నీతి ఆయోగ్

యాస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్స్ ప్రో్గ్రామ్ ను ప్ర‌శంసించిన యుఎన్ డిపి నివేదిక‌. ప్ర‌పంచంలోని ఇత‌ర ప్రాంతాలు ఆద‌ర్శంగా తీసుకోవ‌చ్చ‌ని సిఫార్సు చేసిన నివేదిక‌.

Posted On: 11 JUN 2021 7:21PM by PIB Hyderabad

జిల్లాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన యాస్పిరేష‌న‌ల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ( ఏడిపి) చ‌క్క‌టి ఫ‌లితాల‌ను ఇస్తోంద‌ని తెలియ‌జేస్తూ ఐక్య‌రాజ్య‌స‌మితికి చెందిన డెవ‌ల‌ప్ మెంట్ ప్రోగ్రామ్ వారి నివేదిక ప్రశంస‌లు గుప్పించింది. ప‌లు కార‌ణాల‌వ‌ల‌న స్థానికంగా అభివృద్ధి లోపించి, సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి వివ‌క్ష‌కు గురైన ప్రాంతాల్లో ఈ ఏడిపి కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల‌కు యుఎన్ డిపి సిఫార‌సు చేసింది. 
చాలా సంవ‌త్స‌రాలుగా వామ‌ప‌క్ష తీవ్ర‌వాదంబారిన ప‌డిన జిల్లాల్లోను, గ‌తంలో తీవ్రంగా నిర్ల‌క్ష్యానికి గురైన జిల్లాల్లోను ఏడిపి మంచి ఫ‌లితాల‌నిస్తోంద‌ని, ఆయా జిల్లాల్లో చేప‌ట్టిన చ‌ర్య‌ల కార‌ణంగా మ‌రింత అభివృద్ధి క‌నిపిస్తోంద‌ని, ఇదంతా ఈ మూడేళ్ల‌లోన సాధ్య‌మైంద‌ని నివేదిక పేర్కొంది. అక్క‌డ‌క్క‌డా స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని దాటుకొని వెళ్లార‌ని వెన‌క‌బ‌డిన జిల్లాల్లో ప్ర‌గ‌తిబాట‌లు వేయ‌డంలో ఏడిపి చ‌క్క‌గా ప‌ని చేసింద‌ని నివేదిక వివ‌రించించింది. 
యుఎన్ డిపి ఇండియా విభాగ ప్ర‌తినిధి షోకో నోడా నీతి ఆయోగ్ ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ రాజీవ్ కుమార్ ను, సిఇవో అమితాబ్ కాంత్ ను క‌లిసి ఈ నివేదిక ప్ర‌తుల‌ను  అంద‌జేశారు. ఏడిపి కి సంబంధించి చేప‌ట్టాల్సిన మ‌రిన్ని మెరుగైన సూచ‌న‌ల్ని ఈ నివేదిక‌లో పొందుప‌రిచారు. ఏడిపికి సంబంధించి అందుబాటులో వున్న స‌మాచారాన్ని విశ్లేషించ‌డంద్వారా, ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములైన వారంద‌రినీ ఇంట‌ర్వ్యూ చేయ‌డంద్వారా ఈ నివేదిక‌ను రూపొందించారు. 

ఏడిపికి సంబంధంచి ఐదు ముఖ్య‌మైన రంగాల్లో జ‌రిగిన ప్ర‌గ‌తిని ఈ నివేదిక విశ్లేషించింది. ఆరోగ్యం మ‌రియు పోష‌ణ‌, వ్య‌వ‌సాయం మ‌రియు నీటి వ‌న‌రులు, ప్రాధ‌మిక సౌక‌ర్యాలు, నైపుణ్యాభివృద్ధి, అంద‌రికీ ఆర్ధిక సుస్థిర‌త‌...ఈ ఐదు రంగాలకు సంబంధించి ఏడిపి చేప‌ట్టిన జిల్లాల్లో ప్ర‌గ‌తి వేగ‌వంత‌మైంద‌ని నివేదిక పేర్కొంది. ఆరోగ్యం మ‌రియు పోష‌ణ‌, విద్య‌, కొంత‌మేర‌కు వ్య‌వ‌సాయం మ‌రియు నీటి వ‌న‌రుల రంగాల్లో భారీ పెరుగుద‌ల న‌మోదైంద‌ని నివేదిక విశ్లేషించింది. మిగ‌తా రంగాల్లో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తి క‌నిపించిన‌ప్ప‌టికీ బ‌లోపేతం కావ‌డానికి మ‌రింత అవ‌కాశ‌ముంద‌ని నివేదిక పేర్కొంది. 
 ఏడిపి చేప‌ట్టిన జిల్లాల‌కు, ఏడిపి చేప‌ట్ట‌ని జిల్లాల‌కు మ‌ధ్య‌న ఆయా అంశాల్లో పోలిక‌లు తీసుకొచ్చి నివేదిక‌లో విశ్లేషించారు.   ఏడిపి అమ‌లు కాని జిల్లాల‌తో పోల్చిన‌ప్పుడు ఏడిపి అమ‌ల‌వుతున్న జిల్లాలు అన్ని అంశాల్లో ఎక్కువ‌గా ప్ర‌గ‌తిని సాధించాయ‌ని ఈ విశ్లేష‌ణ‌లో తేలింది. దీనికి సంబంధించి ఈ నివేదిక‌లో అంశాల‌వారీగా జ‌రిగిన అభివృద్ధి తుల‌నాత్మ‌క గ‌ణాంకాల‌ను ఇచ్చారు. 
ఆరోగ్యం మ‌రియు పోష‌ణ‌కు సంబంధించి క్ర‌మం త‌ప్పకుండా దృష్టి పెట్ట‌డంతోనే ఏడిపి అమ‌ల‌వుతున్న జిల్లాల్లో కోవిడ్ సంక్షోభాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డం జ‌రిగింద‌ని ఈ నివేదిక పేర్కొంది. దీనికి సంబంధించి ఈ నివేదిక‌లో ఒడిషా రాష్ట్రానికి చెందిన మ‌ల్కాన్ గిరి జిల్లాను ఉద‌హ‌రించారు. క‌రోనా సంక్షోభ ప్రారంభ స‌మ‌యంలో ఛ‌త్తీస్ గ‌ఢ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో వున్న మ‌ల్కాన్ గిరి జిల్లాలోకి వ‌ల‌స‌కార్మికులు అనేక మంది తిరిగి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ఏడిపి కింద ఏర్పాటు చేసుకున్న అనేక స‌దుపాయాల‌ను క్యారంటైన్ కేంద్రాలుగా మార్చి కార్మికుల‌ను ర‌క్షించ‌డం జ‌రిగింద‌ని ఈ నివేదిక‌లో పేర్కొన్నారు. 
 ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి భాగ‌స్వాములైన వారందరినీ క‌లుపుకొని పోవ‌డంద్వారా ల‌క్ష్యాల‌ను సాధించ‌డం జ‌రిగింద‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది. ఆయా జిల్లాల్లోని పంచాయ‌తీల‌తోను, ముఖ్య‌మైన పెద్ద‌ల‌తోను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ కోవిడ్ మ‌హ‌మ్మారి వైర‌స్‌పై పోరాటం చేయ‌డం జ‌రిగింద‌ని దీనికి ఏడిపి దోహ‌దం చేసింద‌ని నివేదిక పేర్కొంది. 
ఈ కార్య‌క్ర‌మాన్ని 2018లో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైన‌ప్ప‌టినుంచీ ఈ కార్య‌క్ర‌మంప‌ట్ల ప్ర‌ధాని క‌న‌బ‌రిచిన చిత్త‌శుద్ధిని ఈ నివేదిక ప్ర‌త్యేకంగా పేర్కొంది. 
అంద‌రినీ క‌లుపుకొని ఐక‌మ‌త్యంగా ప‌ని చేయ‌డం, పోటీ త‌త్వం, భాగ‌స్వామ్యం.. ఏడిపిలోని ఈ మూడు అంశాల గురించి ఈ నివేదిక పేర్కొంది. వీటి ద్వారా సాధించిన ఫ‌లితాల‌ను వివ‌రించింది. 
 ఏడిపి అమ‌ల‌వుతున్న జిల్లాల్లో సాంకేతిక‌, పాల‌నాప‌ర‌మైన సామ‌ర్థ్యాలు బ‌లోపేతమ‌య్యాయ‌ని అయితే సామ‌ర్థ్య నిర్మాణ‌ప‌రంగా మ‌రింత దృష్టి పెట్టాల‌ని నివేదిక సూచించింది. పూర్తిస్థాయిలో దీనికోస‌మే ప‌ని చేసే సిబ్బందిని ఏర్పాటు చేయాల‌ని సిఫార‌సు చేసింది. 
 కార్య‌క్ర‌మానికి సంబంధించిన డ్యాష్ బోర్డులో పొందుప‌రిచిన‌ డెల్టా ర్యాంకుల‌ను నివేదిక ప్ర‌శంసించింది. ఆయా జిల్లాల మ‌ధ్య‌న పోటీ సంస్కృతిని నెల‌కొల్పార‌ని త‌ద్వారా కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టిన‌ప్ప‌టినుంచీ ప్ర‌గ‌తి సాధ‌న‌కోసం ఆయా జిల్లాలు పోటీ ప‌డ్డాయ‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది. మొద‌ట్లో ప్ర‌గ‌తిలేని జిల్లాలు కాల‌క్ర‌మంలో పుంజుకున్నాయ‌ని ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా నివేదిక తెలియ‌జేసింది. 
ఈ కార్య‌క్ర‌మం కింద చేప‌ట్టిన ప‌లు విధానాల‌ను ఉత్త‌మ విధానాలుగా ఈ నివేదిక సిఫార‌సు చేసింది. వీటిలో ముఖ్యమైంది అస్సాం రాష్ట్ర గోల్ పారా జిల్లా అధికారులు ప్రారంభించిన‌ గోల్ మార్ట్ ఇ- కామ‌ర్స్ పోర్ట‌ల్. దీని ద్వారా జిల్లాకు చెందిన గ్రామీణ‌, సంప్ర‌దాయ , వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అమ్ముకోవ‌డం జ‌రిగింద‌ని ఈ నివేదిక వివ‌రించింది. కోవిడ్ 19 మ‌హ‌మ్మారి స‌మ‌యంలో జిల్లాలోని రైతులకు ఈ పోర్ట‌ల్ ఉప‌యోగ‌ప‌డింద‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది. గోల్ పారా జిల్లాకు చెందిన న‌ల్ల బియ్యానికి ఈ పోర్ట‌ల్ ద్వారా ఆద‌ర‌ణ పెరిగింద‌ని ఉద‌హ‌రించింది. ఈ ప్ర‌యోగాన్ని చూసి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ చండౌళి జిల్లా కూడా ప్రేర‌ణ పొంది త‌మ జిల్లాలో న‌ల్ల బియ్యం పండించ‌డానికి ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు నివేదిక తెలిపింది. నాణ్య‌త క‌లిగిన న‌ల్ల‌బియ్యాన్ని ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలకు ఎగుమ‌తి చేస్తున్నారు. 
ఈ కార్య‌క్రమానికి సంబంధించి మెరుగుప‌రుచుకోవాల్సిన అంశాల‌ను గురించి కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. ఏడిపికి సంబంధించి అతి త‌క్కువ ప్ర‌గ‌తి న‌మోదైన జిల్లాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల గురించి సూచించారు. ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌కుండా అంద‌రినీ అభివృద్ధి బాట‌లో తీసుకుపోవాల‌నే ఎస్ డిజి ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ఏడిపి ప‌ని చేస్తోంద‌ని ఈ నివేదిక ప్ర‌శంసించింది. 
మొత్తంమీద తీసుకున్న‌ప్పుడు ఏడిపి అనేది సాధించిన ధ‌నాత్మ‌క ప్ర‌భావం ప్ర‌శంస‌నీయంగా వుంద‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది. ఇంత‌వ‌ర‌కూ సాధించిన ప్ర‌గ‌తిని మ‌రింత ముందుకు తీసుకుపోవాల‌ని..ఈ కార్య‌క్ర‌మాన్ని ఇత‌ర రంగాల‌కు, జిల్లాల‌కు విస్త‌రించాల‌ని సిఫార‌సు చేసింది. 
2018 జ‌న‌వ‌రి నెల‌లో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా ఏడిపి ప్రారంభ‌మైంది. దేశ ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌ర‌చ‌డానికి, అంద‌రినీ అభివృద్ది బాట‌లో న‌డిపించ‌డానికి, స‌బ్ కా సాత్ స‌బ్ కా వికాస్ అనే విధానం ప్రకారం దీన్ని ప్రారంభించారు. 

 

***



(Release ID: 1726472) Visitor Counter : 206