ లిమిటెడ్ (బి.ఓ.ఆర్.ఎల్) సంస్థ అందిస్తోంది.
ఈ సందర్భంగా, టీకాలు వేసే కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఫ్రంట్-లైన్ కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వడానికి బి.ఓ.ఆర్.ఎల్. ఏర్పాట్లు చేసింది. రిఫైనరీలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు మరియు ఫ్రంట్-లైన్ కార్మికులందరికీ టీకాలు ఇవ్వడం కోసం బి.ఓ.ఆర్.ఎల్. ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇద్దరు ప్రముఖులు, ఈ సందర్భంగా, ఆక్సిజన్ బాట్లింగ్ మరియు రీఫిల్లింగ్ ప్లాంట్ కు కూడా శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంటు, రోజుకు 25 టన్నుల ఆక్సిజన్ (రోజుకు, 2000 ఆక్సిజన్ సిలిండర్లు) నింపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చుట్టుపక్కల జిల్లా ఆసుపత్రుల ఆక్సిజన్ అవసరాన్ని ఇది తీర్చగలదు.
ఈ కార్యక్రమంలో - మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు శ్రీ గోపాల్ భార్గవ, శ్రీ భూపేంద్ర సింగ్, శ్రీ గోవింద్ సింగ్ రాజ్‌పుత్, డాక్టర్ అరవింద్ సింగ్ భడోరియాలతో పాటు, సాగర్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు శ్రీ రాజ్‌బహదూర్ సింగ్; బినా శాసన సభ్యుడు శ్రీ మహేష్ రాయ్ ప్రభృతులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, బినా రిఫైనరీ, ఈ ఆసుపత్రికి, రోజుకు 90 శాతం స్వచ్ఛత కలిగిన 10 టన్నుల ఆక్సిజన్ వాయువుతో పాటు, రోజుకు 4 లక్షల లీటర్ల చొప్పున తాగునీటిని కూడా సరఫరా చేస్తుందని, తెలియజేశారు. బి.పి.సి.ఎల్. ప్రయత్నాలను ఆయన ప్రశంసిస్తూ, కోవిడ్-19 ను సమర్థవంతంగా ఎదుర్కోడానికి వీలుగా ఆసుపత్రి సంసిద్ధతను పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి బినా రిఫైనరీ కట్టుబడి ఉందని, పేర్కొన్నారు.
ఈ కరోనా మహమ్మారిని నియంత్రించడానికి రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణ వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి బృందాన్ని శ్రీ ప్రధాన్ అభినందిస్తూ, మధ్యప్రదేశ్ఎం లోని 50 జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఒక శాతం కన్నా తక్కువగా నమోదయ్యిందని, తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారిని, శతాబ్దానికి ఒకసారి వచ్చే సంక్షోభంగా ఆయన పేర్కొంటూ, కోవిడ్-19 రెండవ దశ వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడుతూ, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ప్రాణాలు కాపాడటానికి భారత ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, వివరించారు. కోవిడ్ నుండి రక్షణ పొందడానికి, టీకా ఉత్తమ ఎంపిక అని, తద్వారా, దేశంలో మూడవ దశ వ్యాప్తిని నివారించవచ్చునని, ఆయన పేర్కొన్నారు. "అందరికీ ఉచిత టీకా" కార్యక్రమం జూన్, 21వ తేదీ నుండి ప్రారంభం కానుంది. త్వరలో దేశంలో టీకాల కొరత ఉండదని, ఆయన హామీ ఇచ్చారు.
*****
(Release ID: 1726686)
Visitor Counter : 188