పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

కొవిడ్‌పై పోరాటానికి 16 లక్షలకుపైగా టీకాలను నిర్వహించిన జమ్ము విమానాశ్రయం

టీకా శిబిరం ఏర్పాటు చేసిన విమానాశ్రయం, తొలి దశలో 489 మందికి టీకా

Posted On: 10 JUN 2021 4:43PM by PIB Hyderabad

ప్రస్తుతం మన దేశం కరోనాతో తీవ్రస్థాయి పోరాటం చేస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో టీకాలు, ఇతర వైద్య పరికరాల సరఫరా అత్యంత అవసరం. అత్యవసర వైద్య సామగ్రి రవాణాలో జమ్ము విమానాశ్రయం అవిశ్రాంతంగా, చురుకైన పాత్ర పోషిస్తోంది.

    జమ్ము విమానాశ్రయ ఫ్రంట్‌లైన్‌ వారియర్లు ఇప్పటివరకు 16 లక్షలకుపైగా కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలను స్వీకరించి, జమ్ముకశ్మీర్‌ రోగనిరోధక విభాగానికి అందించారు. ఈ విమానాశ్రయం తన ప్రయాణీకులకు సురక్షిత ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. విమానాశ్రయాన్ని శానిటైజ్‌ చేయడంతోపాటు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్దేశించిన ప్రామాణిక కొవిడ్‌ నిబంధనలను విమానాశ్రయ పని ప్రాంతాల్లో, ప్రయాణీకుల విషయంలో పాటిస్తున్నారు. విమాన ప్రయాణీకులకు కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు ఆరోగ్య విభాగానికి అన్ని సదుపాయాలను విమానాశ్రయంలో కల్పించారు.

    జిల్లా యంత్రాంగంతో జమ్ము విమానాశ్రయం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటోంది. జమ్ము కంటోన్మెంట్‌లోని జి.బి.పంత్‌ ఆసుపత్రిలో టీకా శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసింది. జమ్ముకశ్మీర్‌ జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద విమానాశ్రయ సిబ్బంది, విమానాశ్రయ సంబంధిత వ్యక్తులు ప్రాధాన్యత క్రమంలో ఉన్నారు. ప్రాధాన్యత కింద, తొలి దశలో 489 మందికి టీకా వేశారు. మిగిలిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రెండో దశలో టీకా ఇస్తారు. దాదాపు 300 మంది విమానాశ్రయ భద్రత సిబ్బంది (సీఐఎస్‌ఎఫ్‌) కూడా టీకా తీసుకున్నారు.

    కొవిడ్‌ జాగ్రత్తల పట్ల ప్రయాణీకుల్లో అవగాహన కల్పించేందుకు, జమ్ము విమానాశ్రయంలోని విమాన సమాచార ప్రదర్శన బోర్డులు (ఎఫ్‌ఐడీఎస్‌), బ్యానర్లు, పోస్టర్లు, మైకుల్లో ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నారు.

 

***(Release ID: 1726099) Visitor Counter : 68